AP Open 10th, Inter Admissions: ఓపెన్‌ స్కూల్లో పది, ఇంటర్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌... చివరి తేదీ ఇదే!

Latest Admissions

పెనుగంచిప్రోలు/వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ)చదువుకోవాలని ఆశ ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితులు, పేదరికం కారణంగా చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. ఈ క్రమంలో బడి మానేసిన యువత, వయోజనులకు చదువుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఓపెన్‌ స్కూల్‌ విధానం తీసుకొచ్చింది.

Mega job mela: 25న మెగాజాబ్‌ మేళా: Click Here

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ) ఆధ్వర్యంలో పది, ఇంటర్‌ కోర్సులను ఏటా నిర్వహిస్తోంది. కాగా 2024–25 విద్యా సంవత్సరానికి ఓపెన్‌ స్కూల్లో పది, ఇంటర్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో స్టడీ సెంటర్లు ఉన్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో 39, కృష్ణాజిల్లాలో 19 స్టడీ సెంటర్లు కొనసాగుతున్నాయి.

వారితో సమానంగా..

ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించిన వారికి ఇచ్చే సర్టిఫికెట్లు రెగ్యులర్‌ విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్లు పొందిన వారితో సమానంగా ఉంటుంది. పది పరీక్షలు రాసేవారు ఐదేళ్లలో గరిష్టంగా తొమ్మిది సార్లు పరీక్షలు రాసి ఉత్తీర్ణత అవ్వాలి. ఇంటర్‌ పరీక్షలు రాసేవారు పదో తరగతి పాసై రెండేళ్ల వ్యవధి ఉంటే ఐదు సబ్జెక్టులు ఒకేసారి రాసుకునే అవకాశం ఉంటుంది. రెండేళ్ల వ్యవధి లేకపోతే నాలుగు సబ్జెక్టులు రాసి, రెండేళ్లు పూర్తయిన తరువాత మిగిలిన ఒక సబ్జెక్టు రాసుకోవచ్చు. అడ్మిషన్‌ పొందిన అనంతరం ఐదేళ్లలో తొమ్మిది సార్లు పరీక్షలు రాసి ఉత్తీర్ణత కాకపోతే తిరిగి కొత్తగా అడ్మిషన్‌ పొందాల్సి ఉంటుంది.

ప్రవేశానికి దరఖాస్తులు..

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలోని స్టడీ సెంటర్ల ద్వారా ప్రవేశాలు పొందిన వారంతా చదువుకోవచ్చు. ప్రవేశం పొందేందుకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 28 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశం తీసుకోవటానికి ఎలాంటి వయో పరిమితి లేదు. ఈఏడాది అడ్మిషన్ల సంఖ్య పెంచటానికి విస్తృతంగా ప్రచారం చేయాలని డీఈఓ యూవీ సుబ్బారావు, ఓపెన్‌ స్కూళ్ల జిల్లా కో–ఆర్డినేటర్‌ నక్కా బాబూరావు సూచించారు.

ఫీజుల వివరాలు..

పదో తరగతికి సంబంధించి జనరల్‌ పురుషులకు రిజిస్ట్రేషన్‌, అడ్మిషన్‌ ఫీజు కలిపి రూ.1550, అన్ని వర్గాల మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పీహెచ్‌సీ పురుషులకు రూ.1150, ఇంటర్‌కు సంబంధించి జనరల్‌ పురషులకు రూ.1800, అన్ని వర్గాల మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ.1500 చొప్పున చెల్లించాలి.

రెగ్యులర్‌ విద్యార్థులకూ అవకాశం..

రెగ్యులర్‌గా పాఠశాలలు, కళాశాలల్లో పది, ఇంటర్‌ చదివి ఉత్తీర్ణత సాధించలేక పోయిన వారు కూడా ఓపెన్‌ స్కూల్లో చేరి సులభంగా ఉండే సబ్జెక్టులు ఎంపిక చేసుకుని పాసయ్యే అవకాశం ఉంది. రెగ్యులర్‌ పది, ఇంటర్‌ కోర్సులు చదివి ఫెయిల్‌ అయిననాటి నుంచి ఐదేళ్ల లోపు ఓపెన్‌ స్కూల్‌లో చేరితే రెగ్యులర్‌గా పాసైన సబ్జెక్టుల నుంచి ఏవైనా రెండు సబ్జెక్టుల మార్కులు బదలాయించుకునే అవకాశం ఉంది. పదిలో హిందీకి మాత్రం ఈ అవకాశం లేదు.

