TS Police Jobs Results News : ఈ ప్రకారంగానే.. పోలీసు ఉద్యోగ ఫలితాలు మళ్లీ ప్రకటించాలి.. ఎందుకంటే..?
జీవో నుంచి కోడ్ నెం.24 TSSP (5000) మినహాయించాలని కోరారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి స్థానిక నిరుద్యోగుల ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. CD1, CD2 ప్రకారం ఫలితాలు ప్రకటించి మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. తప్పుడు ప్రశ్నలను తొలగించి మళ్లీ ఫలితాలు ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును అమలు జరిగేలా చూడాలన్నారు. చాలా జిల్లాల్లో మిగిలిపోయిన ఖాలీలను భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి జిల్లాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకం చేసిన లేఖను ముఖ్యమంత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీ కుందూరు జై వీర్ రెడ్డి, శ్రీమతి పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ బాలు నాయక్, శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి, శ్రీ బీర్ల ఐలయ్య, శ్రీ మందుల సామ్యూల్, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
గతంలో..
తెలంగాణలో కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించి.. మార్కులను లెక్కించి, మళ్లీ ఫలితాలు వెల్లడించాలని రాష్ట్ర పోలీస్ నియామక బోర్డును హైకోర్టు ఆదేశించిన విషయం తెల్సిందే. 122, 130, 144వ నంబర్ ప్రశ్నలను తెలుగులోకి అనువదించలేదని, 57వ ప్రశ్న తప్పుగా ఉన్నందున వాటిని తొలగించాలని తేల్చిచెప్పింది. 2022, ఆగస్టు 30న జరిగిన కానిస్టేబుల్ నియామక తుది రాత పరీక్షలో 23 ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు వినతిపత్రం సమర్పించినా ఎలాంటి బదులివ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు పిటిషనర్లు తెలిపారు. తప్పుగా రూపొందించిన ప్రశ్నలు, ఇచ్చిన తప్పు సమాధానాలను తొలగించాలని కోరడంతో పాటు తెలుగులోకి అనువదించని కొన్ని ప్రశ్నలను సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు రమేశ్ చిల్ల, ఎన్‌ఎస్ అర్జున్ వాదనలు వినిపించారు. వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వు చేసిన న్యాయమూర్తి.. సోమవారం తీర్పు వెలువరించారు. పోలీసు కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ కోసం నిర్వహించిన మెయిన్స్ పరీక్షలో 4 ప్రశ్నలను మినహాయించి, అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు ఇవ్వాలని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డుని ఆదేశిస్తున్నాం. పేపర్‌లను మూల్యాంకనం చేసి, ఆ తర్వాత ఫలితాలను ప్రచురించి, తదుపరి నియామక ప్రక్రియ కొనసాగించాలి’అని తీర్పులో పేర్కొన్నారు.
☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1,2,3&4 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
కానిస్టేబుల్ అభ్యర్థుల్లోనూ గందరగోళం..
కానిస్టేబుల్ నియామక పరీక్షల తుది ఫలితాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. 15,750 మంది పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు. అయితే తాజా తీర్పు మళ్లీ ఫలితాలు వెల్లడించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఫలితాల్లో కానిస్టేబుల్‌గా ఎంపికైన అభ్యర్థుల్లో ఇది తీవ్ర గందరగోళానికి దారితీసింది. నాలుగు మార్కులు కలిపి మళ్లీ ఫలితాలు వెల్లడిస్తే ఉద్యోగాలు ఉంటాయా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.