Asaf Jahi history: నిజాం వ్యక్తిగత సైన్యం పేరేంటి?
అసఫ్‌జాహీలు
నిజాం రాజ్య పాలకులు గతంలో మొగలులు, కుతుబ్‌షాహీలు అనుసరించిన భూమిశిస్తు విధానాలనే కొనసాగించారు. స్థానిక అవసరాల దృష్ట్యా కొన్ని మార్పులు చేశారు.
హైదరాబాద్ రాజ్య విస్తీర్ణం 82,698 చదరపు మైళ్లు. దీనిలో 60 శాతం దివానీ భూమి,30శాతం భూమి జాగీర్దార్ల ఆధీనంలో ఉండేది. మిగిలిన 10 శాతం భూమిని నిజాం సొంత ఖర్చుల కోసం నిర్దేశించేవారు. ఆ భూములను సర్ఫ్–ఎ–ఖాస్ అనేవారు.
దివానీ భూమి శిస్తు విధానం
- రాజ్యానికి చెందిన భూమిని ‘దివానీ లేదా ఖల్సా’ భూములు అనేవారు. ఇందులో 60 శాతం ప్రభుత్వ ఆధీనంలో ఉండేది.
- దివానీ భూముల నుంచి వచ్చే పన్నులను ప్రభుత్వ నిర్వహణకు ఉపయోగించేవారు.
- 1875లో దివానీ పద్ధతిలో క్రమబద్ధమైన సర్వే సెటిల్‌మెంట్ విధానం 1317 ఫసలీ చట్టం ద్వారా సాలార్‌జంగ్–1 ప్రవేశపెట్టాడు.
- 1948లో హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసేనాటికి సంస్థానం దివానీ భూమిలో 13,816 గ్రామాలు ఉన్నాయి.
- కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులకు మరమ్మతులు చేసి నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరిచారు.తెలంగాణలో ఎక్కువ శాతం వ్యవసాయం చెరువులు,వర్షం ఆధారంగా సాగయ్యేది.
- సాగు భూముల నుంచి వచ్చే ఆదాయం తక్కువ ఉండటం, సరైన మార్కెట్ వ్యవస్థ లేకపోవడం వల్ల గుత్తేదార్లు, దళారీలు రైతులను వీలైనంత ఎక్కువ దోచుకొనేవారు. ఫలితంగా 15 శాతం సాగు భూమి వృథాగా ఉండేది.
- నిజాం రాజ్యంలో రైత్వారీ విధానంతోపాటు ఇతర భూమి శిస్తు పద్ధతులు కూడా ఉండేవి. రైత్వారీ విధానం ఎక్కువ ప్రాచుర్యం పొందింది. నిజాం పాలకుల కింద అధిక భూభాగం ఈ విధానం కిందే ఉండేది. రాజ్యంలో రైత్వారీ పద్ధతితోపాటు సరబాస్ధా, ఇజారా, పాన్‌మక్తా వంటి ఇతర పద్ధతుల కింద కూడా భూమి ఉండేది.
చదవండి: Mir Osman Ali Khan History: ఆధునికత దిశగా అడుగులేసిన హైదరాబాద్!
రైత్వారీ విధానం
ఈ విధానంలో భూమి దున్నే రైతులకు యాజమాన్య హక్కులు ఇచ్చారు. ఈ విధానంలో మధ్యవర్తులు ఉండేవారు కాదు. దాదాపు 200 మిలియన్ల ఎకరాలకు పైగా భూమి రైత్వారీ విధానం కింద ఉండేది.
- హైదరాబాద్ రెవెన్యూ కోడ్ (1879) కింద ప్రభుత్వం భూయజమానులకు వాస్తవ హక్కులను కల్పించింది. ఈ కోడ్ ద్వారా రాజ్యంలో రైతును అసలైన యజమానిగా గుర్తించారు.
- భద్రత, సమర్థమైన పూర్తి హక్కులకు కోడ్ ప్రకారం రైతులకు అప్పగించారు. కొన్ని నియమ నిబంధనలతో రైతు ప్రభుత్వానికి క్రమం తప్పకుండా భూమి పన్ను కట్టాలి.
