Success Story : భళా.. కైవల్య.. భళా.. 15 ఏళ్లకే నాసా కోర్సు పూర్తి.. వ్యోమగామి కావడమే..

ఈ అమ్మాయి ... చిన్న వయస్సులోనే పెద్ద లక్ష్యం పెట్టకున్నారు. ఆ దిశగా అడుగులు వేశారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 మందికే ఈ అవకాశం లభిస్తోంది.

అది భారత్‌ నుంచి ఎంపికైన వారిలో కైవల్యరెడ్డి ఒకరు. ఈ నేపథ్యంలో కైవల్యరెడ్డి కుటుంబ వివరాలు.. సాధించిన విజయాలు మీకోసం ప్రత్యేకంగా..

ప్రపంచవ్యాప్తంగా 50 మందిలో..
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు  పట్టణానికి చెందిన కుంచాల కైవల్యరెడ్డి (15) వ్యోమగామి కావాలన్న కలను నెరవేర్చుకునే దిశగా ఓ అ­డుగు ముందుకేసింది. నాసా అందిస్తున్న ఐఏఎస్‌పీ (ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌) కో­ర్సు­ను విజయవంతంగా పూర్తి చేసింది. ఔత్సాహిక విద్యార్థులను ప్రోత్సహించేందుకు అమెరికాలోని ఎ­యిర్‌స్పేస్‌ అండ్‌ రాకెట్‌ సెంటర్, నాసా సంయుక్త ఆధ్వర్యంలో ఏటా నవంబర్‌లో ఇంటర్నేషనల్‌ ఎయి­ర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రాం (ఐఏఎస్‌పీ) శిక్షణ అందిస్తోంది. విద్యార్థులకు 10 రోజుల పాటు వ్యోమగామికి సంబంధించిన పలు ఆంశాలపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 మందికే ఈ అవకాశం లభిస్తోంది. 2023లో భారత్‌ నుంచి ఎంపికైన వారిలో కైవల్యరెడ్డి ఒకరు.

సొంతంగా విమానం నడపడం..
ఆమె ప్రస్తుతం ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. అతి చిన్న వయసులో ఐఏఎస్‌పీకి ఎంపికై శిక్షణ పూ­ర్తి చేస్తున్న భారతీయురాలిగా రికార్డు సైతం నమోదు చేసింది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు ముందస్తుగా ఇచ్చే శిక్షణను నాసా ద్వారా అందించారు. ఇందులో భాగంగా సొంతంగా విమానం నడపడం, మల్టీ యాక్సెస్‌ ట్రైనింగ్, జీరో గ్రావిటీ, స్కూబా డైవింగ్‌ తదితర ఆంశాలల్లో కైవల్య శిక్షణ తీసుకుంది. 

కైవల్య సాధించిన విజయాలు ఇవే..

☛  ఆస్టరాయిడ్‌ను గుర్తించి.. స్పేస్‌ పోర్ట్‌ ఇండియా ఫౌండేషన్‌ (న్యూఢిల్లీ) అంబాసిడర్‌ బృంద సభ్యురాలిగా చిన్నతనంలోనే కైవల్యరెడ్డి ఎంపికైంది.  
☛ అంతరిక్ష పరిశోధన రంగంలో ఏపీ తరఫున చిన్నప్రాయంలోనే గుర్తింపు తెచ్చుకున్న  కైవల్యరెడ్డిని 2023లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ప్రభుత్వం తరఫున రూ.లక్ష నగదు బహుమతి అందించారు.
☛ కైవల్య ఇటీవల అంతర్జాతీయ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అవార్డు సొంతం చేసుకుంది. 
– జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్‌ అస్ట్రానమి, ఆస్ట్రో ఫిజిక్స్‌ అంతర్జాతీయ స్ధాయిలో నిర్వహించిన ఆన్‌లైన్‌ ప్రతిభా పోటీలలో కైవల్యరెడ్డి మూడు రౌండ్లలో ప్రతిభ కనబరిచి సిల్వర్‌ ఆనర్‌ను సాధించింది. 

నా లక్ష్యం ఇదే.. : కుంచాల కైవల్యరెడ్డి

వ్యోమగామి కావడమే లక్ష్యంగా నాసా ఐఏఎస్‌పీ కోర్సును విజయవంతంగా పూర్తి చేశా­ను. నా లక్ష్యానికి ఇది తొలి మెట్టు. ఈ స్ఫూర్తితో భవిష్యత్‌లో ఖగోళ శాస్త్రవేత్తగా ఎదగాలన్నదే నా లక్ష్యం. ప్రభుత్వం నుంచి రూ.6.70 లక్షలు మంజూరు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు.

#Tags