Hindi Language: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హిందీ తప్పనిసరి

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు రోజువారీ విధుల్లో తప్పని సరిగా అధికార భాష హిందీని ఉపయోగించాలని విజయవాడ డివిజన్‌ ఏడీఆర్‌ఎం, అదనపు ముఖ్య రాజభాష అధికారి ఎం.శ్రీకాంత్‌ పేర్కొన్నారు.

 విజయవాడ రైల్వే డివిజనల్‌ కార్యాలయంలో డిసెంబ‌ర్ 13న‌ 185వ డివిజన్‌ అధికార భాష అమలు కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏడీఆర్‌ఎం శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. ముందుగా డివిజన్‌లో అధికార భాష హిందీ అమలు లక్ష్యాలను అధిగమించడంపై పలు శాఖల అధికారులను అభినందించారు.

డివిజన్‌లో నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి 83 శాతం రోజువారీ విధుల్లో హిందీలో ఉత్తరప్రత్యుత్తరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జాతీయ సమైక్యత కోసం అధికారిక భాష అమలు ప్రాముఖ్యతను వివరించారు.

చదవండి: హిందీ భాష‌పై ద‌క్షిణాది రాష్ట్రాల నిర‌స‌న‌లు?

ఉద్యోగులు రోజువారీ విధుల్లో హిందీ భాషను ఉపయోగించడాన్ని బాధ్యతగా తీసుకోవా లని పేర్కొన్నారు. డివిజన్‌లో అధికార భాష అమలులో సాధించిన పురోగతిని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా రాజభాష అధికారి ఆశా మహేష్‌ వివరించారు. గత త్రైమాసికంలో డివిజన్‌తో పాటు పలు యూనిట్లలో నిర్వహించిన హిందీ వర్కుషాపులు, సెమినార్‌లు, శిక్షణ తరగతుల గురించి వివరించారు.

రాజభాష అమలు కోసం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని కోరారు. హిందీ అనువాదం కోసం ఉద్యోగులు ‘కాంతస్త్‌ యాప్‌’, వెబ్‌ సాఫ్ట్‌ వేర్‌ను ఉపయోగించాలని ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.

#Tags