సెల్ఫ్‌ లెర్నింగ్‌ + లాంగ్‌ విజన్‌ = బెటర్‌ ఫ్యూచర్‌

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ కోలాహలం మొదలైంది. మరికొద్ది రోజుల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో విద్యార్థుల మదిలో ఎన్నో సందేహాలు.. మరెన్నో అనుమానాలు! ఎలాంటి కాలేజీలో చేరాలి.. ఏ బ్రాంచ్‌ను ఎంచుకోవాలి.. బ్రాంచ్‌, కాలేజ్‌.. ఎంపికలో వేటికి ప్రాధాన్యం ఇవ్వాలి.. ఏ బ్రాంచ్‌లో చేరితే భవిష్యత్తు ఎలా ఉంటుంది? అనే సందిగ్ధం, భవిష్యత్‌ కెరీర్‌ బాగుండాలంటే.. ఏం చేయాలి.. దేశంలో ఇంజనీరింగ్‌ విద్య, తదితర అంశాలపై ఇంజనీరింగ్‌లో చేరనున్న విద్యార్థులకు ఇంజనీరింగ్‌ విద్యను అందించడంలో మంచి పేరున్న ఇన్‌స్టిట్యూట్‌.. ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ- హైదరాబాద్‌(ఐఐఐటీ) డెరైక్టర్‌ ప్రొఫెసర్ పి.జె.నారాయణన్‌ సలహాలు, సూచనలు...

ఇంజనీరింగ్‌ విద్యా విధానంపై అభిప్రాయం:
ఇంజనీరింగ్‌ ఎవర్‌గ్రీన్‌ కోర్సు. ఇంజనీరింగ్‌ విద్య దేశ ప్రగతికి ఎంతో దోహదపడుతుంది. ప్రస్తుతం దేశంలో ఇంజనీరింగ్‌ కోర్సులకు బాగా డిమాండ్‌ నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వేల సంఖ్యలో కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. దాంతో కోర్సులో చేరే విద్యార్థుల కంటే సీట్ల సంఖ్య అధికంగా ఉంటోంది. ఫలితంగా.. ఎన్నో కళాశాలల్లో సీట్లు భర్తీ కాని పరిస్థితి. కేవలం డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రారంభమైన కళాశాలలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నాయి. ఇది విద్యార్థుల భవిష్యత్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రమే అన్నిరకాల ప్రమాణాలతో నాణ్యమైన ఇంజనీరింగ్‌ విద్యను అందిస్తున్నాయి.

కరిక్యులం సరిగానే ఉంది.. కానీ:
ప్రస్తుతం ఇంజనీరింగ్‌ కోర్సు కరిక్యులం సరిగానే ఉంది. కానీ దాన్ని ఎలా ఆకళింపు చేసుకుంటున్నారు.. వాస్తవంలో అది ఏ విధంగా ఉపయోగపడుతుంది.. అనే అంశాలపై అవగాహన చాలా అవసరం. కొన్ని యూనివర్సిటీలు పరిశ్రమ అవసరాల పేరుతో ఆయా బ్రాంచ్‌లకు అదనంగా కొన్ని కోర్సులను(ఉదా: జావా, డాట్‌ నెట్‌ తదితర) చేర్చుతున్నారు. ఇది మంచి పరిణామమైనప్పటికీ.. వాటి స్వరూపం అసంపూర్ణంగా ఉండి, విద్యార్థికి పూర్తిస్థాయి జ్ఞానం లభించడంలేదు. పరిశ్రమ అవసరాలకు కోసం ఏదైనా ఒక అంశాన్ని చేర్చితే.. అందులో విద్యార్థి పూర్తిస్థాయి నైపుణ్యం పొందేలా సిలబస్‌ రూపొందించాలి. అప్పుడే వాస్తవ ఉద్దేశం నెరవేరుతుంది.

