20 Students Sick: నార్నూర్‌లో 20మంది విద్యార్థులకు అస్వస్థత

నార్నూర్‌: శ్వాసకోశ సమస్యతో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మండల కేంద్రంలో జూలై 12న‌ రాత్రి చోటు చేసుకుంది.

స్థానిక ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలకు చెందిన దాదాపు 17 మంది, ఆదర్శ పాఠశాలకు చెందిన ఇద్దరు, బాలుర ఆశ్రమ పాఠశాల చెందిన ఓ విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో పలువురికి గతంలోనే శ్వాసకోశ సమస్య ఉన్నట్లు తెలిసింది.

ఆయా పాఠశాలల్లో సాయంత్రం నుంచి ఒక్కొక్కరుగా విద్యార్థులు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డారు. వెంటనే సిబ్బంది వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఇందులో ఏకలవ్య పాఠశాలకు చెందిన విద్యార్థులు రాథోడ్‌ కార్తీక (8వ తరగతి), సీహెచ్‌ హర్షిక (8వ తరగతి), ఆదర్శ పాఠశాలకు చెందిన కావేరి(ఇంటర్‌ సెకండియర్‌)తో పాటు ఆశ్రమ పాఠశాలకు చెందిన ఎస్‌ రవి(మూడో తరగతి)ని మెరుగైన వైద్యం కోసం 108లో ఉట్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చదవండి: Dr VS Alagu Varshini: ప్రతి గురుకులంలో టెలిఫోన్‌!.. విద్యార్థి నేరుగా కార్యదర్శితో మాట్లాడొచ్చు

మిగతా వారు సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఆసుపత్రిలో స్టాఫ్‌నర్సులు తప్ప వైద్యులు లేకపోవడంపై స్థానికులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఆక్సిజన్‌ సిలిండర్లు సైతం అందుబాటులో లేకపోవడంపై మండిపడ్డారు.

ఏటా వర్షాకాలం, చలికాలంలో పలవురు విద్యార్థులు ఇలా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని, ఈ సారి కూడా పునరావృతం అయినట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పులువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
 

#Tags