Indian Polity : మెజారిటీ సీట్లు లభించనప్పుడు ప్రధాని నియామకం ఎలా ఉంటుంది..?

భారత రాజ్యాంగం పార్లమెంటరీ లేదా మంత్రివర్గ పాలిత ప్రభుత్వాన్ని నిర్దేశించింది. పార్లమెంటరీ వ్యవస్థ ముఖ్య లక్షణం రెండు రకాలైన అధిపతులు ఉండటం. రాజ్యాంగ పరంగా ఉండే రాష్ట్రపతికి నామమాత్ర అధికారాలు ఉంటే, ప్రధాన మంత్రి అధ్యక్షతన ఉన్న మంత్రిమండలి అన్ని అధికారాలను చెలాయిస్తుంది. 

ప్రధాన మంత్రి–మంత్రి మండలి

రాజ్యాంగ రీత్యా దేశాధిపతి రాష్ట్రపతి అయితే ప్రధాన మంత్రి అధ్యక్షతన ఉన్న మంత్రి మండలి వాస్తవమైన కార్యనిర్వాహక అధికారాలను కలిగి ఉంటుంది. భారతదేశంలో బ్రిటిష్‌ తరహా పార్లమెంటరీ వ్యవస్థ ఉంది. దీన్నే ‘వెస్ట్‌ మినిస్టర్‌’ పద్ధతి అంటారు. (వెస్ట్‌ మినిస్టర్‌ అనేది ఇంగ్లండ్‌లో ఒక ప్రాంతం. అక్కడే పార్లమెంటు భవనం ఉంది. అందువల్ల దీనికి ఆ పేరు వచ్చింది.)

రాజ్యాంగ స్థానం
భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ప్రకరణలు 74, 75, 78లో ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రి మండలికి సంబంధించిన వివరాలను పొందుపరిచారు.
ప్రకరణ 74(1): రాష్ట్రపతికి తన విధి నిర్వహణలో సహాయం, సలహాలను అందించడానికి ప్రధాన మంత్రి అధ్యక్షతన మంత్రి మండలి ఉంటుంది. వీరి సలహా మేరకే రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించాలి.
ప్రత్యేక వివరణ: మౌలిక రాజ్యాంగంలో మంత్రి మండలి సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి అని అర్థం వచ్చేలా ఎలాంటి పదబంధం లేదు. అయితే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రకరణకు ‘షల్‌’ (Shall) అనే పదం చేర్చారు. దీని ప్రకారం మంత్రి మండలి సలహా మేరకే రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది.
1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రకరణ 74లో మరో అంశాన్ని చేర్చారు. మంత్రి మండలి నిర్ణయాన్ని రాష్ట్రపతి పునర్‌ పరీశీలనకు పంపవచ్చు. పునర్‌ పరిశీలనకు పంపిన అంశాలను మంత్రి మండలి మార్పు చేయవచ్చు, చేయకపోవచ్చు. రెండో పర్యాయం రాష్ట్రపతి ఆమోదానికి పంపితే ఆ అంశాలను ఆయన తప్పకుండా ఆమోదించాలి.
ప్రకరణ 74(2) ప్రకారం మంత్రిమండలి రాష్ట్రపతికి ఏ సలహా ఇచ్చారో, ఆ సలహా ఎందుకు ఇచ్చారో న్యాయస్థానాల్లో ప్రశ్నించడానికి వీలు లేదు.


