ఒత్తిడి లేని విద్య కోసమే ఇంటర్‌లో మార్పులు

మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడికి గురికాకూడదనే ఉద్దేశంతోనే అనేక మార్పులు తెచ్చామని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ విద్యాశాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మి చెప్పారు.
ఇంటర్మీడియెట్ బోర్డు గోల్డెన్‌జూబ్లీ వేడుకలు డిసెంబర్ 10న విజయవాడలోని పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగాయి. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసిన ఉదయలక్ష్మి మాట్లాడుతూ.. గతంలో పీయూసీ పేరుతో ఇంటర్మీడియెట్ రెండు సంవత్సరాల పరీక్షలను ఒకేసారి రాసేవారణ్నారు. దీంతో విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారని చెప్పారు. 1968 సంవత్సరలో ప్రభుత్వం ఇంటర్మీడియెట్ బోర్డును ఏర్పాటు చేసి ప్రతి ఏడాది పరీక్షలను ఆ విద్యా సంవత్సరంలోనే నిర్వహిస్తుందని చెప్పారు. విద్యార్థులకు ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఫలితాల్లో గ్రేడుల విధానాన్ని అమలు చేశామని చెప్పారు. సీబీఎస్‌ఈ సిలబస్‌కు ఏమాత్రం తగ్గకుండా సిలబస్‌లో మార్పులు చేశామని, పరీక్షల్లో విద్యార్థులకు అమలు చేసినట్లుగానే అధ్యాపకులకు జంబ్లింగ్ విధానాన్ని అమలు చేయడం, పరీక్షలు జరిగే తీరును సీసీటీవీల ద్వారా పర్యవేక్షించడం, ల్యాబ్స్‌ను సమకూర్చడం, పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించడం, ఆన్‌లైన్ పరీక్షా విధానాన్ని అమలు చేయడం ఇవన్ని తమ శాఖలో చేసిన మార్పులని ఆమె తెలియజేశారు.
#Tags