Skip to main content

TS History for Group 1&2: హైదరాబాద్‌ ప్రధానుల్లోకెల్లా అత్యంత సమర్థుడిగా పేరు పొందిన‌ వ్యక్తి?

నాలుగో అసఫ్‌ జా 'నసీరుద్దౌలా' 1853 మే 31న 'తురాబ్‌ అలీఖాన్‌'ను హైదరాబాద్‌ రాజ్య ప్రధానమంత్రిగా నియమించాడు. ఇతడికి 'సాలార్‌జంగ్‌' అనే బిరుదు ప్రదానం చేశాడు. సాలార్‌జంగ్‌.. రాజ్యంలో అనేక సామాజిక, ఆర్థిక, న్యాయపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టి రాజ్యాన్ని అభివృద్ధి పథంలో నడిపాడు. 1883లో మరణించే వరకూ ప్రధాని పదవిలో కొనసాగాడు. నసీరుద్దౌలా (1829-57), అఫ్జల్‌ ఉద్దౌలా (1857-69), మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ (1869-1911)ల కొలువులో పనిచేశాడు. హైదరాబాద్‌ ప్రధానుల్లోకెల్లా అత్యంత సమర్థుడిగా పేరు గడించాడు.
telangana history for group 1&2, competitive exams

సాలార్‌జంగ్‌ సంస్కరణలు

సాలార్‌జంగ్‌ ఆర్థిక సంస్కరణలపై దృష్టి కేంద్రీకరించి రాజ్యం ఆర్థిక పరిస్థితి చక్కదిద్దాడు. సాలార్‌జంగ్‌ ప్రధాని కావడానికి ముందు పన్ను వసూళ్లను వేలం పద్ధతిలో గుత్తేదారులకు అప్పగించేవారు. వీరు ప్రజల నుంచి బలవంతంగా పన్నులు వసూలు చేసేవారు. వారిని నిర్దాక్షిణ్యంగా దోచుకునేవారు. గుత్తేదారులు ప్రభుత్వ అధికారులతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకొని ప్రభుత్వ ఖజానాకు పన్నులు కట్టేవారు కాదు. సాలార్‌జంగ్‌ ఈ పద్ధతులను రద్దు చేశాడు. మొదటగా పన్ను వసూళ్లపై అదుపు కలిగిన దఫ్తాదార్‌ల అధికారాలు తగ్గించాడు. పన్ను వసూలు చేసే గుత్తేదారుల స్థానంలో నెల జీతంపై పనిచేసే తాలుకాదారులను నియమించాడు. ఈ రెండు విధానాల వల్ల రాజ్యానికి ఆదాయం పెరిగింది. దీంతో తనఖా పెట్టిన రాష్ట్ర ప్రభుత్వ ఆభరణాలను సాలార్‌జంగ్‌ విడిపించాడు. సాలార్‌జంగ్‌ తక్కువ వడ్డీతో కొత్త రుణాలు సేకరించి రాజ్య రుణభారాన్ని తగ్గించాడు. నాణేల సంస్కరణల్లో భాగంగా హైదరాబాద్‌లో కేంద్ర ద్రవ్య ముద్రణాలయాన్ని స్థాపించాడు. గద్వాల, నారాయణపేటలోని జిల్లా ద్రవ్య ముద్రణాలయాలను దీని పరిధిలోకి తీసుకువచ్చాడు. 1854లో 'హాలిసిక్కా' అనే నూతన నాణేన్ని ప్రవేశపెట్టాడు. ఈ నాణెం విలువ బ్రిటిష్‌ రూపాయి కంటే 15 రెట్లు ఎక్కువ.

చ‌ద‌వండి: TS History (అసఫ్‌జాహీలు ) for Group 1&2: వహాబీ ఉద్యమానికి నాయకుడు ఎవరు?

