AP Contract Employees Remove From Jobs : ఏపీలో భారీగా కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు.. కారణం ఇదే..!
గడచిన మూడు రోజుల్లోనే సుమారు 200 మందిని ఉన్నట్టుండి తొలగిస్తూ ఎండీ ప్రవీణ్‌కుమార్ ఆదేశాలిచ్చారు. ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయం, అన్నమయ్య జిల్లాలోని మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టు, ప్రకాశం జిల్లా చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ ప్రాజెక్టులో పనిచేసే చిరుద్యోగులపై రాజకీయ ముద్రవేసి మరీ ప్రభుత్వం పక్కనపెట్టింది.
కొన్ని వందల మంది ఉద్యోగులను..
నవంబర్ 20వ తేదీన సుమారు 90 మంది అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సేవలు అవసరం లేదని ఎండీ ఆదేశాలిచ్చారు. అంతకుముందు 18వ తేదీన సుమారు వంద మందికిపైగా అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలిచ్చారు. వీరిలో ఎక్కువమంది మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. ఆ తర్వాత విజయవాడలోని ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయం, చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ ప్రాజెక్టులో పనిచేసేవారు ఉన్నారు. గత ప్రభుత్వంలో నియమించారనే కారణం చూపి వారందరినీ ఉన్న ఫళాన వెళ్లగొట్టారు. అంతకుముందు మరో 200 మందిలో సగం మందికి కాంట్రాక్టు ముగియడంతో పొడిగించకుండా బయటకు పంపారు.
ఎక్కువ మంది అటెండర్లు, డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ అసిస్టెంట్లులే..
కాంట్రాక్టు ఇంకా మిగిలి ఉన్న వారిని సైతం ఏదో ఒక సాకు చూపి తొలగించారు. తొలగింపునకు గురైన వారిలో ఎక్కువ మంది అటెండర్లు, డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ అసిస్టెంట్లు ఉన్నారు. విజయవాడ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో డీఈఓలు, డీపీఓలు, ఇతర క్యాడర్ ఉద్యోగులున్నారు. గత ప్రభుత్వంలో నియమితులైన వారే కాకుండా పదేళ్ల నుంచి పనిచేస్తున్న వారిని కూడా అన్యాయంగా తొలగించినట్టు తెలుస్తోంది.
నిబంధనలు ఉన్నా.. కేవలం కక్ష్య సాధింపుతోనే...
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఏ కారణం లేకుండా తొలగించకూడదనే నిబంధనలు ఉన్నా ఉన్నతాధికారులు లెక్క చేయలేదు. వారందరినీ నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్ ఇచ్చి, ఇంటర్వ్యూ నిర్వహించి నియమించారు. కార్యాలయంలోనూ, సంబంధిత ప్రాజెక్టుల్లోనూ అవసరాన్ని బట్టి ఈ నియామకాలు జరిపినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. కానీ ఎలాంటి కారణం లేకుండానే రాజకీయ కోణంలో అందరినీ ఒకేసారి పక్కనపెట్టేయడంతో వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఉద్యోగం తీసేస్తే తమ కుటుంబాలు ఏం కావాలని వాపోతున్నారు.
➤☛ AP Grama Ward Volunteers : గ్రామ/వార్డు వలంటీర్లను తక్షణమే విధుల్లోకి.. నెలకు రూ.10 వేలు... ?