- రైత్వారీ విధానంలో పట్టాదారు తన భూమిని విక్రయించడానికి లేదా తనఖా పెట్టడానికి హక్కు ఉండేది.
- చట్టపరంగా సేద్య భూమిని వ్యక్తిగతంగా లేదా వ్యవసాయ కూలీల ద్వారా సేద్యం చేసేవారు. దీన్ని పట్టాదారు విధానం అనే వారు.
- ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ రైతులు సేద్యం ద్వారా ఉమ్మడిగా లేదా వాటాదారులుగానీ ఉత్పత్తి చేసిన దాంట్లో సమాన భాగస్వామ్యం కలిసి ఉన్న విధానమే ‘పాథ్ పట్టాదారీ’.
పాన్‌మక్తా:
ప్రభుత్వ భూములను కౌలుకు తీసుకొని స్థిరమైన శిస్తు చెల్లించే కౌలుదారీ విధానమే పాన్‌మక్తా. ఇందులో పన్ను పెరుగుదల ఉండేది కాదు.
ఇజారా పద్ధతి:
వ్యవసాయ క్షేత్రాలు బ్రిటిష్ ప్రాంత పరిపాలనలోకి వెళ్లకుండా, ముఖ్యంగా తెలంగాణ ప్రాం తంలో గ్రామాలను పునర్జీవనం చేయడానికి, బీడు భూములను సాగులోకి తీసుకురావడానికి ఉద్దేశించిన పద్ధతే ఇజారా పద్ధతి. పరిపాలనలో అవినీతిని నిరోధించడానికి, గుత్తేదార్లు, భూస్వాముల నుంచి వ్యవసాయదారులను రక్షించడానికి సాలార్‌జంగ్ సంస్కరణల ఫలితంగా ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు.
వతన్‌దారీ పద్ధతి:
- ఇది చాలా ప్రాచీన భూమిశిస్తు పద్ధతి. రాజుకు సేవ చేసినందుకు ప్రభుత్వం ఈ భూములను ఇచ్చేది. వతన్ అంటే స్థానిక లేదా సొంత ప్రాంతం అని అర్థం.
- స్థానిక రెవెన్యూ అధికారులైన పటేల్, పట్వారీ, దేశ్‌ముఖ్, దేశ్‌పాండే, సర్దేశ్‌పాండేలు, గ్రామంలోని వృత్తి పనివాళ్లకు, గ్రామ సేవకులకు నగదు రూపంలో ఇచ్చే జీతాలకు బదులుగా ఈ భూములను ఇచ్చేవారు.
సర్ఫ్–ఎ–ఖాస్:
- సర్ఫ్–ఎ–ఖాస్ పదాన్ని అరబిక్ భాష నుంచి గ్రహించారు. సర్ఫ్–ఎ– ఖాస్ అంటే వ్యక్తిగత వ్యయం అని అర్థం.
- నిజాం రాజు సొంత ఖర్చుల నిమిత్తం కేటాయించిన భూమే సర్ఫ్–ఎ–ఖాస్ (సర్ఫేఖాస్). వీటి విస్తీర్ణం 10,000 చదరపు మైళ్లు.
- 1948లో హైదరాబాద్ సంస్థానం, భారత యూనియన్‌లో విలీనం అయ్యేంత వరకు సర్ఫేఖాస్ భూముల ఆదాయం, వనరులను రాజ కుటుంబానికి కేటాయించారు.
- రెండో నిజాం కాలంలో దార్–ఉల్–సిఫ్రాఅనేది సర్ఫేఖాన్ భూముల కేంద్ర పరిపాలన విభాగం.
- నిజాంకు వ్యక్తిగత సైన్యం ఉండేది. దాన్ని సర్ఫేఖాస్ సైన్యం అని పిలిచేవారు.
