Tenth Class Public Exams Evaluation : పదో తరగతి మూల్యాంకనానికి పకడ్బందీ చర్యలు ...నిబంధనలు పాటించాలి.

పదో తరగతి మూల్యాంకనానికి పకడ్బందీ చర్యలు ...నిబంధనలు పాటించాలి.
Tenth Class Public Exams Evaluation : పదో తరగతి మూల్యాంకనానికి పకడ్బందీ చర్యలు ...నిబంధనలు పాటించాలి.

మహబూబ్‌నగర్‌ : ఇటీవల పదో తరగతి వార్షిక పరీక్షలు ముగియడంతో విద్యాశాఖ అధికారులు బుధవారం నుంచి పేపర్‌ మూల్యాంకనం చేపట్టనున్నారు. ఈ మేరకు మహబూబ్‌నగర్‌, గద్వాల, నారాయణపేట జిల్లాలకు సంబంధించిన పేపర్లను పాలమూరులోనే వాల్యువేషన్‌ చేసేందుకు అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా జిల్లాకేంద్రంలోని మహబూబ్‌నగర్‌ గ్రామర్‌ స్కూల్‌లో సెంటర్‌ ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి ఏర్పాట్లను డీఈఓ రవీందర్‌ మంగళవారం పరిశీలించారు.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో వాల్యువేషన్‌ పూర్తి చేసేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయా జిల్లాల నుంచి మొత్తం 2.30 లక్షల పేపర్లు వాల్యువేషన్‌ చేయనున్నారు. ఇందుకు గాను 800 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, 150 చీఫ్‌ ఎగ్జామినర్లు, 260 మంది స్పెషల్‌ అసిస్టెంట్లను నియమించారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు అధికారులు ఆర్డర్‌ కాపీలు జారీ చేశారు. అయితే కొంతమంది ఉపాధ్యాయులు తమకు అనారోగ్యం తదితర సమస్యలు ఉండటం వల్ల విధులకు హాజరు కాలేమని, మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.

నిబంధనలు పాటించాలి..

వాల్యువేషన్‌ కేంద్రం వద్ద సిబ్బంది ఇతర అధికారులు తప్పకుండా విద్యాశాఖ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకుల పేర్లతో వాల్యువేషన్‌ కేంద్రం వద్ద ఎలాంటి ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్ట వద్దని డీఈఓ రవీందర్‌ సూచించారు. ముఖ్యంగా వాల్యువేషన్‌ కేంద్రంలోకి ఎలాంటి పరిస్థితుల్లో సిబ్బంది సెల్‌ఫోన్లు తీసుకురావద్దని హెచ్చరించారు. ఉదయం 9 గంటలకు కేంద్రంలోకి వచ్చిన వారిని సాయంత్రం 5 గంటలకు బయటికి పంపిస్తామని.. దీన్ని దృష్టిలో ఉంచుకుని సిబ్బంది మధ్యాహ్న భోజనం తెచ్చుకోవాలని చెబుతున్నారు. ఐడీ కార్డు లేని సంఘాల నాయకులు, ఇతర సిబ్బంది ఎవరూ కేంద్రంలోకి రావొద్దని పేర్కొన్నారు.

#Tags