TSPSC Group-2 Exams Dates 2024 : 783 పైగా గ్రూప్-2 ఉద్యోగాలు.. పక్కాగా జాబ్ కొట్టాలంటే.. ప్రిపరేషన్ వ్యూహాం ఇలా..!
అలాగే ఈ గ్రూప్-2 ఉద్యోగాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షవిధానం ఎలా ఉంటుంది..? పక్కాగా జాబ్ కొట్టాలంటే.. ప్రిపరేషన్ వ్యూహాం ఎలా ఉండాలి..? మొదలైన అంశాలపై సాక్షి ఎడ్యుకేషన్.కామ్ అందిస్తున్న పత్యేక స్టోరీ మీకోసం..
TSPSC గ్రూప్–2 పరీక్ష ఇలా..
పేపర్ | సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు |
1 | జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ | 150 | 150 |
2 |
హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ 1) సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా, తెలంగాణ |
150 | 150 |
3 | ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ 1) ఇండియన్ ఎకానమీ: సమస్యలు, సవాళ్లు 2) ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ తెలంగాణ 3) అభివృద్ధి సమస్యలు, మార్పు |
150 | 150 |
4 | తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం 1) ఐడియా ఆఫ్ తెలంగాణ(1948–1970) 2) మొబిలైజేషన్ దశ (1971–1990) 3) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ (1991–2004) |
150 | 150 |
మొత్తం | 600 | 600 |
TSPSC గ్రూప్-2 సొంతంగా నోట్స్ ఇలా..
గ్రూప్-2 అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభం నుంచే ఆయా సబ్జెక్ట్‌లలోని ముఖ్యమైన అంశాలతో సొంత నోట్స్ రాసుకుంటారు. ప్రస్తుత సమయంలో దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆయా విభాగాలకు సంబంధించి ముఖ్యమైన పాయింట్లతో రాసుకున్న నోట్స్‌ను పదే పదే చదువుతూ ముందుకు సాగాలి. మతాలు, సామాజిక వర్గాలు, గిరిజన సమస్యలు, ప్రాంతీయ సమస్యలు వంటి స్థానిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా ఒక అంశాన్ని చదివేటప్పుడు అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. ఉదాహరణకు సామాజిక వర్గాలనే పరిగణనలోకి తీసుకుంటే.. ఆయా వర్గాల నిర్వచనానికే పరిమితం కాకుండా.. వాటి ఆవిర్భావ చరిత్ర, విస్తరణ, తాజా పరిస్థితులు.. ఇలా అన్నింటినీ అధ్యయనం చేయాలి.
కామన్ టాపిక్స్‌ను ఏకకాలంలో చదివేలా..
ప్రస్తుత సమయంలో..ఆయా పేపర్లలో ఉన్న కామన్ టాపిక్స్‌ను ఏకకాలంలో చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆయా సబ్జెక్ట్‌లలోని ఉమ్మడి అంశాలను గుర్తించి.. వాటిని అనుసంధానం చేసుకుంటూ చదవాలి. ఫలితంగా ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, భారత రాజ్యాంగం, పరిపాలన, ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్.. ఇలా అన్ని అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదివే వీలుంది. ప్రతి రోజు సగటున కనీసం 8 నుంచి 10 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి.
ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు కష్టంగా భావించి కొన్ని టాపిక్స్‌ను చదవకుండా పక్కనపెట్టేస్తారు. వాటిలో ముఖ్యమైనవి కూడా ఉండొచ్చు. ఇలాంటి టాపిక్స్ కోసం ఇప్పుడు కొంత సమయం కేటాయించాలి. దీంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఇంగ్లిష్,రీజనింగ్‌లకు సంబంధించి ఎక్కవ ప్రాక్టీస్ చేయాలి.
కేంద్ర, రాష్ట్ర పభుత్వాల పథకాలపై..
అభ్యర్థులు కేంద్ర, రాష్ట్ర పభుత్వాల తాజా విధానాలు, పథకాలపై దృష్టి పెట్టడం మేలు చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఆర్థిక, సామాజిక సమస్యలు, వాటిపై ప్రభుత్వాలు రూపొందించిన విధానాలపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు మహిళా సాధికారత వంటివి. మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, ఎస్సీలు, గిరిజనులు, వికలాంగుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పథకాలు తెచ్చారు. వాటి గురించి కూలంకషంగా అధ్యయనం చేయాలి.ముఖ్యంగా తెలంగాణ పాలసీలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా తెలంగాణ ఏర్పాటు, దానికి సంబంధించి ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్న నీళ్లు.. నిధులు.. నియామకాలపై ఎలాంటి విధానాలు తెచ్చారో తెలుసుకోవాలి.
