Uday Kumar Reddy, SP : నాడు ఇక్కడే ఎస్సైగా.. నేడు ఇక్క‌డే ఎస్పీగా..!

ఎస్సైగా పోస్టింగ్‌ పొందిన చోటే ఎస్పీ హోదాలో విధుల్లో చేరడం ఆనందంగా ఉందని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
Uday Kumar Reddy, SP

నూతనంగా విధుల్లో చేరిన ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీతో  ‘సాక్షి’ఇంటర్వ్యూను నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు వెల్లడించారు. 

అంచెలంచెలుగా ఎదుగుతూ..
1991లో పోలీసు శాఖలో ఎస్సైగా విధుల్లో చేరా. ఉట్నూర్‌ ఏరియాలో తుపాకీ భుజాన వేసుకుని అడవులను జల్లెడ పట్టా. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ హిస్టరి పట్టా పొందా. ఉట్నూర్‌ పోలీసు స్టేషన్‌లో ప్రొహిబిషన్‌ ఎస్సైగా కడెం పోలీసు స్టేషన్‌లో ఎస్సైగా పనిచేశా. మావోయిస్టుల కార్యకలాపాలపై దృష్టి సారించి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి వారిని తరిమివేయడంతో ప్రభుత్వం సీఐగా పదోన్నతి కల్పించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఎస్పీ హోదాలో జిల్లాకు వచ్చా. 18 సంవత్సరాల పాటు జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది.

కుటుంబ నేప‌థ్యం:
మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాంచంద్రాపూరం. వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్నలు సుబ్బారెడ్డి, సామ్రాజ్యం. నాతో పాటు ఓ సోదరి ఉంది. నా భార్య అరుణ. ఇద్దరు సంతానం. కుమారుడు సంతోష్, కూతురు సాధన ఉన్నారు. ఇటీవలే వీరి వివాహం జరిగింది. ఎస్సైగా ప్రారంభమైన నా జీవితం అంచెలంచెలుగా ఎదుగుతూ ఎస్పీ స్థాయికి చేరా. ఇదే నెలలో నాన్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ హోదా రావడం సంతోషంగా ఉంది. 

అందుకే ప్రభుత్వం నాకు..
ఆదిలాబాద్‌ జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతా. గతంలో ఎస్సైగా పనిచేసిన సమయంలో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపాం. అందుకే ప్రభుత్వం నాకు సీఐగా పదోన్నతి సైతం కల్పించింది. ఆ అనుభవంతో జిల్లాలో వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తా. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ప్రతీ కదలికపై నిఘా పెంచుతాం.

#Tags