Andhra Pradesh: ఇకపై ఈ సమావేశాలకు కూడా వ్యాయామ ఉపాధ్యాయులు.. కారణం?
సాక్షి ఎడ్యుకేషన్: పాఠశాలల్లో క్రీడలకు, వ్యాయామ విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. తాజాగా అమల్లోకి వచ్చిన విధి విధానాలు, వివిధ అంశాలపై విరివిగా వ్యాయామ ఉపాధ్యాయులకు సమావేశాలను నిర్వహించి పలు సూచనలు చేసే విధంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ ఉపాధ్యాయులకే పరిమితమైన స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణ ఇకపై వ్యాయామ ఉపాధ్యాయులకు కూడా నిర్వహించాలని నిర్ణయించింది.
నియోజకవర్గాల వారీగా సమావేశాలు
వాస్తవానికి ఉపాధ్యాయులకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు మండలాల వారీగా నిర్వహిస్తున్నారు. అయితే వ్యాయామ ఉపాధ్యాయులకు మాత్రం నియోజకవర్గాల స్థాయిలో ఆయా స్కూల్ కాంప్లెక్స్‌ల్లో సమావేశాల్లో నిర్వహించనున్నారు. పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈనెల 28వ తేదీ నుంచి వ్యాయామ ఉపాధ్యాయులకు కూడా మొదటిసారిగా పీడీ/పీఈటీలకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ సమావేశాలకు ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న అన్ని యాజమాన్య పాఠశాలల పీడీ, పీఈటీలు విధిగా హాజరు కావాల్సి ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
జిల్లాలోని 8 నియోజకవర్గాలలో ఈ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నారు.
ఇచ్ఛాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ హైస్కూల్ (ఇచ్ఛాపురం), పలాసలోని ప్రభుత్వ హైస్కూల్ (పలాస), టెక్కలిలోని ప్రభుత్వ హైస్కూల్ (టెక్కలి), నరసన్నపేట జెడ్పీ హైస్కూల్ బోర్డు(నరసన్నపేట), పాతపట్నం ప్రభుత్వ హైస్కూల్(పాతపట్నం), ఆమదాలవలస ప్రభుత్వ హైస్కూల్(పాతపట్నం), ఎచ్చెర్ల ప్రభుత్వ హైస్కూల్(ఎచ్చెర్ల), శ్రీకాకుళం నియోజకవర్గంలోని ఎన్‌టీఆర్ ఎంహెచ్ స్కూల్(శ్రీకాకుళం)లలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.