- సర్ఫేఖాస్ ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో కలిపేవారు కాదు. ఈ భూముల్లో వసూలైన పన్నులను జిల్లా సర్ఫేఖాస్ ఖాతా నుంచి పర్యవేక్షకుడి ఖాతాలో చేరుతుంది. వీటిని ప్రభుత్వ ఆజ్ఞ ద్వారా సర్ఫేఖాస్ అధికారి పర్యవేక్షించేవాడు. ఖాతా ధనం మొత్తం సర్ఫేఖాస్ కార్యదర్శి ద్వారా సర్ఫేఖాస్ అధికారికి చేరుతుంది.
- సర్ఫేఖాస్ భూములను సర్దార్–ఉల్–మహమ్ అనే అధికారి పర్యవేక్షించేవాడు. ఇతడు ప్రత్యక్షంగా నిజాం ఆధీనంలో పనిచేసేవాడు.
- సర్ఫేఖాస్ భూములను ముఫ్‌వాజా(అప్ప గించిన భూములు), జేర్‌నిగరాని(పర్యవే క్షించే తాలూకాలు)గా విభజించారు.
జాగీర్దారీ పద్ధతి:
- నిజాం నవాబుకు, ప్రభుత్వానికి సేవచేసిన వారికి ఇచ్చిన భూములను జాగీర్లు అనేవారు. జాగీరు పొందిన వ్యక్తి ఆ ప్రాంతం మీద పూర్తి హక్కులు పొందుతాడు. అలా పూర్తి హక్కులు పొందినవారినే జాగీర్దార్లు.
- ఈ జాగీర్దారీ విధానాన్ని కాకతీయుల కాలంలోని నాయంకర విధానం, విజయనగర కాలంలో అమర నాయక విధానం, మొగలుల కాలంలో మున్సబ్‌దారీ విధా నాలతో పోల్చవచ్చు.
- జాగీర్దారీ విధానాన్ని మధ్యాసియా ప్రాం తం నుంచి ఢిల్లీ సుల్తాన్లు తీసుకువచ్చి భారతదేశంలో ప్రవేశపెట్టారు.
- జాగీర్దార్ అనే పదం రెండు పర్షియన్ పదాల కలయిక. జాగీరు అంటే భూమి, దార్ అంటే అధికారి. భూమి మీద హక్కులు ఉన్న అధికారి అని జాగీర్దార్ అర్థం.
- నిజాం రాజు మొత్తం భూభాగంలో 40 శాతం జాగీర్దార్లకు ఇచ్చారు.
- జాగీర్దారు తన జాగీరులో పన్నులు వసూలు చేసుకొని శాంతి భద్రతలు కాపాడుతూ, సైన్యాన్ని నిర్వహించేవారు. రాజుకు అవసరం ఉన్నప్పుడు సైన్యాన్ని పంపేవారు.
చదవండి: TS History for Group 1&2: హైదరాబాద్ ప్రధానుల్లోకెల్లా అత్యంత సమర్థుడిగా పేరు పొందిన వ్యక్తి?
జాగీరు రకాలు
పాయిగా జాగీర్
- పాయిగా జాగీరు భూములకు మరో పేరు జాగిరత్–ఇ–నిగదిస్తు జామతి. ఇది ఒక సైనిక జాగీరు. పాయిగా జాగీరును నవాబ్ నిజాం అలీ ఖాన్ బహదూర్ నుంచి అబ్దుల్ ఖాహిర్ ఖాన్, నవాబ్ çషంఘల్ ఉమ్రా, అమీర్–ఇ–కబీర్ గుర్రాల నిర్వహణ కోసం భూములను పొందారు. తర్వాత కాలంలో ఈ భూములను పాయిగా జాగీరుగా మార్చారు.
- పాయిగా అంటే స్థిరత్వం. ఈ జాగీరు మొత్తం విస్తీర్ణం 2000 చ.మైళ్లు. ఇందులో సుమారు 1000 గ్రామాలు ఉన్నాయి.