పర్యవేక్షణ నిబంధనలు-ఇబ్బందులు:
ఇంజనీరింగ్‌ కోర్సుల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం పలు నియంత్రణ సంస్థలను (ఏఐసీటీఈ, యూజీసీ తదితర) ఏర్పాటు చేసింది. ఇది మంచి పరిణామమే. కానీ ఆచరణ సాధ్యం కాని నిబంధనలు విధిస్తే.. అవి చివరకు ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు టీచర్‌-స్టూడెంట్‌ నిష్పత్తి 1:15 లేదా 1: 20 ఉండాలని పేర్కొంటే.. ఒకవైపు ఆ నిబంధనలను పాటించక తప్పని స్థితిలో.. మరోవైపు అర్హులైన ఫ్యాకల్టీ దొరక్క తాజా గ్రాడ్యుయేట్లను అధ్యాపకులుగా కాలేజీలు నియమిస్తున్నాయి. అనుభవంలేని అధ్యాపకుల కారణంగా విద్యార్థులు సరైన నైపుణ్యాలు పొందలేకపోతున్నారు. నా అభిప్రాయం ప్రకారం- ఇన్‌స్టిట్యూట్‌ల చరిత్ర ఆధారంగా మంచి ఇన్‌స్టిట్యూట్‌లకు స్వయం ప్రతిపత్తి ఇస్తే.. అవి మరింత మెరుగ్గా విద్యార్థులను తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది.

నూతన కోర్సుల ఆవిష్కరణ ఆవశ్యకం:
ప్రస్తుత అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఇంజనీరింగ్‌ విభాగంలో నూతన కోర్సుల ఆవిష్కరణ జరగాలి. ట్రిపుల్‌ ఐటీ, హైదరాబాద్‌లో ఈ ఏడాది నుంచి బీటెక్‌ ఇన్‌ బిల్డింగ్‌సైన్స్‌ అనే కొత్త కోర్సును ప్రారంభించాం. ఇది సివిల్‌ ఇంజనీరింగ్‌ సమ్మిళితంగా ఉండే బ్రాంచ్‌. ఇందులో నిర్మాణానికి సంబంధించిన అంశాలతోపాటు భవన పునాది, నిర్వహణ,విద్యుత్తు ఆదా చేసే విధంగా నిర్మాణం.. పర్యావరణ, నిర్వహణ పరంగా ఏళ్లతరబడి పటిష్టంగా ఉండాలంటే.. భవన స్వరూపం ఎలా ఉండాలి తదితర అంశాలను బోధిస్తాం. ఇంజనీరింగ్‌లో సంప్రదాయ కోర్సులకే పరిమితం కాకుండా.. భవిష్యత్తు కోణంలో ఆలోచించి కొత్త కోర్సుల వైపు దృష్టి సారించాలి. 1980లలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌ను ప్రవేశపెట్టిన ప్పుడు విద్యార్థులు, ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి పెద్దగా ఆదరణ లభించలేదు. క్రమేణా కంప్యూటరీకరణ ప్రాధాన్యం పెరగడం, అన్ని రంగాల్లో కంప్యూటరీకరణ జరగడంతో ఇప్పుడు ఇదే బ్రాంచ్‌.. క్రేజీ బ్రాంచ్‌లలో ఒకటిగా రూపొందింది. ఫలితంగా ప్రతి ఇన్‌స్టిట్యూట్‌లోనూ ఈ బ్రాంచ్‌ అందుబాటులోకి వచ్చింది.