పాలనా సంస్కరణలు

సాలార్‌జంగ్‌ కంటే ముందు పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని సుబాలుగా విభజించారు. సుబాలను సర్కారులుగా, వాటిని తాలుకాలుగా వర్గీకరించారు. సుబాలో సుబేదార్, తాలుకాలో తాలుకాదార్‌ అనే అధికారులు పాలనా వ్యవహారాలను నిర్వహించేవారు. తాలుకాదార్‌ బ్రిటిష్‌ ఇండియాలోని కలెక్టర్‌తో సమానం. తాలుకాలో పన్ను వసూలు చేసే అధికారాన్ని ప్రభుత్వం తాలుకాదారులకు ఇచ్చింది. వీరికి ఎలాంటి జీతభత్యాలు ఉండేవి కాదు. రైతుల నుంచి పన్ను వసూలు చేసి అందులో కమీషన్‌ తీసుకునేవారు. పై అధికారులకు నజరానా(లంచం) చెల్లించి కొంతమంది తాలుకాదార్‌ పదవి పొందేవారు. ఈ విధంగా పదవి పొందినవారు పన్ను వసూలు కోసం 'నాయిబ్‌' (డిప్యూటీ తాలుకాదార్‌) అనే అధికారులను నియమించుకునేవారు. తాలుకాదారులు మాత్రం హైదరాబాద్‌ నగరంలో ఉండేవారు. ఈ విధానంలో లోపాలు ఉండటంతో హైదరాబాద్‌లోని బ్రిటిష్‌ రాజ ప్రతినిధి చార్లెస్‌ మెట్‌కాఫ్‌ తాలుకాదారులను పర్యవేక్షించడానికి బ్రిటిష్‌ అధికారులను నియమించాడు. అతడు హైదరాబాద్‌ నుంచి వెళ్లిన తర్వాత బ్రిటిష్‌ అధికారుల స్థానంలో 'అమిన్‌' అనే స్థానికాధికారులను నియమించారు. 

  • సాలార్‌జంగ్‌ పన్ను వసూలు కోసం 1855లో తాలుకాదారులను నియమించాడు.
  • 1865లో జిలాబంది విధానాన్ని ప్రవేశపెట్టి రాజ్యాన్ని 17 జిల్లాలుగా విభజించాడు. ప్రతి జిల్లాలో పాలనా బాధ్యతలను నిర్వహించడానికి సాలార్‌జంగ్‌ 'అవల్‌ తాలుకాదార్‌'ను నియమించాడు. ఇతడికి బ్రిటిష్‌ ఇండియాలోని జిల్లా కలెక్టర్‌తో సమాన విధులు ఉండేవి. అవల్‌ తాలుకాదార్‌కు సహాయంగా 'దోయం తాలుకాదార్‌' (సబ్‌ కలెక్టర్‌)లను నియమించాడు. వీరికి తోడ్పడటానికి సోయం తాలుకాదార్‌ అనే మూడో తరగతి ఉద్యోగులు కూడా ఉండేవారు. వీరికి బ్రిటిష్‌ ఇండియాలోని తహశీల్దార్లతో సమాన అధికారాలు ఉండేవి.
  • హైదరాబాద్‌ రాజ్యంలోని జిల్లాలను కలిపి అయిదు ప్రాంతీయ విభాగాలుగా ఏర్పాటు చేశారు. ప్రతి ప్రాంతీయ విభాగాన్ని పాలించడానికి ఒక సదర్‌ తాలుకాదార్‌ను నియమించారు. ఇతడికి బ్రిటిష్‌ ఇండియాలోని రెవెన్యూ కమిషనర్‌తో సమాన అధికారాలు ఉండేవి.

భూమిశిస్తు: రాజ్యంలో ప్రధాన ఆదాయ వనరు భూమిశిస్తు. తర్వాతి స్థానాల్లో ఆబ్కారీ పన్నులు,వాణిజ్య పన్నులు ఉండేవి. వీటితోపాటు స్థానిక జమీందారులు, రాజులు చెల్లించే పేష్కష్‌ ఇతర ఆదాయ వనరుగా ఉండేది. పేష్కష్‌ అంటే స్థానిక రాజులు లేదా సామంతరాజులు చెల్లించే కప్పం.
రాజ్యమంతటా రైత్వారీ విధానం అమల్లో ఉండేది. మునగాల, అమరచింత, గద్వాల లాంటి జమీందారీ సంస్థానాలు కూడా చాలా ఉండేవి. ప్రతి గ్రామంలో పటేల్‌ అనే అధికారి ఉండేవాడు. వీరు వంశపారంపర్యంగా అధికారం చెలాయించేవారు. గ్రామాల్లో శాంతిభద్రతలు కాపాడటానికి 'పౌజుదారీ పటేల్‌' అనే ఉద్యోగి ఉండేవాడు. గ్రామంలో లెక్కలు చేసే వ్యక్తిని పట్వారీ లేదా పాండే అని పిలిచేవారు. దేశ్‌ముఖ్, దేశ్‌పాండేల నాయకత్వంలో గ్రామాలను కొన్ని సర్కిళ్లుగా విభజించారు.

