500 Assistant Jobs: బీమా కంపెనీలో అసిస్టెంట్ కొలువు.. ఎంపిక ప్రక్రియ, రాత పరీక్ష విధానం, వేతనాలు తదితర సమాచారం..
దేశంలో ఇన్సూరెన్స్ రంగం రోజురోజుకూ విస్తరిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ బీమా సంస్థలు కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ప్రైవేట్ రంగంతో పోటీ పడుతూ సేవలందిస్తున్నాయి. ఇందులో భాగంగానే న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా నియామకాలు చేపడుతోంది. తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటì ఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం 500 పోస్ట్‌లు
తాజాగా న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ.. దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాలలోని తమ శాఖల్లో 500 అసిస్టెంట్ పోస్ట్‌ల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు, తెలంగాణలో 10 పోస్ట్‌లు ఉన్నాయి.
అర్హతలు
- 2024, డిసెంబర్ 12 నాటికి.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థులు పదో తరగతి నుంచి డిగ్రీ వరకు ఏదో ఒక స్థాయిలో ఇంగ్లిష్‌ను ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి.
- వయసు: 2024,డిసెంబర్ 12 నాటికి 21–30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
రెండంచెల ఎంపిక ప్రక్రియ
అసిస్టెంట్ పోస్ట్‌లకు రెండు దశల ఎంపిక ప్రక్రియను నిర్వహించనున్నారు. తొలిదశలో ప్రిలిమినరీ పరీక్ష, రెండో దశలో మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటాయి.
వంద మార్కులకు ప్రిలిమినరీ
తొలి దశగా పేర్కొనే టైర్–1 ప్రిలిమినరీ రాత పరీక్ష మూడు విభాగాల్లో మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు– 30 మార్కులకు, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 35 ప్రశ్నలు–35 మార్కులకు, టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు ఉంటాయి. ప్రతి విభాగానికి 20 నిమిషాలు చొప్పున మొత్తం గంట వ్యవధిలో పరీక్ష ఉంటుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కును నెగెటివ్ మార్కుగా నిర్దేశించారు.
మెయిన్స్‌కు 250 మార్కులు
రెండో దశలో మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. నిర్దిష్ట కటాఫ్‌లను అనుసరించి మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ మొత్తం 5 విభాగాల్లో 250 మార్కులకు నిర్వహిస్తారు.
ఇందులో టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు–50 మార్కులకు, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 40 ప్రశ్నలు–50 మార్కులకు, టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు– 50 మార్కులకు, కంప్యూటర్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు–50 మార్కులకు, టెస్ట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ 40 పశ్నలు–50 మార్కులకు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటలు. అభ్యర్థులు ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ మినహా మిగిలిన సబ్జెక్ట్‌లను ఇంగ్లిష్ లేదా హిందీ భాషలో హాజరయ్యే అవకాశం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కును నెగెటివ్ మార్కు నిబంధన ఉంది.
ప్రాంతీయ భాష పరీక్ష
మెయిన్ ఎగ్జామినేషన్‌లో భాగంగానే అభ్యర్థులు మరో పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటంది. అదే రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్. తమ సొంత రాష్ట్రం కాకుండా.. ఇతర రాష్ట్రాలలోని పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు.. వారు ఎంపిక చేసుకున్న రాష్ట్రానికి సంబంధించిన అధికార భాషలో టెస్ట్‌ను నిర్వహిస్తారు. మొత్తం 50 మార్కులకు రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో భాగంగా అభ్యర్థులు ఒక ఎస్సే రైటింగ్, ఒక లెటర్ రైటింగ్ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
వేతనం
- ఎంపిక ప్రక్రియలో ప్రతిభ చూపిన వారికి మెరిట్ ఆధారంగా నియామకం ఖరారు చేస్తారు. ప్రారంభంలో క్లాస్–3 కేడర్‌లో నియమిస్తారు. రూ.22,405–రూ.62,265 వేతన శ్రేణితో కెరీర్ ప్రారంభం అవుతుంది. నెలకు స్థూలంగా రూ.37 వేల వేతనం అందుతుంది. మెట్రో సిటీల్లో రూ.40 వేలు ఉంటుంది.
