JNV 6th Class Admissions 2025-26 : జవహార్‌ నవోదయ విద్యాలయాల్లో 6వ‌ తరగతి ప్రవేశాలు.. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌.. అర్హ‌త‌లు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : నవోదయ విద్యాలయాల్లో 6వ త‌ర‌గ‌తి ప్రవేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది.

అలాగే 2025-26 విద్యా సంవత్సరానికి ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఈ ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ‌కు చివ‌రి తేదీ సెప్టెంబర్ 16 తేదీ.  5వ త‌ర‌గ‌తి చదువుతున్న విద్యార్థులు ఈ దరఖాస్తుకు అర్హులు. 01-05-2013 నుంచి 31-07-2015 మధ్య జన్మించిన వారు అర్హులు. తెలంగాణ-9, ఆంధ్రప్రదేశ్‌-15 నవోదయ విద్యాలయాలున్నాయి.  

జవహార్‌ నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్ట్‌ -2025 ఫేజ్-1 ఎగ్జామ్ నవంబర్‌లో, ఫేజ్-2 ఎగ్జామ్ జనవరి-2025లో జరగనున్నాయి. ఫిబ్రవరి-2025లో ఫలితాలు విడుదల కానున్నాయి. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దేశంలోని 653 విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ద‌ర‌ఖాస్తు కోసం https://cbseitms.rcil.gov.in/nvs/?AspxAutoDetectCookieSupport=1 లింక్‌ను క్లిక్ చేయండి

జవహర్‌ నవోదయ విద్యాలయాలు.. నాణ్యమైన విద్యకు కేరాఫ్‌! ఆరోతరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకూ.. చదువు, వసతి, భోజనం అంతా ఉచితం. ఒత్తిడిలేని విద్య, ఆటపాటలతో వికాసానికి పెద్దపీట వేసే విద్యాలయాలు ఇవి. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా వీటిల్లో అడ్మిషన్‌ లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2025–26 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో.. నవోదయ విద్యాలయాల ప్రత్యేకతలు, ప్రవేశ ప్రక్రియ, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం... పాఠశాల చదువు విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైనది. ఈ దశలో వినూత్న విద్య, బోధన విధానాన్ని అమలు చేసి.. బాలల సంపూర్ణ వికాసానికి పునాదులు వేయాలనే లక్ష్యంతో ఏర్పాటైనవే జవహర్‌ నవోదయ విద్యాలయాలు. ఇందుకోసం కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో జవహర్‌ నవోదయ విద్యాలయ సమితి పేరిట ప్రత్యేక సంస్థను సైతం నెలకొల్పాయి.

నవోదయ విద్యాలయంలో సీబీఎస్‌ఈ కూడిన అత్యుత్తమ విద్యా బోధన అందిస్తారు. నిపుణులైన అధ్యాపకలు బోధిస్తారు. సువిశాల ప్రాంగణం, ఆహ్లాదకర వాతావరణం, అధునాత కంప్యూటర్‌ ల్యాబ్‌, పోషక విలువలతో కూడిన ఆహారం, మానసికోల్లాసానికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా, ఎన్‌సీసీ తదితర అంశాలు నవోదయ విద్యాలయ ప్రత్యేకతలు. సీబీఎస్‌ఈ పరీక్ష ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తూ నవోదయాలు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.

➤ JNV 6th Class Admission Exam 2024 Question Paper With Key : నవోదయ ప్రవేశ పరీక్ష-2024 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..?

పరీక్ష విధానం ఇలా..
నవోదయ ప్రవేశ పరీక్ష 100 మార్కులకు 80 ప్రశ్నలు ఉంటాయి. సమయం రెండు గంటలు. దివ్యాంగులకు అదనంగా 40 నిమిషాలు సమయం ఇస్తారు. మేధాశక్తిని పరీక్షిచేందుకు 50 మార్కులకు 40 ప్రశ్నలు, గణితంలో ప్రతిభను తెలుసుకునేందుకు 25 మార్కులకు 20 ప్రశ్నలు, భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు 25 మార్కులకు 20 ప్రశ్నలు ఇస్తారు.