సబ్జెక్టుల వివరాలు..

అర్హతలు..

పదో తరగతిలో చేరేందుకు ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 14 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి. గరిష్ట వయో పరిమితి లేదు. చదవటం, రాయటం తెలిసి ఉండాలి. దరఖాస్తుతో పాటు టీసీ, రికార్డు షీటు, పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఇంటర్‌లో చేరేందుకు పదో తరగతి మార్కుల జాబితా, టీసీని దరఖాస్తుతో పాటు అందజేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రం, దివ్యాంగుల వైకల్య ధ్రువీకరణ పత్రం జత చేయాలి.

అడ్మిషన్లు ప్రారంభమైన తేదీ

31–07–2024

అపరాధ రుసుం లేకుండా

ఫీజు చెల్లించటానికి గడువు

28–08–2024

రూ.200 అపరాధ రుసుంతో

ఫీజు చెల్లింపునకు గడువు

04–09–2024

టెన్త్‌, ఇంటర్‌ ప్రవేశాలకు అవకాశం

ఈ నెల 28 వరకు గడువు

ఉమ్మడి జిల్లాలో 58 స్టడీ సెంటర్లు

అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

ఏడాది ఓపెన్‌ పది, ఇంటర్‌ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో 38 స్టడీ సెంటర్లు ఉన్నాయి. ఇంటర్నెట్‌ సెంటర్లు, ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలి. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి జారీ చేసే సర్టిఫికెట్లు రెగ్యులర్‌ విద్యార్థులకిచ్చే సర్టిఫికెట్లుతో సమానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు ఉటుంది. నిర్దేశించిన గడువులోగా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపాలి.

అడ్మిషన్ల పెంపునకు కృషి

జిల్లాలో ఓపెన్‌ స్కూల్‌ విధానంలో చదివే అభ్యర్థుల అడ్మిషన్ల పెంపునకు కృషి చేస్తున్నాం. చదువు మధ్యలో మానేసిన ఈ వారికి ఓపెన్‌ స్కూల్‌ విద్య ఓ వరం. ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నిర్ణీత గడువు లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. అడ్మిషన్ల పెంపునకు అన్ని శాఖల సమన్వయంతో కార్యాచరణ రూపొందించాం. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి జారీ చేసే సర్టిఫికెట్లు, రెగ్యులర్‌ విద్యార్థులకిచ్చే సర్టిఫికెట్లతో సమానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు ఉంటుంది.– ఎన్‌. బాబూరావు, జిల్లా కోఆర్డినేటర్‌, ఎన్టీఆర్‌ జిల్లా

పదో తరగతికి గ్రూపు–ఏలో ఇంగ్లీషుతో పాటు తెలుగు, హిందీ, తమిళం, ఒరియా తీసుకోవచ్చు. గ్రూపు బీలో గణితం, సైన్స్‌, సోషల్‌ తీసుకోవాలి. ఇంటర్‌కు గ్రూపు–ఏలో ఇంగ్లీషుతో పాటు తెలుగు, హిందీ, తమిళం, ఒరియా తీసుకోవచ్చు, గ్రూపు–బీలో ప్రధాన సబ్జెక్టులో మూడింటితో పాటు ఐదు సబ్జెక్టులతో ఇంటర్‌ పూర్తి చేసుకోవచ్చు.

ప్రవేశం పొందిన తరువాత స్టడీ మెటీరియల్‌ సరఫరా చేస్తారు. ఓపెన్‌ స్కూల్లో ప్రవేశం పొందిన వారికి ప్రతి ఆదివారం, ప్రతి నెలా రెండో శనివారం ఆయా స్టడీ సెంటర్లలో 30 కాంటాక్టు తరగతులు నిర్వహిస్తారు. వీటిల్లో 24 కాంటాక్టు తరగతులకు హాజరైన వారికి మాత్రమే మార్చి లేదా ఏప్రిల్‌ నెలల్లో జరిగే పరీక్షలకు అనుమతి ఇస్తారు.

#Tags