Schools And Colleges Holiday: భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. పరీక్షలు వాయిదా
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని ఆదేశించింది.గత రెండు, మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి.రోడ్లన్నీ నదులు మాదిరిగా మారాయి.
ఈ నేపథ్యంలో అవసరం అయితే తప్పా ప్రజలు బయటికి రావొద్దంటూ అధికారులు కోరారు. కొన్ని ప్రాంతాల్లో అయితే వాగులు పొంగిపోయి రోడ్లమీదకి భారీగా వర్షం నీరు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా, తెలంగాణ ప్రభుత్వం కూడా సోమవారం అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
అలాగే ఉస్మానియా, జేఎన్టీయూ, కేయూ యూనివర్సిటీల పరిధిలోని అన్ని కాలేజీలకు కూడా సెలవు ఇచ్చేశారు. నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. మరో రెండు రోజుల పాటు వర్ష ప్రభావం ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.