- నియామకాలు ఖరారు చేసుకున్న వారికి ముందుగా ఆరు నెలల ప్రొబేషన్ పిరియడ్ ఉంటుంది. ప్రొబేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి శాశ్వత నియామకం ఖరారవుతుంది.
సీనియర్ మేనేజర్ హోదాకు
అసిస్టెంట్ హోదాలో కొలువులు సొంతం చేసుకున్న వారు భవిష్యత్తులో పదోన్నతుల ద్వారా సీనియర్ మేనేజర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. తొలుత ఏఏఓగా పదోన్నతి పొందొచ్చు. ఆ తర్వాత సర్వీసు నిబంధనలు అనుసరించి ఏఓ, ఎస్‌ఏఓ, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ స్థాయికి చేరుకోవచ్చు.
రాత పరీక్షలో రాణించేలా ఇంగ్లిష్ లాంగ్వేజ్
ఈ విభాగంలో రాణించాలంటే.. బేసిక్ గ్రామర్‌తో మొదలుపెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్ కాంప్రహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. డిస్క్రిప్టివ్ విధానంలో ఉండే ఇంగ్లిష్ ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్ కోసం ఇంగ్లిష్ న్యూస్ పేపర్లు చదవడం, ఎడిటోరియల్ లెటర్స్ చదవడం మేలు చేస్తుంది.
రీజనింగ్
ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలో ప్రధానంగా భావించే రీజనింగ్ ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు పకడ్బందీగా వ్యవహరించాలి. సిరీస్, అనాలజీ, కోడింగ్–డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, సిలాజిజమ్స్‌పై పట్టు సాధించాలి.
న్యూమరికల్ ఎబిలిటీ
అర్థమెటిక్ అంశాలపై పట్టు సాధించాలి. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్ సంబంధిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు నంబర్ సిరీస్, డేటా అనాలిసిస్ విభాగాలను కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే.. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ మంచి మార్కులు పొందొచ్చు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
జనరల్ అవేర్‌నెస్
అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన విభాగం.. జనరల్ అవేర్‌నెస్. జీకే, కరెంట్ అఫైర్స్‌తోపాటు ఇన్సూరెన్స్, ఆర్థిక రంగంలో మార్పులు, ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్, ఆర్థిక రంగంలో వినియోగించే పదజాలంపై పట్టు సాధించాలి.
కంప్యూటర్ నాలెడ్జ్
ఈ విభాగానికి సంబంధించి బేసిక్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఎంఎస్ ఆఫీస్ టూల్స్‌పై పట్టు సాధించాలి. ముఖ్యంగా న్యూ ఫైల్ క్రియేషన్, ఎక్సెల్ షీట్, పీపీటీల వంటి వాటిపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా కీ బోర్డ్ షార్ట్ కట్స్, బేసిక్ హార్డ్‌వేర్ టూల్స్ గురించి తెలుసుకోవాలి.
జనరల్ నాలెడ్జ్
ఈ విభాగానికి సంబంధించి స్టాక్ జీకే అంశాలతో పాటు.. ముఖ్యమైన వ్యక్తులు, సదస్సులు, క్రీడలు–విజేతలు, అవార్డులు–గ్రహీతలు తదితర అంశాలపై దృష్టి సారించాలి. అంతేకాకుండా హిస్టరీపై పట్టు సాధించాలి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2025, జనవరి 1
- టైర్–1 ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 2025, జనవరి 27
- మెయిన్ ఎగ్జామ్ పరీక్ష తేదీ: 2025, మార్చి 2
- వెబ్‌సైట్: www.newindia.co.in