బ్రాంచ్‌, కాలేజ్‌ ఎంపికలో:
బ్రాంచ్‌ ఎంపికలో విద్యార్థి తన స్వీయ అభిరుచికే ప్రాధాన్యం ఇవ్వాలి. తల్లిదండ్రులు లేదా స్నేహితుల ఒత్తిడి, జాబ్‌ మార్కెట్‌ ట్రెండ్స్‌ వంటి కారణాలతో ఆసక్తిలేని బ్రాంచ్‌ను ఎంచుకుంటే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఇక.. కాలేజ్‌ ఎంపికలో ప్రధానంగా పరిశీలించాల్సిన అంశాలు- సదరు కళాశాలలో టీచింగ్‌ సిబ్బంది నైపుణ్యం, రీసెర్చ్‌ తీరుతెన్నులు, అప్పటివరకు సాగిన రీసెర్చ్‌లు వంటి అంశాలను పరిశీలించాలి. కళాశాలలో తాము చేరదల్చుకున్న కోర్సుకు సంబంధించి మౌలిక సదుపాయాలు (లేబొరేటరీలు, లైబ్రరీ) ఎలా ఉన్నాయో తెలుసుకొని కాలేజీని ఎంపిక చేసుకోవాలి. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌, ఎంపికైన వారికి లభించిన జీతాలు వంటి వాటికి చివరి ప్రాధాన్యం ఇవ్వాలి. కాలేజ్‌ లేదా బ్రాంచ్‌లో.. బ్రాంచ్‌కే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలనేది నా అభిప్రాయం. కారణం.. ఎంచుకున్న బ్రాంచ్‌ సబ్జెక్టుల్లో నిష్ణాతులైతే చదివిన కాలేజ్‌, జాబ్‌ మార్కెట్‌ ట్రెండ్‌ వీటన్నిటికీ అతీతంగా కచ్చితంగా కెరీర్‌లో రాణించొచ్చు.

ఉన్నత విద్యతో.. సమున్నత భవిత:
‘ఇంజనీరింగ్‌ పూర్తిచేస్తే జాబ్‌ గ్యారెంటీ. నెలకు ఐదంకెల జీతం సొంతమవుతుంది’. ఇది ప్రస్తుతం విద్యార్థుల్లో నెలకొన్న అభిప్రాయం. ఇదే ఈ కోర్సుకు పెరుగుతున్న డిమాండ్‌కు కారణం. కానీ బీటెక్‌ సర్టిఫికెట్‌ చేతికొచ్చే సమయానికి లభించే జాబ్‌, తొలి జీతం ముఖ్యం కాకూడదు. కారణం.. 21 లేదా 22 ఏళ్ల వయస్సులో ఇంజనీరింగ్‌ పూర్తి చేసుకున్న విద్యార్థి 40 నుంచి 45 ఏళ్లపాటు కెరీర్‌ను కొనసాగించాలి. కేవలం తొలి జాబ్‌ కోణంలో మాత్రమే ఆలోచించి ఏదో ఒక కంపెనీలో అడుగుపెడితే కెరీర్‌ మధ్యలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఎందుకంటే.. ఇంజనీరింగ్‌,సైన్స్‌ కోర్సులు ఆయా అంశాలపై నిరంతర అవగాహన, అధ్యయనం అవసరమైనవి. కాబట్టి విద్యార్థులు దీర్ఘదృష్టితో ఆలోచించి ఉన్నత విద్యను అభ్యసించేందుకు మొగ్గు చూపాలి. పీజీ, పీహెచ్‌డీతో ఉన్న అవకాశాలపై అన్వేషించాలి. ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో పీజీ సీటు సాధిస్తే పలు రకాల ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా లభిస్తున్నాయి. ఇన్‌స్టిట్యూట్‌లు, ఫ్యాకల్టీలు కూడా ‘క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌ ప్రధానం’ అనే ఆలోచన విద్యార్థుల్లో తొలగేలా.. ఉన్నత విద్యైపై ఆసక్తి పెంచాలి. ఉదాహరణకు మెడికల్‌ కోర్సును పరిగణనలోకి తీసుకుంటే ఇప్పుడు ఎంబీబీఎస్‌ సర్టిఫికెట్‌తో కెరీర్‌లో స్థిరపడలేని పరిస్థితి నెలకొంది. ఎండీ, ఆపై సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు చదివితేనే మెడికల్‌ విద్యార్థులకు మంచి కెరీర్‌ సాధ్యమవుతోంది. ఇది దాదాపు పదేళ్లపాటు సాగే ప్రక్రియ. విద్యార్థులు దీన్ని అనుసరిస్తున్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఇంజనీరింగ్‌లోనూ ఏర్పడింది. అందువల్ల ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులు దీన్ని గుర్తించి ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక.. ఆర్థిక కారణాలతో ఉద్యోగం తప్పనిసరైన విద్యార్థులు రెండు, మూడేళ్లు ఉద్యోగం చేసి ఆర్థిక సుస్థిరత లభించిన తర్వాతైనా ఉన్నత విద్యను అభ్యసించాలి.

