JEE Advanced Results 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు..టాప్‌-10లో నాలుగు ర్యాంకులు మనోళ్లకే

సాక్షి, హైదరాబాద్‌: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో తెలుగు విద్యార్థులు ఈసారి కూడా సత్తా చాటారు. తొలి పది ర్యాంకుల్లో నాలుగింటిని తెలుగు విద్యార్థులే కైవసం చేసుకున్నారు. టాప్‌ వంద ర్యాంకుల్లో 20 మంది తెలుగు రాష్ట్రాల వారేకావడం గమనార్హం. మొత్తంగా అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు 12 వేల మంది వరకు ఉన్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశాల కోసం గత నెల 26న దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.

ఈ పరీక్షలను నిర్వహించిన మద్రాస్‌ ఐఐటీ ఆదివారం ఫలితాలను వెల్లడించింది. 48,248 మందికి అర్హత: జేఈఈ మెయిన్స్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా అడ్వాన్స్‌డ్‌కు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని ఎంపిక చేశారు.వారిలో 1,86,584 మంది అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు రిజిస్టర్‌ చేసుకున్నారు. అందులో 1,80,200 మంది పరీక్ష రాశారు. వీరిలో దేశవ్యాప్తంగా 48,248 మంది అర్హత సాధించారు. ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్‌ లహోటి 360 మార్కులకుగాను 355 మార్కులతో జాతీయ టాపర్‌గా నిలిచారు.

అదే జోన్‌కు చెందిన ఆదిత్య రెండో ప్లేస్‌లో నిలిచారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన భోగలపల్లి సందేశ్‌ 338 మార్కులతో మూడో ర్యాంకు, పుట్టి కౌశల్‌కుమార్‌ 334 మార్కులతో 5వ ర్యాంకు, కోడూరు తేజేశ్వర్‌ 331 మార్కులతో 8వ ర్యాంకు, అల్లాడబోయిన ఎస్‌ఎస్‌డిబి సిద్విక్‌ సుహాస్‌ 329 మార్కులతో పదో ర్యాంకు సాధించారు. 

#Tags