Foreign Education: విదేశీ విద్యా దీవెనతో పేద విద్యార్థులకు ఉన్నత చదువులు

తుమ్మపాల: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు పేద విద్యార్థులకు అవకాశం కలుగుతోందని కలెక్టర్‌ రవిపట్టాన్‌శెట్టి తెలిపారు.

డిసెంబ‌ర్ 20న‌ తాడేపల్లిలో సీఎం జగన్‌ చేతుల మీదుగా మూడవ విడత జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ప్రారంభకార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టర్‌ కార్యాలయంలో వీక్షించారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో గల టాప్‌ 50 విశ్వవిద్యాలయాల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, ఇతర కోర్సుల్లో విద్యను అభ్యసించే రాష్ట్ర విద్యార్థులకు శత శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నట్టు చెప్పారు.

చదవండి: Scholarship: ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్‌షిప్‌లకు ప్రకటన విడుదల.. ఎంపికైతే ఏటా రూ.50వేలు ఉపకార వేతనం

ఆర్థికంగా వెనుకబడిన వారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అమెరికాలోని కార్నర్‌ యూనివర్సిటీలో మాస్టర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదువుతున్న జిల్లాకు చెందిన సుదీప (ఓబీసీ)కు రూ.13,78,666, కజకిస్తాన్‌లో అల్‌ ఫరాబీ నేషనల్‌ యూనివర్సిటీలో చదువుతున్న ఎస్సీ కులానికి చెందిన బొడ్డు దీన రాచెల్‌కు రూ.6,00,400 కలిపి మొత్తం రూ.19,79, 068 అందించినట్టు చెప్పారు.

అదేవిధంగా సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీకి సిద్ధమవుతున్న మొల్లి మధు ప్రతాప్‌, గన్నంరాజు సత్య శివరాం రాజవంశీ, కొరుప్రోలు సత్య సాయిరాజ్‌, అమలకంటి కృష్ణ వర్ధన్‌లకు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున అందజేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్‌పర్శన్‌ భీశెట్టి వరాహ సత్యవతి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

#Tags