స్వీయ అధ్యయనంతోనే సుస్థిర భవిష్యత్తు:
టాప్‌ కాలేజ్‌లో చేరినా, లేదా సాధారణ కాలేజ్‌లో చేరినా.. బీటెక్‌లో చేరే విద్యార్థులు ముఖ్యంగా అనుసరించాల్సిన విధానం స్వీయ అధ్యయనం. హైస్కూల్‌, ఇంటర్మీడియెట్‌లో మాదిరిగా.. ఇంజనీరింగ్‌లో స్పూన్‌ ఫీడింగ్‌ ఉండదు. టీచర్లు ఒక అంశానికి సంబంధించి మార్గనిర్దేశనం మాత్రమే చేస్తారు. దానికి సంబంధించిన లోతైన అవగాహన పొందడమనేది విద్యార్థి బాధ్యత. అందుకోసం అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవాలి. ప్రస్తుతం విద్యార్థులు ఇంటర్నెట్‌ను ప్రధాన వనరుగా ఉపయోగించుకోవచ్చు. ఇంటర్నెట్‌ ద్వారా పలు ఆన్‌లైన్‌ లెక్చర్స్‌, ఆన్‌లైన్‌ ట్యూషన్స్‌, వర్చువల్‌ ల్యాబ్స్‌ వంటి ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. వాస్తవానికి కొన్ని సందర్భాల్లో సహజమైన లేబొరేటరీల్లో సాధ్యం కాని అంశాలకు వర్చువల్‌ ల్యాబ్స్‌లో పరిష్కారం లభిస్తుంది.

మల్టీ డిసిప్లినరీ కోర్సులతో మరింత ప్రయోజనం:
ఇంజనీరింగ్‌ విద్యా విధానంలో చేపట్టాల్సిన మరో ప్రధాన మార్పు.. ఇంటర్‌ డిసిప్లినరీ కోర్సులు, మల్టీ డిసిప్లినరీ కోర్సుల ఆవిష్కరణ! ఉదాహరణకు సివిల్‌ ఇంజనీరింగ్‌ + సైకాలజీని ఒక చక్కటి ఇంటర్‌ డిసిప్లినరీ కోర్సుగా పేర్కొనొచ్చు. కారణం.. సివిల్‌ ఇంజనీరింగ్‌ అంటే నిర్మాణాలకు సంబంధించింది. ఈ విషయంలో వ్యక్తుల మానసిక ఆలోచనలు, ఇష్టాలు కూడా ఇమిడి ఉంటాయి. ఈ దిశగా ఆలోచించి సివిల్‌ + సైకాలజీ వంటి ఇంటర్‌ డిసిప్లినరీ కోర్సును ప్రవేశపెడితే.. పై రెండు అంశాలను సంతృప్తిపరిచే విధంగా చేయొచ్చు. ఇలాంటి వాటిపై ఇన్‌స్టిట్యూట్‌లు దృష్టి సారించాలి. ఫలితంగా విద్యార్థులు భవిష్యత్తును మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దుకోగలుగుతారు.

‘పట్టా’ కాదు.. పరిజ్ఞానం ముఖ్యం:
నేటి తరం విద్యార్థులు జాబ్‌ మార్కెట్‌, క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌ తదితర అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారించి.. అత్యధిక మార్కులతో సర్టిఫికెట్‌ పొందడం ఎలా? అనే అంశంపైనే ఆలోచిస్తున్నారు. ఇదే కారణంగా కేవలం పరీక్ష కోణంలో తమ చదువును కొనసాగిస్తున్నారు. ఇది సరైంది కాదు. తాము ఎంచుకున్న బ్రాంచ్‌లో పూర్తి పరిజ్ఞానం పొందేందుకు నిరంతరం కృషి చేయాలి. సరైన సదుపాయాలు లేని కళాశాలల్లోని విద్యార్థులు గ్రూప్‌ స్టడీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా సదరు అంశాలపై విస్తృత జ్ఞానం పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులు ఈ విషయాలను క్రమం తప్పకుండా పాటిస్తేనే పరిజ్ఞానం లభిస్తుంది.