ఆల్‌తమ్‌గా జాగీర్:
- ఆల్‌తమ్‌గా తుర్కీ భాషకు చెందిన పదం. ఆల్‌తమ్‌గా అంటే రాజు చిహ్నానికి ఉన్న రెండు గుర్తులు. ఇది భూమిశిస్తు లేని జాగీరు. ఈ జాగీరును రాజు తన ముద్ర ద్వారా కేటాయిస్తారు. ఈ జాగీరు శాశ్వతమైన వంశపారపర్యంగా పొందే హక్కు. దీన్ని విక్రయించే హక్కు లేదు. ఒకవేళ ఈ భూమిని ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలంటే ముందుగా రాజు అనుమతి తీసుకోవాలి.
జాట్ జాగీర్‌లు:
- నిజాం కాలంలో అతిపెద్ద భూ విస్తీర్ణం ఉన్న జాగీరు. జీవితాంతం నిజాం కోసం సేవ చేసే వారికి ఇచ్చే భూములే జాట్ జాగీరులు.
- ఈ జాగీరు పొందినవారు తమ జీవితాంతం ఆ భూమిని అనుభవించవచ్చు.
- ఈ జాగీరుకు మరో పేరు ఖాన్ కా జాగీరు. ఈ జాగీర్దారుకు తమకు వచ్చే ఆదాయం పై న్యాయపరమైన హక్కు ఉండేది.
- వీరికి ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, భూమి కొలతల శాఖ మొదలైన వాటిపై పొందిన భూమిపై అన్నిరకాల పన్నుల నుంచి మినహాయింపులు ఉండేవి. వీరు సమాజంలో అత్యంత గౌరవప్రదమైన హోదాను కలిగి ఉండేవారు.
ఉమ్రా–ఇ–అజమ్ జాగీరు:
- వీరు కూడా నిజాం రాజు సేవకులే. పాయిగా జాగీరు తర్వాత స్థాయికి చెందినవారు. ఈ జాగీర్లను ఇలాఖాలు అని కూడా పిలిచేవారు. నిజాం రాజ్యంలో మొత్తం ఇలాఖాలు తొమ్మిది. ఇందులో ప్రధానమైనవి నాలుగు.
- ఈ నాలుగు ఇలాఖాలు అత్యంత పలుకుబడి ఉన్న అధికారుల ఆధీనంలో ఉండేవి. ఇవి నవాబ్ సాలార్‌జంగ్, మహారాజా శ్రీ కిషన్ ప్రసాద్, నవాబ్ ఖాని ఖానన్, నవాబ్ ఫఖుర్–ఉల్–ముల్క్ అనే ప్రధాన మంత్రులకు చెందినవి.
- ఈ ఇలాఖాల్లో మొత్తం 769 గ్రామాలు ఉండేవి. ఈ గ్రామాలను నాలుగు సంస్థానాలుగా విభజించారు.
- ఈ నాలుగు సంస్థానాల్లో సాలార్‌జంగ్‌కు చెందిన ఇలాఖా పెద్దది. ఇందులో 1126 చదరపు మైళ్ల విస్తీర్ణంతో 359 గ్రామాలుండేవి. ఇలాఖా నుంచి ఏడాదికి 20 లక్షల సిక్కాల ఆదాయం లభించేది.
- ఈ నాలుగు ఇలాఖాలు విడివిడిగా రెవెన్యూ, చట్ట నిర్వహణ చేసేవి.
మశ్రుతి జాగీర్లు:
- రాజ్యంలో ప్రజల కోసం, సైనిక వ్యవస్థ కోసం, మతం కోసం పనిచేసిన వ్యక్తులకు ఇచ్చే జాగీర్లు. ఇది షరతులతో కూడిన జాగీరు.
చదవండి: Qutb Shahi History Bitbank in Telugu: హుస్సేన్‌సాగర్ చెరువును నిర్మించిన పాలకుడు ఎవరు?
జాగీరు భూముల్లో రెవెన్యూ పరిపాలన
అన్ని జాగీరుల భూముల విస్తీర్ణం, ఆదాయం ఒకే విధంగా ఉండేది కాదు. ఈ జాగీరు ప్రాంతాల్లో వివిధ రకాలైన పరిపాలన ఉంటుంది. కాబట్టి కౌలుదార్ల నుంచి జాగీర్దార్లు ఎక్కువ కౌలు వసూలు చేసేవారు. నిజాం కూడా పెద్ద జాగీరుల ఆగడాలను నిలువరించలేకపోయాడు. కొన్ని సందర్భాల్లో నిజాం దివానీ హక్కులను కూడా జాగీర్దార్లు ధిక్కరించారు. తొంభై శాతం జాగీర్దార్లు నిజాం రాజు ప్రవేశపెట్టిన రెవెన్యూ విధానం కాకుండా తమ స్వతంత్ర శిస్తు విధానాన్ని అమలు చేశారు.
