Good News : వేతనం పెంపుకు అంగీకారం.. సమ్మె విరమించిన ఉద్యోగులు..

సాక్షి ఎడ్య‌కేష‌న్ : గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో శనివారం నుంచి విధుల్లోకి చేరుతున్నట్లు సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ ప్రధాన కార్యదర్శి కళ్యాణి, అధ్యక్షుడు హరిబాబు తెలిపారు.

గురువారం దీక్షా శిబిరం వద్ద వారు విలేకరులతో మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సమ్మతించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 

23 శాతం వేతనాలను పెంచుతూ..

నవంబరు 20వ తేదీ నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని, బుధవారం రాత్రి జరిగిన చర్చలతో మంత్రి బొత్స సత్యనారాయణతోపాటుగా రాష్ట్ర స్థాయి అధికారులు పలువురు పాల్గొన్నారని, హెచ్‌ఆర్సీ పాలసీకి ఎస్‌ఎస్‌ఏ, జీఏడీ ఫైనాన్స్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారని వెల్లడించారు. అలాగే 2017 నుంచి వేతనాలు పెరగని వారికి 23 శాతం వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయనున్నారని, పార్ట్‌టైం ఇన్‌స్పెక్టర్‌ని ఒకేషనల్‌ టీచర్‌గా మారుస్తున్నట్లు తెలిపారు. పీఎఫ్‌పై సానుకూలంగా స్పందించారని చెప్పారు.

విధులకు హాజరు..
సీఆర్‌ఎంటీలను క్లస్టర్‌ పరిధిలో ఉంచి సీఆర్టీగా మార్చనున్నారని, కారుణ్య నియామకాలు చేపట్టడంతోపాటు సమ్మెలో తొలగించిన ఉద్యోగులను తిరిగి నియమించడం, సమ్మె కాలానికి వేతనం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్లు వివరించారు. నిరవధిక సమ్మెకు సహకరించిన ఉపాధ్యాయ సంఘాలకు, ఉద్యోగ, కార్మిక సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి, ఇతర అధికారులను కలిసి రేపటి నుంచి విధులకు హాజరుకానున్నట్లు సమగ్ర శిక్ష జేఏసీ నాయకులు తెలిపారు.

#Tags