SCCL Recruitment 2024: సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. 134 ఏళ్లలో ఇలా తొలిసారి..

సింగరేణి(కొత్తగూడెం): తెలంగాణకు మణిహారంగా నిలుస్తూ ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో ఉద్యోగాల భర్తీకి వరుస నోటీఫికేషన్లు వస్తున్నాయి. ఇటీవలే ఎక్స్‌టర్నల్‌ అభ్యర్థులకు సంబంధించి 600, ఇంటర్నల్‌ అభ్యర్దులకు 1,241 పోస్టులతో నోటిఫికేషన్లను విడుదలయ్యాయి. ఇందులో ఎగ్జిక్యూటివ్‌(అధికారుల కేడర్‌) పోస్టులు 305 ఉండగా.. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌(కార్మికుల కేడర్‌)లో 295 పోస్టులు ఉన్నాయి.

ఇక ఇంటర్నల్‌ పోస్టుల్లోనూ 156 పోస్టులు ఎగ్జిక్యూటివ్‌ మినహా మిగతావి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులతో యాజమాన్యం ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు విడుదల చేసింది. కాగా, మొదటి నోటిఫికేషన్‌లో గడువు ముగిసే నాటికి పది 10 రకాల పోస్టులకు సుమారు 15వేల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.

గడిచిన పదేళ్లలో ఇలా...
సింగరేణి సంస్థ గడిచిన పదేళ్లలో విడుదల చేసిన 58 ఎక్స్‌టర్నల్‌ నోటిఫికేషన్ల ద్వారా 4,207 ఉద్యోగాలు భర్తీ చేసింది. అలాగే, 15,256 డిపెండెంట్‌ ఉద్యోగాల నియామకం చేపట్టింది. ఇవికాక సంస్థలో పనిచేసే అభ్యర్థుల(ఇంటర్నల్‌)కోసం 109 నోటిఫికేషన్లతో 3,490 ఉద్యోగాలకు పదోన్నతి కల్పించింది. తద్వారా ఖాళీలు ఏర్పడడంతో కొత్త నియామకాలకు అవకాశం ఏర్పడింది.

BCI Bars These Law Colleges: ఈ కాలేజీల్లో అడ్మీషన్స్‌ రద్దు చేస్తూ బీసీఐ నిర్ణయం.. ఏపీకి చెందిన 2 కాలేజీల్లోనూ..


తొలిసారిగా ఆన్‌లైన్‌లో...
బొగ్గు ఉత్పత్తిలో రారాజుగా విరాజిల్లుతున్న సింగరేణి సంస్థ ఉద్యోగ నియామకాల్లో పరీక్ష జరిగిన రోజే ఫలితాలు వెల్లడించడం ఆనవాయితీగా వస్తోంది. తద్వారా పైరవీలకు తావు లేకపోగా పూర్తిస్థాయి పారదర్శకత ఉంటోంది. అయితే, రానురాను సింగరేణిలో ప్రభుత్వం, కొందరు ప్రజాప్రతినిధుల జోక్యంతో రిక్రూట్‌మెంట్‌ సెల్‌ అబాసు పాలవుతోంది. ఈ చెడ్డపేరు పోగొట్టుకోవడానికి తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ల ఆధారంగా పరీక్షల నిర్వహణ బాధ్యతను ఢిల్లీలోని ఎడ్‌సెల్‌ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ హైదరాబాద్‌తోపాటు ఇతర పట్టణాలలో ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. 134ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి తొలిసారి ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనుండడం విశేషం.

మెరిట్‌ అభ్యర్థులకు న్యాయం జరగాలి
సింగరేణి సంస్థ పరీక్ష జరిగిన రోజే ఫలితాలను విడుదల చేసే విధానానికి శ్రీకారం చుట్టింది. అయితే, ఇటీవల సంస్థ పేరు అభాసుపాలైంది. దీంతో నిర్వహణ బాధ్యతలు ఇంకో సంస్థకు అప్పగించడం బాగుంది. అయితే, పరీక్షలకు సంబంధించి సిలబస్‌ కూడా ఇస్తే చదువుకోవడానికి వీలయ్యేది.
– వంశీకృష్ణ, ఈఅండ్‌ఎం అభ్యర్థి

 

AP TET 2024 Again Exam : మళ్లీ టెట్‌-2024.. ఈ సారి మెగా డీఎస్సీతో పాటు టెట్ కూడా..

పారదర్శకత కోసమే ఎడ్‌సెల్‌కు...
సింగరేణి రిక్రూట్‌మెంట్‌ సెల్‌పై అభ్యర్థులకు నమ్మకం కల్పించడం.. పారదర్శకత కోసమే ఈసారి పరీక్షల నిర్వహణ బాధ్యతను ఎడ్‌సెల్‌ సంస్థకు అప్పగించాం. పరీక్ష జరిగిన రోజే ఏ సంస్థ ఇవ్వని విధంగా సింగరేణి ఫలితాలను విడుదల చేస్తోంది. ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగిస్తాం.
– ఎన్వీకే.శ్రీనివాస్‌, సింగరేణి డైరెక్టర్‌ (పా)

#Tags