కళాశాలల విద్యార్థులకు జీవన నైపుణ్యాలు
సాక్షి, అమరావతి: డిగ్రీ చదివే విద్యార్థులను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దేందుకు కళాశాలల్లో లైఫ్ స్కిల్స్ (జీవన నైపుణ్యాలు) ప్రవేశపెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది.
విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి, కెరీర్‌ను విజయవంతంగా నడిపించడానికి నైపుణ్యాలు ఎంతో కీలకం. ఈ దిశగా వారిని ముందుకు నడిపించేందుకు నైపుణ్యాలపై పాఠ్యప్రణాళికను విడుదల చేస్తున్నట్టు యూజీసీ పేర్కొంది. విద్యార్థులు భవిష్యత్తులో వ్యక్తిగతంగా, వృత్తి పరంగా రాణించేందుకు ఈ నైపుణ్యాలు అవసరమని స్పష్టం చేసింది. ఈ పాఠ్యప్రణాళిక విజయవంతం కావాలంటే విద్యార్థులే కాకుండా ఫ్యాకల్టీ, మెంటార్లు, ఇతర విభాగాల సిబ్బంది క్రియాశీలక భాగస్వామ్యం ఉండాలని తెలిపింది. మౌఖిక ప్రదర్శనలు, సమయస్ఫూర్తిగా మాట్లాడటం, క్విజ్‌లు, చర్చాగోష్ఠులు, కేస్ స్టడీస్, సృజనాత్మక ఆలోచనలు, క్షేత్ర పర్యటనలు, ప్రాజెక్టుల రూపకల్పన, బృంద నిర్మాణం వంటివి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో ఉండాలని సూచించింది. వీటిలో కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్, లీడర్‌షిప్ స్కిల్స్, మానవతా విలువలు అనే అంశాలున్నాయి. ఒక్కో నైపుణ్య విభాగంలో ఉండాల్సిన పాఠ్యాంశాలను కూడా యూజీసీ ప్రకటించింది.
- కమ్యూనికేషన్ స్కిల్స్: వినడం, మాట్లాడటం, చదవడం, రాయడం,డిజిటల్ లిటరసీ, సోషల్‌మీడియా వినియోగం
- పొఫెషనల్ స్కిల్స్ (కెరీర్ స్కిల్స్): రెజ్యూమ్ రూపొందించడం, ఇంటర్వ్యూలు, బృంద చర్చలు, వృత్తిపరమైన అవకాశాలను గుర్తించడం
- పొఫెషనల్ స్కిల్స్ (టీమ్ స్కిల్స్): ప్రెజెంటేషన్లు, విశ్వసనీయత, సమష్టితత్వం, బృంద సభ్యుల అభిప్రాయాలు వినడం, మేథోమథనం, సామాజిక, సాంస్కృతిక కట్టుబాట్లకు మన్నన, అంతర్గత సమాచారం
- లీడర్‌షిప్ స్కిల్స్: నాయకత్వ, నిర్వాహక, వ్యవస్థాపక నైపుణ్యాలు,ఆచరణాత్మక ఆలోచనలు, విలువలు.
- మానవతా విలువలు: ప్రేమ, కరుణ, సత్యం, అహింస, ధర్మం, శాంతం, సేవ, త్యాగం.
#Tags