5th Class to Inter Admissions: అక్రమ అడ్మిషన్లు..! ఒక్కోసీటుకు ఇంత వసూలు..
రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ఇలా..
మైనారిటీ గురుకులాల్లో ప్రవేశానికి ఎలాంటి అడ్మిషన్ టెస్ట్ నిర్వహించడం లేదు. పేద మైనారిటీ విద్యార్థులు 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు నేరుగా ప్రవేశం పొందవచ్చు. ముస్లిం మైనారిటీలకు 64 శాతం, క్రిస్టియన్ మైనారిటీలకు 7శాతం, జైనులు, పార్శీలకు ఒక శాతం, బుద్ధిస్టు, సిక్కులకు ఒక శాతం.. మొత్తంగా ప్రవేశాల్లో మైనారిటీ కోటా కింద 75 శాతం రిజర్వేషన్ ఉంది.
నాన్ మైనారిటీలకు 25 శాతం.. అందులో బీసీలకు 12 శాతం, ఎస్సీలకు 6శాతం, ఎస్టీలకు 4 శాతం, ఓసీలకు 3 శాతం ఇవ్వాలనే నిబంధన ఉంది. ఈ లెక్కన 80 సీట్లలో 75 శాతం మైనారిటీలకు, 25 శాతం నాన్ మైనారిటీలకు ప్రవేశాలు కల్పిస్తారు. అయితే మైనారిటీ కోటాలో ఖాళీలు భర్తీ కావడంలేదనే సాకుతో నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ నాయకులు, పైరవీకారులు ఒక్కో నాన్ మైనారిటీ విద్యార్థి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారు.
తమకు తెలిసిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను హైదరాబాద్‌లోని టెమ్రిస్ సెక్రటరీ కార్యాలయంలో అందజేసి.. అక్కడ అనుమతి పొందిన నాన్ మైనారిటీ కోటా జాబితాలను జిల్లాలోని గురుకులాల ప్రిన్సిపాళ్లకు పంపిస్తూ అక్రమంగా అడ్మిషన్లు పొందుతున్నారు.
ఒక్కోసీటుకు రూ.30 నుంచి రూ.50 వేలు.
ఉమ్మడి జిల్లాలో మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు 16 ఉండగా.. ఇందులో ఎనిమిది బాలుర, ఎనిమిది బాలికల కోసం ఏర్పాటు చేశారు. వీటిలో సీటు పొందాలంటే ఫుల్ డిమాండ్ ఉంది. సీటు కావాలంటే సిఫారసు లెటర్ అవసరం తప్పనిసరి. ఆ లెటర్ కావాలంటే సీటుకు రూ.30 నుంచి రూ.50 వేలు ఇచ్చుకోవా లి.
ఏ సొసైటీలో లేని విధంగా నేరుగా అడ్మిషన్లు పొందడానికి వీలు ఉంది కాబట్టి అక్రమ అడ్మిషన్లకు అవకాశం లభిస్తోందని పేర్కొంటున్న మైనారిటీ సంఘాలు.. ఇప్పటికే అక్రమ అడ్మిషన్ల జాబితా గురుకులాలకు చేరిందని పేర్కొంటున్నా యి.
పేద మైనారిటీలకు అందాల్సిన ఫలాలు ప్రభుత్వ వైఫల్యంతో అర్హులకు దక్కకుండా పోతున్నాయని సంఘాల బాధ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం అధికారుల వైఫల్యంతో సెక్రటరీ ఫోర్జరీ లేఖలతో దళారులు అక్రమంగా అడ్మిషన్లు ఇప్పించారని.. ఇప్పుడు అధికార పార్టీ అండదండలతో సీట్లు పొందుతు న్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
గతంలో టెమ్రిస్‌లోని కింది స్థాయి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు బోగస్, ఫోర్జరీ సంతకాలతో కూడిన జాబితాలను ప్రిన్సిపాళ్లకు పంపించినట్లు చెబుతున్నారు.
పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి
మైనారిటీ కోటాలో నాన్ మైనారిటీలకు సీట్ల కేటాయింపు నిలిపి వేయాలి. ఇప్పటి వరకు నాన్ మైనారిటీ కోటా కింద వచ్చిన జాబితాను పరిశీలించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి. టెమ్రిస్ అధికారులు కమ్యూనిటీ మొబలైజర్లను నియమించి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
– డాక్టర్ రాజ్‌మహ్మద్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు.