JEE Advanced Results: పెరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కటాఫ్‌.. జనరల్‌ కేటగిరి ఎన్ని మార్కులంటే..

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఏడాది మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్స్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా అడ్వాన్స్‌డ్‌కు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని ఎంపిక చేశారు.వారిలో 1,86,584 మంది అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు రిజిస్టర్‌ చేసుకున్నారు. అందులో 1,80,200 మంది పరీక్ష రాశారు. వీరిలో దేశవ్యాప్తంగా 48,248 మంది అర్హత సాధించారు. 
 

పెరిగిన కటాఫ్‌ 
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత కోసం పరిగణనలోకి తీసుకునే కటాఫ్‌ పర్సంటైల్‌ ఈసారి పెరిగింది. జనరల్‌ కేటగిరీలో 2022లో 88.4 పర్సంటైల్‌ కటాఫ్‌ అయితే, 2023లో ఇది 90.7గా ఉంది. తాజాగా కటాఫ్‌ 93.2 పర్సంటైల్‌కు చేరింది. ఓపెన్‌ కేటగిరీలో కటాఫ్‌ మార్కులు 109గా, రిజర్వేషన్‌ కేటగిరీలో 54 మార్కులుగా నిర్ధారించారు. ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులు ప్రతీ సబ్జెక్టులో కనీసం 8.68 శాతం, మొత్తంగా 30.34 శాతం మార్కులతో ర్యాంకుల జాబితాలోకి వెళ్లారు. ఇక ఈసారి అర్హుల సంఖ్య కూడా పెరిగింది. గత ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో 43,773 అర్హత సాధించగా.. ఈసారి 48,248 మంది అర్హత సాధించారు. 

JEE Advanced Results 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు..టాప్‌-10లో నాలుగు ర్యాంకులు మనోళ్లకే

 

జోసా కౌన్సెలింగ్‌ షురూ 
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, జీఎఫ్‌ఐటీలో ప్రవేశాలకు సంబంధించి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) సోమవారం నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రారంభించనుంది. విద్యార్థులకు అవగాహన నిమిత్తం 17వ తేదీ వరకు మాక్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. మొత్తం ఐదు దశల్లో కౌన్సెలింగ్‌ను పూర్తి చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. 18వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు, ఆప్షన్ల ఎంపిక మొదలవుతాయి. 20న తొలి దశ, 27న రెండో దశ, జూలై 4న మూడో దశ, జూలై 10న నాలుగో దశ, జూలై 17న తుది విడత సీట్లను కేటాయించనుంది.

మిగిలిన సీట్లు ఏవైనా ఉంటే వాటికి జూలై 23న కౌన్సెలింగ్‌ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది. అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో, జేఈఈ ర్యాంకు ఆధారంగా ఇతర కేంద్ర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. దేశంలోని 121 విద్యా సంస్థలు ఈసారి జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. గత ఏడాది వీటి సంఖ్య 114 మాత్రమే. 2023–24 విద్యా సంవత్సరంలో దేశంలోని 23 ఐఐటీల్లో 17,385 సీట్లున్నాయి. ఈ సంవత్సరం వీటి సంఖ్య పెరగవచ్చని ఆశిస్తున్నారు.

#Tags