  • సాలార్‌జంగ్‌ ప్రజలకు సమర్థమైన న్యాయ పాలన అందించడానికి న్యాయస్థానాలను సంస్కరించాడు. జిల్లాల్లో ఉన్న న్యాయస్థానాల్లో మున్సిఫ్, మీర్‌ ఆదిల్‌ అనే న్యాయాధికారుల్ని నియమించాడు. వీరిపై హైదరాబాద్‌లోని హైకోర్టు (మహ్‌కాయ-ఇ- సదర్‌)కు అధికారం ఉండేది.
  • హైకోర్టుకు పైన అప్పీలు చేయడానికి 'మజ్లిస్‌-ఇ-మురఫా' పేరుతో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశాడు.
  • హైదరాబాద్‌లో బుజుంగ్‌ దివానీ అదాలత్, కుర్ద్‌ దివానీ అదాలత్‌ అనే రెండు సివిల్‌ కోర్టులు స్థాపించాడు. పౌజుదారీ అదాలత్‌ అనే క్రిమినల్‌ కోర్టును కూడా ఏర్పాటు చేశాడు.
  • ముస్లిం చట్టం 'షరియత్‌' ఆధారంగా ప్రధాన న్యాయమూర్తి 'నాజిమ్‌' తీర్పు చెప్పేవాడు.
  • వివిధ కోర్టుల కార్యక్రమాలను సమన్వయ పరచడానికి ప్రత్యేక న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేశారు.

చ‌ద‌వండి: Telangana History Qutub-Shahi Era: కుతుబ్‌షాహీల యుగ విశేషాలు.. మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా కవితల సంకలనం దివాన్‌

పోలీసు వ్యవస్థ

1865కు ముందు హైదరాబాద్‌ రాష్ట్రంలో సరైన పోలీసు వ్యవస్థ లేదు. కొత్వాల్‌ అనే నగర పోలీసు కమిషనర్‌ ఉండేవాడు. కాలక్రమంలో రెవెన్యూ అధికారులే పోలీసు విధులను నిర్వహించారు. గ్రామాల్లో వంశ పారంపర్యంగా వచ్చే గ్రామ కాపాలాదార్ల పద్ధతి ఉండేది.

  • సాలార్‌జంగ్‌ పోలీసు సంస్కరణల్లో భాగంగా 'మహ్‌కామ-ఇ-కొత్వాలి' అనే పోలీసు డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేశాడు. నిజామత్‌ అనే పేరుతో పోలీసు దళాన్ని కూడా ఏర్పాటు చేశాడు.
  • పోలీసు సూపరింటెండెంట్‌ను మహ్‌తామీన్‌గా, ఇన్‌స్పెక్టర్‌ను 'అమీన్‌'గా వ్యవహరించేవారు. పోలీసు స్టేషన్లను 'చౌకీ'లు అని పిలిచేవారు.
  • 1867లో సాలార్‌జంగ్‌ పోలీసు, రెవెన్యూ శాఖలను వేరు చేశాడు.

ఇతర సంస్కరణలు

  • హైదరాబాద్‌ రాజ్యంలో సతీ సహగమనాన్ని నిషేధించాడు.
  • 1856లో హైదరాబాద్‌లో మొదటిసారిగా పారిశ్రామిక వస్తు ప్రదర్శన(నుమాయిష్‌) ఏర్పాటు చేశాడు.
  • 1862లో పోస్టల్‌ శాఖను స్థాపించి హైదరాబాద్‌ నుంచి బొంబాయికి టెలిగ్రాఫ్‌ లైన్‌ను వేయించాడు.
  • సాలార్‌జంగ్‌ అనేక మంది స్థానికేతరులకు ఉద్యోగాలు కల్పించాడు. ఉత్తర భారతదేశానికి చెందిన చాలామంది ముస్లింలు, కాయస్థులు హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరారు. వీరిలో సయ్యద్‌ హుస్సేన్‌ బిల్‌ గ్రామి, సయ్యద్‌ అలీ బిల్‌ గ్రామి, మోహిబ్‌ హుస్సేన్, సయ్యద్‌ మహ్మద్‌ అలీ, మొహిన్‌ ముల్క్‌ తదితరులు పరిపాలనలో సాలార్‌జంగ్‌కు సహకరించారు.
  • చాలా మంది స్థానికేతరులను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించడం వల్ల తర్వాతి కాలంలో స్థానికులు, స్థానికేతరుల మధ్య వివాదాలు తలెత్తాయి. ఇది ముల్కీ ఉద్యమానికి దారితీసింది.