నియామకం
     ప్రకరణ 75(1) ప్రకారం ప్రధాన మంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. అదేవిధంగా ప్రధాని సలహా మేరకు ఇతర మంత్రులను కూడా నియమిస్తారు.
     ప్రకరణ 75(1ఎ) ప్రకారం కేంద్రంలో మంత్రిమండలి సంఖ్య, ప్రధాన మంత్రితో కలిపి లోక్‌సభ సభ్యుల మొత్తం సంఖ్యలో 15 శాతానికి మించరాదు.
     ప్రకరణ 75(1బి) ప్రకారం ఏదైనా గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీకి చెందిన సభ్యుడు పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హుడైతే, అతడిని మంత్రిగా నియమించరాదు. ఈ అనర్హత అతడు మంత్రిగా ఉన్న కాలంలో జరిగితే, అది అతడి సభ్యత్వ కాలం ముగిసేంత వరకు కొనసాగుతుంది. ఒకవేళ తిరిగి ఎన్నికల్లో ΄ోటీ చేసి విజయం సాధిస్తే, అంతటితో అనర్హత ముగుస్తుంది.
గమనిక: 75(1ఎ), (1బి) క్లాజులను 2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
     ప్రకరణ 75(2) ప్రకారం రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు ప్రధాన మంత్రి, మంత్రి మండలి పదవుల్లో కొనసాగుతారు.
     ప్రకరణ 75(3) ప్రకారం మంత్రులు సంయుక్తంగా లోక్‌సభకు బాధ్యత వహిస్తారు.
     ప్రకరణ 75(4) ప్రకారం, మంత్రులందరూ తమ పదవిలోకి ప్రవేశించే ముందు మూడో షెడ్యూల్‌లో పేర్కొన్న నమూనా ప్రకారం రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణం చేయాలి.
     ప్రకరణ 75(5) ప్రకారం ఎవరైనా వ్యక్తి మంత్రి పదవి చేపట్టాక ఆరు నెలల్లోపు పార్లమెంటు సభ్యునిగా ఎన్నిక కాకుంటే ఆయన మంత్రి పదవిని కోల్పోతారు.
     ప్రకరణ 75(6) ప్రకారం మంత్రుల జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. వీటి ప్రస్తావన రెండో షెడ్యూల్‌లో ఉంది.
ప్రధాని నియామకానికి సంబంధించి రాజ్యాంగంలో ప్రత్యేకమైన ప్రక్రియ గురించి పేర్కొనలేదు. పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం, లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన రాజకీయ పార్టీకి చెందిన నాయకుడిని రాష్ట్రపతి ఆహ్వానించి, ప్రధాన మంత్రిగా నియమించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కోరతారు. లోక్‌సభలో ఏ రాజకీయ పార్టీకి నిర్దిష్టమైన మెజారిటీ సీట్లు లభించనప్పుడు రాష్ట్రపతి తన విచక్షణాధికారాన్ని వినియోగించి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పరిచే క్రమంలో అత్యధిక స్థానాలు సాధించిన రాజకీయ పార్టీ లేదా పార్టీల కూటమి నాయకుడిని ప్రధానిగా నియమించి, మెజారీటీ నిరూపించుకోమని కోరతారు.
ఉదాహరణకు 1979లో నీలం సంజీవరెడ్డి  
రాష్ట్రపతిగా ఉన్నప్పుడు చరణ్‌సింగ్‌ను ప్రధానిగా నియమించడం కొంత వివాదానికి దారితీసింది. నాటి ప్రతిపక్ష నాయకుడైన వై.బి.చవాన్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సంజీవరెడ్డి ఆహ్వానించారు. కానీ, చవాన్‌ తన అశక్తతను వ్యక్తపరిచారు. ఈ పరిస్థితిలో జగ్జీవన్‌రామ్‌ను విస్మరించి చరణ్‌సింగ్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించడం వివాదానికి కారణమైంది. అయితే చరణ్‌సింగ్‌ లోక్‌సభ సమావేశాలకు హాజరు కాకుండానే ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
ఈ విధంగా లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ లేకుండా 1989లో వి.పి.సింగ్, 1990లో చంద్రశేఖర్, 1991లో పి.వి. నరసింహారావు, 1996లో ఎ.బి.వాజ్‌పేయి, 1996లో దేవెగౌడ, 1997లో ఐ.కె. గుజ్రాల్, 1998లో ఎ.బి. వాజ్‌పేయి, 2004, 2009లో మన్మోహన్‌ సింగ్‌ ప్రధాన మంత్రులుగా నియమితులయ్యారు.
సుప్రీం కోర్టు తీర్పులు: మెజారిటీ కోల్పోయిన ప్రధాన మంత్రి రాజీనామా చేసి, తదనంతరం లోక్‌సభ రద్దయితే, ఆ వ్యక్తిని ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగించి పరిపాలన చేయవచ్చు. అయితే విధాన నిర్ణయాలు చేయరాదని 1971లో యు.ఎన్‌.రావుVsఇందిరా గాంధీ కేసు సందర్భంగా సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.
ప్రధాన మంత్రి అర్హతలు: రాజ్యాంగంలో ప్రధాన మంత్రి పదవికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక అర్హతలు గురించి పేర్కొనలేదు. అయితే పార్లమెంట్‌లో సభ్యుడిగా ఉండాలి. నియమితులయ్యే సమయానికి పార్లమెంటులో సభ్యత్వం లేకపోతే నియామకం పొందిన రోజు నుంచి ఆరు నెలల్లోపు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికవ్వాలి.
ప్రత్యేక వివరణ: రాజ్యాంగపరంగా ప్రధాన మంత్రిగా నియమితులవడానికి పార్లమెంటు సభ్యుడైతే చాలు. సాధారణంగా ప్రధానమంత్రి లోక్‌ సభలో సభ్యుడై ఉండాలి. రాజ్య సభలో సభ్యులుగా ఉండి ప్రధాన మంత్రులైనవారు ఇందిరా గాంధీ (1966), దేవెగౌడ (1996), ఇందర్‌ కుమార్‌ గుజ్రాల్‌ (1997), మన్మోహన్‌ సింగ్‌ (2004, 2009).