పరిశోధనలకు ప్రాముఖ్యం:
ప్రస్తుతం ఇంజనీరింగ్‌ విద్యార్థులకు సంబంధించి ఆందోళన కలిగిస్తున్న అంశం.. పరిశోధనలపై ఆసక్తి చూపకపోవడం. పరిశోధనలు చేసి కొత్త ఆవిష్కరణలు చేస్తే లభించే సంతృప్తి వర్ణించలేనిది. వాటి ఫలితాలు ఐదేళ్ల అవసరాలకు తగినట్లుగా ఉన్నా లేదా యాభై ఏళ్లపాటు మనుగడలో ఉన్నా తమ చేతుల మీదుగా కొత్త ఆవిష్కరణ జరిగిందనేది ఒక విద్యార్థి జీవితంలో విశిష్టమైన ఘట్టం. కానీ ఇప్పటి విద్యార్థులు పరిశోధనల దిశగా అడుగులు వేయడం సుదీర్ఘ సమయం పట్టే విషయంగా భావిస్తున్నారు. ఈ అపోహను విడనాడాలి. పరిశోధనల వైపు దృష్టి సారిస్తే ఆవిష్కరణలకు ఆస్కారంతోపాటు, నిరంతర నైపుణ్యం అలవడుతుంది. అందుకే ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌లో బీటెక్‌ స్థాయిలోనే రీసెర్చ్‌వైపు సాగేలా కరిక్యులం రూపొందించాం. మూడో సెమిస్టర్‌ పూర్తయ్యాక.. విద్యార్థులు అప్పటికే ఇన్‌స్టిట్యూట్‌లో సాగుతున్న పరిశోధనల్లో పాల్పంచుకోవడం తప్పనిసరి చేశాం. ఫలితంగా పరిశోధనలంటే ప్రాథమిక స్థాయి నుంచే ఆసక్తి ఏర్పడుతుంది.

తల్లిదండ్రుల దృక్పథమూ మారాలి:
ఇంజనీరింగ్‌ కోర్సులో చేరే విద్యార్థుల విషయంలో తల్లిదండ్రుల దృక్పథం కూడా మారాలి. ఇంటర్మీడియెట్‌, ఎంసెట్‌ కోచింగ్‌ల కోసం లక్షలు వెచ్చించిన తల్లిదండ్రులు దాన్ని దృష్టిలో పెట్టుకుని.. ‘తమ పిల్లలకు బీటెక్‌ పూర్తయిన వెంటనే ఉద్యోగం రావాలి. లక్షల్లో జీతం పొందాలి’ అని ఆశించకూడదు. మరింత మెరుగైన భవిష్యత్తు కోణంలో ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించి తోడ్పాటునందించాలి.

విద్యార్థులకు సలహా:
వర్క్‌ హార్డ్‌. ఇదే.. కొత్తగా ఇంజనీరింగ్‌లో చేరనున్న విద్యార్థులకు నా సలహా. కష్టపడే తత్వాన్ని సొంతం చేసుకుని కోర్సులో చేరిన తొలిరోజు నుంచి తాము నేర్చుకున్న అంశాలకు సంబంధించి ప్రధానంగా ఫండమెంటల్స్‌, బేసిక్స్‌పై పట్టు సాధించాలి. ప్రతి విషయంలోనూ లోతైన అవగాహన సొంతం చేసుకోవాలి. వీటిలో నైపుణ్యమే అటు అకడెమిక్‌గా, ఇటు ఉద్యోగపరంగా భవిష్యత్తులో ప్రయోజనం చేకూర్చుతుంది. అంతేకాకుండా సిలబస్‌లో పేర్కొన్న అంశాలపై తమ అధ్యయనాన్ని రీసెర్చ్‌, అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో సాగించాలి. అప్పుడు ఉన్నత విద్య, లేదా ఉద్యోగం వంటి అవకాశాలు వాటంతటవే వరిస్తాయి.















#Tags