Free Admissions: ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రవేశ దరఖాస్తులకు చివరి తేదీ..!
అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేటు, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి (2024–25) విద్యాహక్కు చట్టం కింద దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. నిజానికి ఈ గడువు సోమవారంతో ముగుస్తుండగా, విద్యాశాఖాధికారులు మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రతికూల పరిస్థితుల్లోని పిల్లలైన అనాథలు, హెచ్‌ఐవీ బాధితులు, విభిన్న ప్రతిభావంతులు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పించాలి.
వీరికి విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు, అన్‌ఎయిడెడ్ స్కూళ్లల్లో 25 శాతం సీట్లు కేటాయించాలి. దీని ప్రకారం ఇప్పటివరకు 49,208 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 38,150 మంది పాఠశాలలను ఎంపిక చేసుకున్నారు. విద్యార్థుల నివాసాలకు సమీపంలో ఉన్న ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్‌ఈ, స్టేట్ సిలబస్‌ను బోధిస్తున్న స్కూళ్లలోను పేద విద్యార్థులకు ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలని సమగ్ర శిక్ష ఎస్సీడీ బి. శ్రీనివాసరావు తెలిపారు.
AP Students Education: పేద విద్యార్థులకు పథకాలతో చదువు ప్రోత్సాహం
ఆసక్తిగల విద్యార్థుల తల్లిదండ్రులు తమ నివాసాలకు సమీపంలోని సచివాలయం లేదా ఇంటర్నెట్, ఎంఈవో కార్యాలయం, మీ–సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయ పనివేళల్లో సమగ్రశిక్షా పాఠశాల విద్యాశాఖ (టోల్ ఫ్రీ) 18004258599 నంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు. అర్హతగల పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శ్రీనివాసరావు సూచించారు.
School Development: అభివృద్ధి చెందిన పాఠశాలలు..
ఆధార్ నంబర్‌తో రిజిస్ట్రేషన్..
ఇక ఆసక్తిగల పిల్లల తల్లిదండ్రులు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో విద్యార్థి పేరు, ఇతర వివరాలు నమోదుచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. పిల్లల ఆధార్ నంబర్, లేదా తల్లిదండ్రుల ఆధార్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం ఆన్‌లైన్‌లో కనిపించే స్కూళ్లలో నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తులకు ఆన్‌లైన్ లాటరీ ద్వారా స్కూళ్లను కేటాయిస్తారు. http://cse.ap.gov.in/RTE వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.