ఇనాం భూములు:
- ఇనాం అనేది బహుమతిగా ఇచ్చిన భూమి లేదా భూమిశిస్తు. పాలకులు పొందిన సేవలు లేదా భవిష్యత్తులో పొందే సేవలకు గాను సేవకులకు ఇనాం భూములు ఇచ్చారు.
అగ్రహారాలు:
- అగ్రహారాలు నిజాం కాలంలో ప్రధాన హిందూ విద్యా కేంద్రాలగా ఉండేది. విద్య బోధించడానికి బ్రాహ్మణులకు అగ్రహార గ్రామాలను శిస్తులేకుండా ఇచ్చేవారు. ఈ అగ్రహార భూములు వంశపారంపర్యంగా వారసులకు లభించేవి. ఈ విద్యాకేంద్రాలపై ఎటువంటి అజమాయిషీ ఉండేది కాదు.
వెట్టి:
- వెట్టి అంటే బలవంతంగా లేదా తప్పనిసరిగా దేశ్‌ముఖ్‌లకు, దొరలకు తక్కువ వేతనాలకు లేదా అసలు వేతనం లేకుండా పని చేయడం.
బాగేలా(వెట్టి చాకిరి) పద్ధతి:
- హైదరాబాద్ నిజాం కాలంలో సమాజంలో భూమి లేని తక్కువ వర్గాలకు చెందినవారు బాగేలా పద్ధతిలో పనిచేసేవారు. తీసుకున్న అప్పు తీరే వరకు కుటుంబంలో ఒక వ్యక్తి దేఖ్‌ముఖ్ లేదా దేశ్‌పాండే ఇంట్లో పని చేసేవారు. తనఖా ఉన్న బాగేలా జీతం చాలా తక్కువగా ఉండేది. బాగేలా చనిపోతే ఆ అప్పు తన కుమారుడికి వారసత్వంగా వెళ్లేది.
- 1992లో చిలుకూరులో జరిగిన నిజాం ఆంధ్ర మహాసభ సమావేశంలో వెట్టిచాకిరి నిర్మూలన కోసం అవగాహన వారాలను నిర్వహించింది.
- 1944 భువనగిరి, 1945 మణి కొండ నిజాం ఆంధ్ర మహాసభల్లో ‘వెట్టిచాకిరిని రద్దు చేయాలి’ అని తీర్మానం చేశారు.
చదవండి: Qutb Shahi History Bitbank in Telugu: మక్కా మసీదుకు పునాది వేసిన రాజు ఎవరు?
బ్రిటిష్ పాలనా కాలంలో ప్రధాన చట్టాలు (జనరల్ నాలెడ్జ్)
చట్టం | గవర్నర్ జనరల్ | సం‘‘ | అంశం |
చార్టర్ చట్టం | లార్డ్ మింటో | 1813 |
దేశంలో క్రిస్టియన్ మిషనరీలు ప్రచారం చేసుకోవటానికి అనుమతి ఇచ్చారు. అలాగే దేశంలో ఈస్టిండియా కంపెనీ ఏకస్వామ్యాన్ని రద్దు చేశారు. అన్ని బ్రిటిష్ కంపెనీలు వ్యాపారం చేసుకోవటానికి అనుమతి ఇచ్చారు. విద్యారంగానికి లక్షరూపాయలు కేటాయించారు |
సతీసహగమన నిషేధ చట్టం | లార్డ్ విలియం బెంటిక్ | 1829 | రాజారామ్మోహన్‌రాయ్ కృషి మేరకు సతీసహగమన దురాచారాన్ని రద్దు చేశారు. |