Mega parent teachers meeting: పకడ్బందీగా మెగా పేరెంట్‌ టీచర్స్‌ సమావేశం

Mega parent teachers meeting

నంద్యాల: డిసెంబర్‌ 7వ తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్‌ టీచర్స్‌ సమావేశాన్ని పక్కా ప్రణాళికతో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఎంఈఓలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి మెగా పేరెంట్‌ టీచర్స్‌ మీటింగ్‌ యాక్షన్‌ ప్లాన్‌ పై దిశా నిర్దేశం చేశారు.

భారీగా గ్రూప్‌ C ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల: Click Here

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కార్యక్రమంలో వేదికపై ప్రదర్శించే ఫ్లెక్సీ పై ఎలాంటి ఫొటోలు ఉండకూడదన్నారు. ‘పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు’ అనే నినాదంతో ఫ్లెక్సీలు తయారు చేసి ప్రదర్శించాలన్నారు. అతిథులకు వేదికపై బొకేలు ఇవ్వకుండా రెండు లేదా మూడు పుష్పాలు అందించి స్వాగతం పలకలన్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు ప్రతి పేరెంట్‌తో పాటు ప్రజాప్రతినిధులు, దాతలు, పూర్వపు విద్యార్థులకు అందించాలన్నారు.

పాఠశాల గదులతో పాటు పరిసర ప్రాంతాల్లో 100 శాతం పారిశుద్ధ్య పనులు చేపట్టి స్థానికంగా లభ్యమయ్యే పుష్పాలతో పాఠశాలలను సుందరీకరించాలన్నారు. తరగతి గదుల్లోని బోర్డులపై చక్కటి కొటేషన్లు విద్యార్థులతో రాయించాలన్నారు. వేదికపై రాజకీయ ఉపన్యాసాలు లేకుండా పిల్లలు ఎలా చదువుతున్నారు, తోటి విద్యార్థులతో ఎలా ఉంటున్నారు ఇలా వారి భవిష్యత్తుకు ఉపయోగపడేలా ప్రసంగాలు ఉండాలన్నారు. సమావేశంలో వార్షిక పాఠ్యప్రణాళికతో పాటు పోటీ పరీక్షలకు అవసరమయ్యే అదనపు ప్రణాళికపై కూడా చర్చా గోష్ఠులు జరపాలన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఉండాలన్నారు. సమావేశాలకు హాజరైన తల్లిదండ్రులకు, ఆహ్వానితులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనంతో పాటు అదనపు ఆహార పదార్థాలను వడ్డించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమాలు జరిపి మెగా పేరెంట్స్‌ కమిటీ మీటింగ్‌ను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో డీఈఓ జనార్దన్‌ రెడ్డి, సమగ్ర శిక్షణ అభియాన్‌ అధికారి లలిత తదితరులు పాల్గొన్నారు.

#Tags