Anganwadi Workers Retirement: అంగన్‌వాడీల రిటైర్మెంట్‌.. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌?

నిర్మల్‌ చైన్‌గేట్‌: అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్‌ జిల్లాలో అమలులోకి వచ్చింది. 65 ఏళ్లు దాటిన 27 మంది టీచర్లు, 96 మంది ఆయాల సర్వీస్‌ను అధికారులు నిలిపివేశారు.

దీంతో దశాబ్దాలుగా పిల్లలే లోకంగా గడిపినవారు జూలై 1 నుంచి విధులకు దూరమయ్యారు. మరోవైపు ప్రభుత్వం చెల్లించే రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌పై పెదవి విరుస్తున్నారు. జీవితమంతా పిల్లల కోసం ధారపోశామని, శక్తి ఉడిగిన వయస్సులో కుటుంబం గడవడానికి వేతనంలో సగం పింఛన్‌ రూపంలో నెలనెలా చెల్లించాలని కోరుతున్నారు.

1 నుంచి హాజరు నిలిపివేత..

మహిళా, శిశు సంక్షేమ శాఖలో భాగమైన అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, ఆయాలకు ఇప్పటి వరకు ఎలాంటి రిటైర్మెంట్‌ విధానం లేకపోవడంతో వయస్సు పైబడ్డ వారు సైతం విధుల్లో కొనసాగుతున్నారు. దీంతో 65 ఏళ్లు నిండిన వారు తమ ఉద్యోగాల నుంచి రిటైర్‌ కావాలని ప్రభుత్వం అంగన్‌వాడీల్లో సైతం రిటైర్మెంట్‌ విధానం అమలులోకి తెచ్చింది.

చదవండి: Scholarship Applications: స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోండి.. ఈ సర్టిఫికేట్స్‌ తప్పనిసరి

ఈ విధానం ఈనెల 1 నుంచి అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2024, ఏప్రిల్‌ 30 వరకు 65 ఏళ్లు పైబడిన టీచర్లు, హెల్ప ర్లందరికీ రిటైర్మెంట్‌ వర్తింపజేస్తూ మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్‌ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉత్తర్వుల మేరకు 65 ఏళ్లు నిండిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల అటెండెన్స్‌ నమోదు నిలిపివేశారు. ఈమేరకు జిల్లాలోని ఐసీడీఎస్‌ల పరిధిలోని సీడీపీవోలు, సూపర్‌వైజర్లకు ఆదేశాలు జారీ చేశారు.

నెలకు రూ.150 జీతంతో....

ఐసీడీఎస్‌లో పనిచేస్తున్న వారిలో చాలామంది టీచర్లు, ఆయాలకు మూడు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. అప్పట్లో కేవలం రూ.150 జీతంతో పలువురు అంగన్‌వాడీ టీచర్లుగా చేరారు. అరకొర వేతనాలతో మూడు నాలుగు దశాబ్దాలపాటు పనిచేశారు. ప్రస్తుతం టీచర్లకు నెలకు రూ.13,650, ఆయాలకు రూ.7,800 వేతనం ఇస్తున్నారు.

ఇన్నాళ్లూ వారికి తప్పనిసరి రిటైర్మెంట్‌ లేదు. శక్తి ఉన్నంత వరకు పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకునేవారు. ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగ విరమణ తప్పనిసరి చేసింది. 65 ఏళ్లు పూర్తి చేసుకున్న టీచర్లు, హెల్పర్లు తప్పకుండా రిటైరవ్వాలని ఆదేశించింది.

చదవండి: Post Graduation Courses : డిగ్రీ కళాశాలలో ఈ రెండు పీజీ కోర్సులు మంజూరు.. ద‌రఖాస్తుకు వీరే అర్హ‌లు!

రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ కింద టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు రూ.50 వేలు ఇస్తామని ప్రకటించింది. దీనిపై వారు పెదవి విరుస్తున్నారు. అరకొర వేతనాలతో మూడు నాలుగు దశాబ్దాలు పనిచేశామని, ఇప్పుడు ఈ కొద్దిపాటి డబ్బులతో ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం ఆందోళన

టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని కొంతకాలంగా అంగన్‌వాడీ ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి అన్నిరకాల ప్రయోజనాలు కల్పించడంతో పాటు పెన్షన్‌ ఇస్తున్నారని, తమకు కూడా వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం అంగన్‌వాడీల ఆందోళనను పరిగణనలోకి తీసుకోలేదు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ పెంచకుండానే ఉద్యోగ విరమణను తప్పనిసరి చేస్తూ జీవో జారీ చేసింది.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు..

65 ఏళ్లు నిండిన వారికి రిటైర్మెంట్‌ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మా వద్ద ఉన్న వివరాల ఆధారంగా ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ఖాళీగా ఉండే అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.

– నాగమణి, జిల్లా సంక్షేమాధికారి

వివరాలు

జిల్లాలోని ప్రాజెక్టులు: 4

సెక్టార్లు: 37

మెయిన్‌ అంగన్‌వాడీలు: 816

మినీ అంగన్‌వాడీలు: 110

ఖాళీల భర్తీ ఎప్పుడో..?

65 ఏళ్లు పైబడిన టీచర్లు, ఆయాలు ఈనెల 1 నుంచి విధులకు రావాల్సిన అవసరం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం ఆయా కేంద్రాలను ఎవరు నిర్వహించాలన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. కొన్ని చోట్ల టీచర్లు, మరికొన్ని చోట్ల ఆయాలు కేంద్రాలను నిర్వహిస్తున్నారు.

రిటైర్మెంట్‌తో ఖాళీ అయ్యే పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారన్న విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే జిల్లాలోని కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు లేరు. తాజాగా రిటైర్మెంట్‌తో 27 టీచర్‌ పోస్టులు, 96 ఆయా పోస్టులు ఖాళీ అయ్యాయి.

అంగన్‌వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక విద్య కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేసిన నేపథ్యంలో ఖాళీలతో చిన్నారులకు విద్యాబోధన, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ ఎలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
 

#Tags