TREI-RB: ప్రతి ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాల్సిందే!

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల పోస్టుల పరీక్షలు రాసిన అభ్యర్థుల నుంచి ఆప్షన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. సెప్టెంబర్‌ 21 నుంచి 30 వరకు ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీ), అక్టోబర్‌ 3 నుంచి 9 వరకు పాఠశాలల్లోని లైబ్రేరియన్, ఫిజికల్‌ డైరెక్టర్, డ్రాయింగ్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్‌ టీచర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆప్షన్లు ఇవ్వాలని గురుకుల బోర్డు ఆదేశించింది.
ప్రతి ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాల్సిందే!

జోన్లు, సొసైటీల వారీగా ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు ఇవ్వాలని.. ఈ క్రమంలో అవకాశమున్న ప్రతి ఆప్షన్‌ను తప్పకుండా ఎంపిక చేసుకుంటేనే ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. జోన్ల వారీగా అర్హత మార్కుల్లో తేడాలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఆప్షన్‌ విలువైనదేనని.. ఒక్క ఆప్షన్‌ వదులుకున్నా ఒక అవకాశం వదిలేసుకున్నట్లేనని స్పష్టం చేస్తున్నారు.

చదవండి: Guest Lecturers: అతిథి లెక్చరర్ల నియామకానికి ఇంటర్వ్యూలు

ఐదు సొసైటీల పరిధిలో..

ప్రస్తుతం ఐదు గురుకుల సొసైటీల పరిధిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. రాష్ట్రంలోని ఏడు జోన్ల పరిధిలోని ఉద్యోగాలకు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక్కో అభ్యర్థి గరిష్టంగా 35 ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాధాన్యతా క్రమంలో వాటిని ఎంపిక చేసుకుంటూ ఆప్షన్‌ పేజీని పూర్తి చేయాలి. మహిళా అభ్యర్థులకు అదనంగా బాలికల విద్యా సంస్థల కేటగిరీ ఉండటంతో వారు 70 ఆప్షన్లు ఇవ్వాలి.

మల్టీజోనల్‌ స్థాయిలోని డిగ్రీ లెక్చరర్, జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తు సమయంలోనే ఆప్షన్లు స్వీకరించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ).. జోనల్‌ స్థాయి పోస్టులకు మాత్రం ఇప్పుడు ఆప్షన్‌ అవకాశాన్ని కల్పించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కేటగిరీల వారీగా మెరిట్‌ జాబితాలను విడుదల చేయనుంది.

చదవండి: Inter Admissions: గురుకులంపై గురి... ఏయే సంస్థల్లో ఎంత మంది ఫస్టియర్‌ విద్యార్థులు చేరారంటే?

వచ్చే నెల రెండో వారంలో..

రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ అర్హత పరీక్షల ను నిర్వహించిన బోర్డు.. ఇప్పుడు ప్రాథమిక జాబితా ల తయారీకి ఉపక్రమించింది. ప్రస్తుతం కళాశాల విద్య కమిషనరే ట్, ఇంటర్‌ బోర్డు పరిధిలో డిగ్రీ లెక్చ రర్లు, జూనియర్‌ లెక్చరర్లకు సంబంధించి అర్హత పరీక్షలు జరుగుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. పరీక్షలు పూర్తయ్యాక మెరిట్‌ జాబితాలను విడుదల చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాథమిక మెరిట్‌ జాబితాల విడుదలలో జాప్యం జరిగినట్టు తెలుస్తోంది.

వచ్చేనెల మొదటివారంతో టీఎస్‌పీఎస్సీ పరీక్షలు పూర్తవు తాయి. ఆ తర్వాత గురుకుల బోర్డు ప్రాధాన్యత క్రమంలో ప్రాథమిక మెరిట్‌ జాబితాలను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ముందుగా డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల జాబితా విడుదల చేసి, డెమో పరీక్షలు నిర్వహిస్తారు. వాటి తుది మెరిట్‌ జాబితా ప్రకటించాక.. జూనియర్‌ లెక్చరర్‌ డెమో పరీక్షలు, అనంతరం పీజీటీ, టీజీటీ తదితర కేటగిరీలకు సంబంధించిన ఫలితాలను క్రమంగా వెల్లడించేలా బోర్డు అధికారులు కార్యాచరణ రూపొందించారు. 

#Tags