Anganwadi school: అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు

బాపట్ల అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను సుందరంగా ఆధునికీకరిస్తోంది. అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తోంది. ఆటపాటలతో కూడిన విద్యను అందించేలా చర్యలు చేపడుతోంది. నాడు–నేడు కార్యక్రమాన్ని అనుసంధానం చేస్తూ అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తోంది. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ద్వారా పౌష్టిహారంతోపాటు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను దిగ్విజయంగా అందిస్తోంది. అందరూ అబ్బుర పడేలా కేంద్రాల్లో వసతులు సమకూరుస్తోంది. అద్దెభవనాల్లోని కేంద్రాలకు సొంత భవనాలు నిర్మిస్తోంది. పాత భవనాల ఆధునికీకరణకూ చర్యలు చేపట్టనుంది.

వైఎస్సార్‌ సీపీ హయాంలో మహర్దశ
గత ప్రభుత్వాల హయాంలో కనీస వసతులకూ నోచుకుని అంగన్‌వాడీ కేంద్రాలకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక మహర్దశ పట్టింది. జిల్లాలో మొత్తం 1,888 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, 803 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటిల్లో 42 కేంద్రాలకు ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం ద్వారా కొత్త భవనాల నిర్మాణం చేపట్టింది. ఇవి ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. ఒక్కో భవనానికి ప్రభుత్వం రూ.14.50 లక్షలు వెచ్చిస్తోంది. రూ.10 లక్షలు భవన నిర్మాణానికి రూ. 2.80 లక్షలు విద్యుత్‌, నీటి సౌకర్యం, ఫర్నిచర్‌ సమకూర్చేందుకు ఖర్చు చేస్తోంది. మరో రూ.30 వేలతో టాయిలెట్లు ఇంటర్నల్‌ వర్క్‌లు చేస్తున్నారు. అలాగే ఇప్పటికే ఉన్న సొంత భవనాల ఆధునికీకరణకూ ఒక్కొక్క కేంద్రానికి రూ.5.50 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు.

చ‌ద‌వండిRs 2 lakh incentive for single girl child: ఒక్క ఆడపిల్ల ఉంటే రూ.2 లక్షలు

పనుల్లో పారదర్శకత
భవన నిర్మాణ పనుల్లో పారదర్శకతకు అధికారులు పెద్దపీట వేశారు. పర్యవేక్షణ మొదలు నిధుల వినియోగం వరకు కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. కన్వీనర్‌గా ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌, సభ్యులుగా అంగన్‌వాడీ టీచర్‌, గ్రామ, వార్డు మహిళా పోలీస్‌, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌తోపాటు చిన్నారుల తల్లులు ముగ్గురు ఉంటారు. కమిటీ పేరున బ్యాంకు ఖాతా తెరిచి ఇద్దరికి ఇస్తారు. వీరి ద్వారా అవసరమైన నిధులు డ్రా చేస్తారు.

ప్రైవేటుకు దీటుగా ప్రీస్కూల్‌
అంగన్‌వాడీ కేంద్రాల్లో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రీస్కూల్‌ విధానాన్ని తీసుకొచ్చింది. బాల్య దశలోనే విజ్ఞానం పెంచడంతోపాటు ఆంగ్ల మధ్యమంలో బోధనకు చర్యలు చేపట్టింది. ఎర్లీ చైల్డ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ (ఈసీసీఈ) పథకం ద్వారా మూడేళ్ల నుంచి ఆరోళ్ళులోపు చిన్నారులకు సమగ్ర వికాసమే ధ్యేయంగా పలు కార్యక్రమాలను రూపొందించింది. బాలల్లోని సృజనాత్మకతను వెలుగు తీసేలా పీపీ –1, పీ,పీ –2 పుస్తకాల ద్వారా ఆంగ్ల పదాల బోధన సాగేలా చర్యలు చేపట్టింది. అలాగే కేంద్రాల్లో చిన్నారుల కోసం ఆటవస్తువులు సమకూర్చింది. గోడలపై విజ్ఞానానికి సంబంధించిన 3డీ పేయింటింగ్స్‌ వేయించింది. ఫలితంగా కేంద్రాలు సుందరంగా మారాయి.

చ‌ద‌వండిSchool Children: డ్రాప్‌ అవుట్‌.. నో చాన్స్‌!

శుద్ధ జలం.. ఆరోగ్యానికి బలం
అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం తీసుకుంటున్న తల్లులు చిన్నారుల సంక్షేమానికి సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారు. 15 లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి ప్లాంట్లను అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో సగంపైనే అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేశారు. శుద్ధి జల ప్లాంట్ల ఏర్పాటుతో నాణ్యమైన తాగునీరందిస్తున్నారు.

జిల్లాలో ప్రస్తుతం ఇలా..
అంగన్‌వాడీ కేంద్రాలు : 1,888
గర్భిణులు : 8,080
బాలింతలు : 7,388
3–6 ఏళ్లలోపు పిల్లలు : 25,462
సొంతభవనాలు ఉన్న కేంద్రాలు : 594
అద్దెభవనాల్లో సాగుతున్నవి : 803
ప్రభుత్వ భవనాల్లో ఉన్నవి : 491

#Tags