Tomorrow Bandh in Telangana : రేపు తెలంగాణ వ్యాప్తంగా బంద్‌.. కారణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : రేపు తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా బంద్ ప్ర‌క‌టించారు. ఎందుకంటే.. నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా రేపు తెలంగాణ‌లో బంద్ ప్ర‌క‌టించారు నిరుద్యోగ సంఘ నాయ‌కులు.

గాంధీ దవాఖాన వ‌ద్ద.. గ్రూప్‌-2 పోస్టులు పెంచాల‌ని, అలాగే మెగా డీఎస్సీ ప్ర‌క‌టించాల‌ని.. నిరుద్యోగ JAC నేత మోతీలాల్‌నాయక్‌ వారం రోజులుగా నిరుద్యోగుల తరఫున ఆమరణ దీక్ష చేస్తున్న విష‌యం తెల్సిందే. 

➤ TS Mega DSC 2024 Demand : 25000 ఉద్యోగాల‌తో మెగా డీఎస్సీకి నోటిఫికేష‌న్ ఇవ్వాలి.. లేదంటే..!

ఈయ‌న ఆమరణ నిరాహారదీక్షకు నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు వ‌స్తుంది. నేడు గాంధీ ఆస్ప‌త్రికి వ‌ద్ద‌కు చేరుకున్న బ‌క్క జ‌డ్స‌న్‌ను పోలీసులు అరెస్టుల చేశారు. ఈ సంద‌ర్భంగా నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగం రేపు తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా ఆయ‌న బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్ వ‌ల్ల జూలై 2వ తేదీన (మంగ‌ళ‌వారం) తెలంగాణ‌లోని స్కూల్స్‌, కాలేజీల‌కు కాలేజీల‌కు సెల‌వులు ఇస్తారో.. లేదో ఇంకా క్లారిటీ రాలేదు.

మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు కూడా..

అలాగే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి వెంటనే నిరుద్యోగులతో చర్చలు జరపాలని, మోతీలాల్‌ నాయక్‌ ఆమరణ నిరాహారదీక్షను విరమింపజేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. వారం రోజులుగా నిరుద్యోగుల తరఫున ఆమరణ దీక్ష చేస్తున్న మోతీలాల్‌నాయక్‌ను  సికింద్రాబాద్‌ గాంధీ దవాఖానలో పరామర్శించారు.

ప్రభుత్వం దిగివచ్చే వరకు..

మోతీలాల్‌ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దీక్ష విరమించాలని అందరి తరఫున మోతీలాల్‌కు తాము విజ్ఞప్తి చేశామని, కానీ, లక్షలాదిమంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం దిగివచ్చే వరకు తన దీక్ష కొనసాగుతుందని ఆయన తమతో చెప్పారని హరీశ్‌రావు వివరించారు. మోతీలాల్‌కు ఆరోగ్యం క్షీణిస్తున్నదని, ఆయనకు హాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. 

సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వచ్చి..
సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వచ్చి మోతీలాల్‌నాయక్‌తో మాట్లాడి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను ఇస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వరకు నిరుద్యోగుల తరఫున బీఆర్‌ఎస్‌ పోరాడుతుందని తేల్చిచెప్పారు. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క బాండ్‌ పేపర్‌ రాసిచ్చారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దానిని ఎందుకు విస్మరించారని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ప్రజాభవన్‌కు వెళ్లి చిన్నారెడ్డి కాళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చిందని నిలదీశారు. 

అధికారంలోకి వస్తే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను..
నిరుద్యోగుల కోసం ఆనాడు ప్రొఫెసర్‌ కోదండరాం, రియాజ్‌, బల్మూరి వెంకట్‌, రేవంత్‌రెడ్డి అశోక్‌నగర్‌లోని కోచింగ్‌ సెంటర్లకు రాహుల్‌గాంధీని తీసుకొచ్చారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీలు ఇప్పించారని, బస్సు యాత్రలు నిర్వహించారని తెలిపారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలైందని, జాబ్‌ నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నిరుద్యోగులను నాడు రెచ్చగొట్టిన ప్రొఫెసర్‌ కోదండరాం ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.

వీరికి మ‌ద్ద‌తుగా..
ఉప్పల్‌ ఎమ్మె ల్యే బీ లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, ముఠా జయసింహ, మాజీ ఎమ్మెల్యే రవీందర్‌నాయక్‌, ఫ్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌, బక్కా జడ్సన్‌, సేవాలాల్‌ సేన అధ్యక్షుడు సంజీవ్‌నాయక్‌, బంజారా సేవా సంఘం అధ్యక్షుడు ఇస్లావత్‌ రాంచందర్‌నాయక్‌, బీసీ జనసభ అధ్యక్షుడు రాజారామ్‌ యాదవ్‌, నిరుద్యోగ యువకులు పెద్ద ఎత్తున హాజరయి.. వీరి మ‌ద్ద‌తు తెలిపారు.

మోతీలాల్‌కు భారీగా మద్దతు..
నిరుద్యోగుల పక్షాన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా విద్యార్థి నేత మోతీలాల్‌ నాయక్‌కు బీఆర్‌ఎస్‌ సహా వివిధ పక్షాలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నాయి. గాంధీ దవాఖానకు వెళ్లిన ఎమ్మెల్యే హరీశ్‌రావు సహా పలువురు నేతలు మోతీలాల్‌ నాయక్‌ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ, యువజన నేతలు, ఓయూ ప్రొఫెసర్లు నిరుద్యోగుల ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నారు.

చర్చలు విఫలం.. కానీ..
గాంధీ దవాఖానలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్‌తో ఆదివారం రాత్రి ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్‌ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తాను సీఎంతో మాట్లాడి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పినప్పటికీ మోతీలాల్‌ ససేమిరా అన్నారు. సీఎం స్పష్టమైన హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తానని తెగేసి చెప్పడంతో వెంకట్‌ వెనుదిరిగారు. నిరుద్యోగులు ప్రధానద్వారం వద్ద బల్మూరిని ఘెరావ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండటంతో పోలీసులు అతనిని వెనుక గేట్‌ నుంచి మరొక వాహనంలో పంపించారు. 

మోతీలాల్‌ను కలవడానికి వచ్చిన నేతలు రియాజ్‌, మానవతారాయ్‌, చెరగొండ వెంకటేశ్‌, చనగాని దయాకర్‌, బాల లక్ష్మి, నిజాన రమేశ్‌ తదితరులనూ నిరుద్యోగులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు నిరుద్యోగులను శాంతింపజేసి నేతలను లోపలికి పంపించారు. తక్షణమే నిరుద్యోగులతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చలకు పిలువాలని విద్యార్థి నేతలు డిమాండ్‌ చేశారు. సీఎంతో చర్చించడానికి ప్రయత్నిస్తామని నేతలు వారికి హామీ ఇచ్చారు. 

మా డిమాండ్లులు ఇవే..
➤ గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలి
➤ గ్రూప్-2లో 2వేలు, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలి
➤ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
➤ 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి
➤ గురుకుల టీచర్ పోస్టులు బ్యాక్‌లాగ్‌లో పెట్టకూడదు
➤ నిరుద్యోగులకు రూ.4వేల భృతి, 7 నెలల బకాయిలు ఇవ్వాలి

#Tags