ప్రధాని ప్రమాణ స్వీకారం – జీతభత్యాలు
     ప్రధాన మంత్రితో రాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాజ్యాంగ పరంగా భారత ఐక్యతను, సమగ్రతను పరిరక్షిస్తామని, నమ్మకంతో, నిర్భయంగా, నిజాయితీగా విధులు నిర్వర్తిస్తామని ప్రధాన మంత్రి ప్రమాణం చేయాలి.
     ప్రధాన మంత్రి, ఇతర మంత్రుల జీతభత్యాల ను పార్లమెంటు ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. పార్లమెంటు సభ్యులకు వచ్చే జీతభత్యాలు, ఇతర సౌకర్యాలను కలిగి ఉంటారు.
     ప్రకరణ 78 ప్రకారం రాష్ట్రపతికి ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయడం ప్రధాన మంత్రి బాధ్యత.
     ప్రకరణ 78(ఎ) ప్రకారం కేంద్ర మంత్రి మండలి నిర్ణయాన్ని ప్రధాన మంత్రి రాష్ట్రపతికి తెలియజేస్తారు.
     ప్రకరణ 78 (బి) ప్రకారం, ప్రభుత్వానికి సంబంధించిన ఇతర సమాచారాన్ని రాష్ట్రపతి ప్రధాన మంత్రి ద్వారా తెలుసుకోవచ్చు.
     ప్రకరణ 78 (సి) ప్రకారం.. సమర్పించిన సమాచారంలో ఏదైనా అంశం మంత్రి చేసిన నిర్ణయమా లేదా మంత్రి మండలి చేసిన నిర్ణయమా అనే సంశయం ఉన్నప్పుడు, దాన్ని మంత్రి మండలి పరిశీలనకు పంపమని రాష్ట్రపతి ప్రధాన మంత్రిని కోరవచ్చు.
ప్రత్యేక వివరణ: మంత్రి మండలి ఏర్పాటు పూర్తిగా ప్రధాన మంత్రి విశిష్టాధికారం. ఎవరిని మంత్రిగా తీసుకోవాలి, ఎవరిని తొలగించాలి, ఎలా పునర్‌ వ్యవస్థీకరించాలి అనేది ప్రధాన మంత్రి అభీష్టం. అయితే రాజకీయ పరమైన అంశాలు, వివిధ వర్గాలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం, పరిపాలనా సౌలభ్యం మొదలైన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అధికార పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాన మంత్రికి ఇష్టం లేకపోయినా కొందరు ప్రముఖులను మంత్రి మండలిలోకి తీసుకోవాల్సి వస్తుంది.

ప్రధాన మంత్రి పదవీ కాలం, తొలగింపు
సాధారణంగా ప్రధాన మంత్రి పదవీ కాలం లోక్‌సభతో ΄ాటుగా అయిదేళ్లు ఉంటుంది. అయితే ఇది లోక్‌సభలోని మెజారిటీ సభ్యుల విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. పదవిలో కొనసాగడానికి ఇష్టపడనప్పుడు రాష్ట్రపతికి రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారు. ప్రధాన మంత్రి రాజీనామా చేస్తే మంత్రి మండలి స్వతహాగా రద్దవుతుంది. పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారం ప్రధాన మంత్రి కింద పేర్కొన్న పరిస్థితుల్లో పదవి కోల్పోతారు.
     లోక్‌ సభలో మంత్రి మండలిపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు.
     లోక్‌ సభలో విశ్వాసం కోరిన తీర్మానానికి మెజారిటీ లభించనప్పుడు.
     లోక్‌ సభ ద్రవ్య బిల్లును తిరస్కరించినప్పుడు.
     బడ్జెట్‌పై కోత తీర్మానం నెగ్గినప్పుడు.
     రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానం వీగిపోవడం లేదా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణ తీర్మానం నెగ్గడం. 

#Tags