ఫీజులు లేవు..
జేఎన్‌వీల మరో ప్రత్యేకత..ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగా విద్యను అందించడం. రెసిడెన్షియల్‌ విధానంలో వసతి, భోజన సదుపాయం, యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు.. ఇలా అన్నింటినీ ఉచితంగా అందిస్తారు. విద్యా వికాస్‌ నిధి పేరిట ఏర్పాటు చేసిన నిధికి నెలకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఈ చెల్లింపు నుంచి ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాలు, మహిళా విద్యార్థులు, బీపీఎల్‌ వర్గాల(దారిద్య్ర రేఖ దిగువ ఉన్న) పిల్లలకు మినహాయింపునిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు మాత్రం నెలకు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది.

పాఠ్య పుస్తకాలే..
జేఎన్‌వీఎస్‌టీ పరీక్షలో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు పాఠ్య పుస్తకాలనే ఆదరవుగా చేసుకోవాలి. ఒకటి నుంచి అయిదో తరగతి వరకు అకాడమీ పుస్తకాలు, అలాగే ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ను చదవడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రధానంగా నాలుగు, అయిదు తరగతుల మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్‌ పుస్తకాలను చదవాలి. 

నవోదయ విద్యాలయాల బోధనలో లెర్నింగ్‌ బై డూయింగ్‌ విధానం అమలవుతోంది. అంటే.. ఏదైనా ఒక అంశాన్ని బోధించేటప్పుడు దానికి సంబంధించి ప్రాక్టికల్స్, పజిల్స్, క్విజ్‌లు వంటి వాటి ద్వారా సదరు అంశంపై విద్యార్థులకు పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా నవోదయ పాఠశాలల్లో మరో ప్రత్యేక విధానం..యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్‌. ముఖ్యంగా సైన్స్, మ్యాథమెటిక్స్‌ వంటి సబ్జెక్ట్‌లకు సంబంధించి విద్యార్థులకు వాస్తవ దృక్పథం, ఆలోచన పరిధి పెరిగేలా యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్‌ను అమలు చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ వర్క్స్, స్కూల్‌ స్థాయిలో ఎగ్జిబిషన్స్‌ వంటివి నిర్వహిస్తూ.. విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలకు వాస్తవ రూపం ఇచ్చేలా బోధన ఉంటోంది.

నవోదయ విద్యాలయాల్లో పూర్తిగా రెసిడెన్షియల్‌ విధానం అమలవుతోంది. వీటిలో ప్రవేశం పొందిన విద్యార్థులు సదరు పాఠశాలల వసతి గృహాల్లోనే ఉండి చదువుకోవాల్సి ఉంటుంది. క్లాస్‌ రూమ్‌ తరగతులతోపాటు.. అవి ముగిశాక∙హాస్టల్స్‌లో మెంటార్స్‌ సదుపాయం సైతం అందుబాటులో ఉంటుంది. తద్వారా విద్యార్థులు క్లాస్‌ రూమ్‌ వెలుపల అభ్యసనం సాగించే సమయంలో ఉపాధ్యాయుల సహకారం అందేలా చూస్తున్నారు.

నవోదయ విద్యాలయాల్లో ఎనిమిదో తరగతి నుంచి ఇంగ్లిష్‌ మీడియం బోధన మొదలవుతుంది. ఎనిమిదో తరగతి నుంచి మ్యాథమెటిక్స్,సైన్స్‌ సబ్జెక్ట్‌లను ఇంగ్లిష్‌ మీడియంలో, సోషల్‌ సైన్స్‌ సబ్జెక్ట్‌ను హిందీ మీడియంలో చదవాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.ఆరో తరగతి వరకు మాత్రం విద్యార్థులు తమ మాతృ భాష లేదా తమ ప్రాంతీయ భాషలో చదివే అవకాశం కల్పిస్తున్నారు

 

#Tags