వాన చినుకులు గోళాకారంలో, గుండ్రంగా ఎందుకు ఉంటాయి?

 ద్రవాల ఉపరితలం ఒక సాగదీసిన పొరలాగా ఉంటుంది. అంటే ద్రవాల ఉపరితలానికి సాగే ధర్మం ఉంటుంది. ఈ ధర్మం వల్ల ద్రవాల ఉపరితలం కొంత ‘తన్యత’ (బిగువు) కలిగి ఉంటుంది. ఈ తన్యతను ‘తలతన్యత’ అంటారు. ఈ తన్యత వల్లే చిన్న చిన్న పురుగులు, దోమలు నీటిపై నిలబడినప్పుడు, అందులో మునిగిపోకుండా ఉంటాయి. అంతేగానీ, వాటికేదో ఒక ప్రత్యేకమైన ‘యోగవిద్య’ తెలుసునని కాదు.

ద్రవాలకు స్వేచ్ఛనిస్తే, తలతన్యత వల్ల అవి తక్కువ ప్రదేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తాయి. జ్యామితీయ ఆకారాలలో, అన్నిటికన్నా తక్కువ ఉపరితల వైశాల్యం కలిగి ఉండేది గోళాకారమే. అందువల్లనే ఆకాశం నుంచి స్వేచ్ఛగా జారిపడే వానచినుకులు గోళాకార రూపాన్ని సంతరించుకుంటాయి. ఆ విధంగా వాన చినుకులు గుండ్రంగా, గోళాకారంలో ఉంటాయి.

పరిసరాలు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా వేసవి కాలంలో మన దేహంపై ఏర్పడే చెమట, నీటిలో వెదజల్లబడిన నూనె, సీసాల నుంచి ఒలికి నేలపై పడిన పాదరసం, కొంత ఎత్తు నుంచి సిమెంటు నేలపై పోసిన పాలు గోళాకారంలో గుండ్రని బిందువుల రూపంలో ఉంటాయి. ఇలా ఉండటానికి కారణం ద్రవాలకు ఉండే ‘తలతన్యత’ ధర్మమే.

- లక్ష్మి .... ఈమని
#Tags