1857లో సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటిష్‌ ప్రతినిధి కల్నల్‌ డేవిడ్‌సన్‌కు సాలార్‌జంగ్‌ సహాయం చేశాడు. తుర్రేబాజ్‌ఖాన్‌ను, మౌల్వీ అల్లా ఉద్దీన్‌లను అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌ రాజ్యంలో 1857 సిపాయిల తిరుగుబాటును అణచివేశాడు. సాలార్‌జంగ్‌ నిర్విరామ కృషి వల్ల 1860లో ధారాశివ్, రాయచూర్‌ జిల్లాలు తిరిగి నిజాంకు దక్కాయి. బీరారు ప్రాంతాన్ని కూడా తిరిగి దక్కించుకునేందుకు కృషి చేశాడు. బీరారును తిరిగి పొందడం కోసం బ్రిటిష్‌ రాణితో చర్చలు జరపడానికి ఇంగ్లండ్‌ వెళ్లాడు. దీంతో బ్రిటిష్‌ ఇండియాలోని గవర్నర్‌లు ఇతడి పట్ల శత్రుత్వం వహించారు. వికార్‌-ఉల్‌-ఉమార్‌ను మహబూబ్‌ అలీఖాన్‌కు సహరాజ ప్రతినిధిగా నియమించారు. బీరారును తిరిగి పొందడానికి సాలార్‌జంగ్‌ చేసిన ప్రయత్నాలు లార్డ్‌ లిట్టన్‌ను ఇబ్బంది పెట్టాయి. సిపాయిల తిరుగుబాటులో సహయం చేసినందుకు హైదరాబాద్‌ నిజాం అఫ్జల్‌ ఉద్దౌలాకు బ్రిటిషర్లు 'స్టార్‌ ఆఫ్‌ ఇండియా' బిరుదును ఇచ్చారు. హైదరాబాద్‌ రాజ్యం ఈస్ట్‌ ఇండియా కంపెనీకి బాకీపడ్డ రూ. 50 లక్షల అప్పును రద్దు చేశారు.
1883 ఫిబ్రవరి 8న సాలార్‌జంగ్‌ మరణించాడు. అతడి మరణానంతరం రాజ్య పాలన అస్తవ్యస్తమైంది. ముల్కీ, నాన్‌ ముల్కీ వివాదాలు తలెత్తాయి. దీనివల్ల పరిపాలనలో పూర్తిగా స్తబ్ధత ఏర్పడింది. బ్రిటిష్‌ ప్రభుత్వం సాలార్‌జంగ్‌ కుమారుడైన మీర్‌ లాయక్‌ అలీఖాన్‌ను, రాజా నరేంద్ర బహదూర్‌ను రాష్ట్రానికి సంయుక్త పాలకులుగా నియమించింది.సాలార్‌జంగ్‌ కుమారుడైన మీర్‌ లాయక్‌ అలీఖాన్‌.. ఆరో నిజాం మహబూబ్‌ అలీఖాన్‌తో కలిసి చదువుకున్నాడు. ఇతడే 1884లో రెండో సాలార్‌జంగ్‌ బిరుదుతో హైదరాబాద్‌ రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు.

చ‌ద‌వండి: Telangana History for Groups: కాకతీయుల కాలంలో గ్రామరక్షణ బాధ్యత ఎవరిది?

