Department of Education: టీచర్ల బదిలీలు, పదోన్నతులపై ముందుకే

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీల విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గకూడదని విద్యాశాఖ తీర్మానించుకుంది.

న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో పాఠశాల విద్య కమిషనర్‌ దేవసేన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

ఎన్నో ఏళ్లుగా పదోన్నతులు, బదిలీలు చేపట్టకపోవడంతో విద్యాశాఖ నిస్తేజంగా ఉందని ఆమె అనేక సందర్భాల్లో ఉపాధ్యాయ సంఘాల వద్ద అభిప్రాయపడ్డారు. 

తాజాగా హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ వద్ద ఈ కేసు విచారణకు రాగా, బదిలీలు, పదోన్నతులపై న్యాయస్థానం అధికారుల తీరును ప్రశ్నించింది. దీంతో ఈ ప్రక్రియకు బ్రేక్‌ పడుతుందని ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ మొదలైంది.

చదవండి: Good News For Government Teachers 2024 : టీచ‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌.. 10000 మందికి పైగా పదోన్నత‌లు.. వీరికి మాత్ర‌మే..

కోర్టు పరిణామాల తర్వాత పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉన్నతాధికారులను కలుస్తున్నారు. దీనిపై పాఠశాల విద్య కమిషనర్‌ ఓపికగా వారిలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. 

మరోవైపు హైకోర్టు అభ్యంతరాలపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు తెలిసింది. ఇప్పటికే మల్టీజోన్‌–1 పరిధిలో ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లు పూర్తయ్యాయి. మల్టీజోన్‌–2 పరిధిలో ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అనేక మంది టీచర్లు బదిలీలు, పదోన్నతులు పొందారు.

ప్రక్రియను నిలిపివేస్తే ఈ విద్యా సంవత్సరంలో బోధన సాగడం కష్టమని అధికారులు సీఎంకు పంపిన నివేదికలో పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.  

చదవండి: Wanted Teachers: ఫిలింనగర్‌ పాఠశాలకు టీచర్లు కావలెను!

అంతా పకడ్బందీగానే.. 

టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల పేరెత్తితే తరచూ కోర్టు వివాదాలు వెంటాడుతుంటాయి. 2023లోనూ విద్యాశాఖ ఇలాంటి అనుభవాలే చూసింది. స్పౌజ్‌లు, పండిట్లు, పీఈటీలు, సీనియారిటీ వ్యవహారం అనేక చిక్కుముడులు వెంటాడాయి. దీంతో గత ఏడాది షెడ్యూల్‌ ఇచ్చినా ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యాశాఖపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులు నిర్ణయించారు. టెట్‌ అర్హత ఉన్న టీచర్లకు మాత్రమే పదోన్నతి కల్పించాలన్న కేంద్ర నిబంధనలపై గత ఏడాది కొంతమంది కోర్టుకెళ్లారు. దీంతో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయింది. 

ఈసారి ఇలాంటి చిక్కులు తలెత్తకుండా అధికారులు ముందే న్యాయ సలహాలు తీసుకున్నారు. ఏయే అంశాలపై ఇబ్బందులు వచ్చే వీలుందని, వాటిని ఎలా ఎదుర్కొనాలనే విషయాలపై దేవసేన కసరత్తు చేశారు. అయినప్పటికీ టెట్‌ అర్హతపై సింగిల్‌ జడ్జి తీర్పు, డివిజన్‌ బెంచ్‌కు వెళ్లడం, అక్కడ పాఠశాల విద్య కమిషనర్‌ సమాధానం చెప్పాల్సి రావడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. అయితే, డివిజన్‌ బెంచ్‌ ఇప్పటివరకూ ప్రక్రియను నిలిపివేయాలని ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని అంటున్నారు. దీంతో అనుకున్న ప్రకారం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. 

నేటి నుంచి మల్టీ జోన్‌–2లో... 

మల్టీజోన్‌–1 పరిధిలో 10వేల మంది టీచర్లకు పదోన్నతులు దక్కాయి. ఎస్‌జీటీలు, పీఈటీలు, భాషా పండితులు దాదాపు 10 వేల మంది బదిలీ అయ్యారు. కొన్నిచోట్ల ఎస్‌జీటీల బదిలీ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. వీటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.

మరోవైపు గురువారం నుంచి మల్టీజోన్‌–2 పరిధిలో బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. 

హైదరాబాద్‌తో కలుపుకొని మొత్తం 14 జిల్లాలు మల్టీజోన్‌–2 పరిధిలో ఉన్నాయి. ముందు స్కూల్‌ అసిస్టెంట్లకు బదిలీలు చేపట్టాక, ఎస్‌జీటీలకు పదోన్నతి కల్పిస్తారు. ఆ తర్వాత వీళ్లను బదిలీ చేస్తారు. ఈ జోన్‌ పరిధిలో 10 వేల మంది ప్రమోషన్లు పొందుతారు.

ఇదేస్థాయిలో బదిలీలు కూడా జరుగుతాయి. అయితే, రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రక్రియపై కోర్టు వివాదం ఉండటంతో ప్రక్రియ ఆగిపోయింది. ఏదేమైనా కమిషనర్‌ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో బదిలీలు, పదోన్నతులపై టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   

#Tags