విద్యా సంస్కరణలు

  • పరిపాలనలో సహాయం చేయడం కోసం సుశిక్షుతులైన ఉద్యోగులను నియమించేందుకు అనుగుణంగా విద్యా విధానంలో అనేక మార్పులు ప్రవేశపెట్టాడు.
  • 1855లో దార్‌-ఉల్‌-ఉలూమ్‌ అనే ఉన్నత పాఠశాలను రాజ్యంలో ఏర్పాటు చేశాడు. ఈ పాఠశాల స్థాపన పాశ్చాత్య విద్యాబోధనలో తొలిమెట్టుగా చెప్పొచ్చు. ఈ పాఠశాలలో పర్షియన్, ఉర్దూ భాషల్లోనే కాకుండా ఆంగ్ల భాషలోనూ బోధించేవారు.
  • 1869లో సాలార్‌జంగ్, మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌కు సహ రాజప్రతినిధిగా నియమితులయ్యాడు. ఆంగ్ల భాషా బోధన, పాశ్చాత్య విద్యావ్యాప్తికి అనేక పాఠశాలలు నెలకొల్పాడు.
  • 1870లో హైదరాబాద్‌లో నగర ఉన్నత పాఠశాల, 1872లో చాదర్‌ఘాట్‌ ఉన్నత పాఠశాలను స్థాపించాడు. ప్రజా పనుల శాఖలో పనిచేయడానికి కావాల్సిన సాంకేతిక సిబ్బంది శిక్షణ కోసం 1870లో ఇంజనీరింగ్‌ పాఠశాల నెలకొల్పాడు.
  • పాలకుల పిల్లల కోసం 1873లో 'మదరసా-ఇ-అలియా' స్థాపించాడు.
  • రాజ కుటుంబంలోని పిల్లలు చదుకోవడం కోసం కోసం 1878లో మదరసా-ఇ-ఐజాను ప్రారంభించాడు.
  • అలీఘర్‌లో విద్యాసంస్థల్ని స్థాపించడానికి సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌కు ఆర్థిక సహాయం అందజేశాడు. హైదరాబాద్‌కు చెందిన వికార్‌-ఉల్‌-ముల్క్, మొహసిక్‌-ఉల్‌-ముల్క్‌ అనే ఇద్దరు అధికారులు అలీఘర్‌ కాలేజీ ఏర్పాటులో చురుగ్గా పాల్గొన్నారు.
  • 1881లో గ్లోరియా గర్ల్స్‌ హైస్కూల్‌ను ఏర్పాటు చేశాడు.
  • సాలార్‌జంగ్‌ మరణించాక 1887లో చాదర్‌ఘాట్‌ ఉన్నత పాఠశాలను 'మదరసా-ఇ-అలియా'లో విలీనం చేసి నిజాం కాలేజీని ఏర్పాటు చేశారు.

చ‌ద‌వండి: Telangana History for Group 1 & 2: కాకతీయ సామ్రాజ్యం... రేచర్ల రెడ్ల వంశ మూలపురుషుడు?

రవాణా సంస్కరణలు

  • 1863లో హైదరాబాద్‌ నుంచి షోలాపూర్‌ వరకు గ్రాండ్‌ ట్రంక్‌ రోడ్డు నిర్మించాడు.
  • బ్రిటిషర్లు మద్రాసు-బొంబాయి మధ్య రైల్వే లైన్‌ను హైదరాబాద్‌ రాజ్య భాగాలైన గుల్బర్గా,వాడి ద్వారా పోయేవిధంగా నిర్మించారు.
  • 1874లో హైదరాబాద్, వాడి మధ్య రైల్వే నిర్మాణం ప్రారంభించి 1878లో పూర్తి చేశాడు. దీంతో రాజ్యంలో ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడ్డాయి.
  • పరిపాలనా భారం విపరీతంగా పెరగడంతో సాలార్‌జంగ్‌ 'సదర్‌-ఉల్‌-మహమ్‌' అనే నలుగురు మంత్రులను నియమించాడు. వీరిలో ముగ్గురు మంత్రులకు కొత్తగా ఏర్పాటు చేసిన పోలీసు, రెవెన్యూ, న్యాయశాఖలను అప్పగించాడు. విద్య, ఆరోగ్య శాఖలకు ఉమ్మడిగా నాలుగో మంత్రిని నియమించాడు. వీరందరూ ప్రధానమంత్రి (దివాను) నేతృత్వంలో పనిచేసేవారు.

Nareshకొప్పు నరేష్, సబ్జెక్టు నిపుణులు

Published date : 17 Nov 2022 05:52PM

Photo Stories