స్కోరింగ్ పేపర్ ఇదే..
గ్రూప్–2 అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన పేపర్..పేపర్–4. ఇది గరిష్టంగా స్కోర్ చేసేందుకు అవకాశమున్న పేపర్. ఈ పేపర్‌ను ‘తెలంగాణ ఆలోచన(1948–1970), ఉద్యమ దశ(1971–1990), తెలంగాణ ఏర్పాటు దశ, ఆవిర్భావం(1991–2014)) దశగా పేర్కొన్నారు. ముఖ్యంగా 1948 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకూ.. జరిగిన ముఖ్య ఉద్యమాలు, ఒప్పందాలు, ముల్కీ నిబంధనలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు–వాటి సిఫార్సులు వంటి వాటిపై అవగాహన ఏర్పరచుకోవాలి. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రూపొందించిన పునర్ వ్యవస్థీకరణ బిల్లులో పొందుపరచిన అంశాలనూ ఒకసారి చూసుకోవడం మేలు.
వీటిపై ‘స్పెషల్’ ఫోకస్ పెట్టితే..
తెలంగాణ ప్రత్యేక అంశాలను చదివేటప్పుడు.. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీపై గట్టి పట్టు సాధించాలి. తెలంగాణ చరిత్రకు సంబంధించి ఆయా రాజ వంశాలు,శాసనాలు, గ్రంథాలు, ముఖ్యమైన యుద్ధాలు,కవులు–రచనలు;కళలు;ముఖ్య కట్టడాలపై అవగాహన పెంచుకోవాలి.అదే విధంగా స్వాతంత్య్రోద్యమ సమయం లో తెలంగాణ ప్రాంత ప్రమేయం ఉన్న సంఘటనల గురించి తెలుసుకోవాలి. తెలంగాణలోని ముఖ్యమైన నదులు–పరీవాహక ప్రాంతాలు; ముఖ్యమైన పంటలు; భౌగోళిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. దీంతోపాటు తెలంగాణ భౌగోళిక స్వరూపం–విస్తీర్ణం, జనాభా వంటి వాటిపైనా అవగాహన అవసరం. ఎకానమీలో తెలంగాణ స్థూల రాష్ట్రీయోత్పత్తి, ముఖ్యమైన పథకాలు, 2011 జనాభా గణాంకాలు; ముఖ్యమైన పరిశ్రమలు– ఉత్పత్తిదాయకత, రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులపై పట్టు సాధించాలి. తాజా బడ్జెట్ గణాంకాలు, ఆయా శాఖలు, పథకాలకు కేటాయింపులపై అవగాహన ఏర్పరచుకోవాలి.
చదవండి: TSPSC Group 2 Exam Preparation Tips: గ్రూప్–2.. సక్సెస్ ప్లాన్
గ్రూప్–2 ప్రాక్టీస్ టెస్ట్‌లు..
ప్రస్తుతం సమయంలో గ్రూప్–2 అభ్యర్థులు ప్రాక్టీస్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరవడం కూడా మేలు చేస్తుంది. దీనివల్ల ఆయా సబ్జెక్ట్‌లలో తమకు ఇప్పటి వరకు లభించిన పరిజ్ఞాన స్థాయిపై అవగాహన లభిస్తుంది. ఇంకా చదవాల్సిన అంశాల విషయంలో స్పష్టత వస్తుంది. అదే విధంగా తాము చేస్తున్న పొరపాట్లను విశ్లేషించుకుని.. వాటిని సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది.
చదవండి: TSPPC Groups-2 Practice Test
గ్రూప్–2 పరీక్షకు ముందు రోజు..
పరీక్షకు ఒకరోజు ముందు అభ్యర్థులు సబ్జెక్ట్ ప్రిపరేషన్ కంటే మరుసటి రోజు ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లేందుకు అవసరమైన వాటిని సిద్ధం చేసుకోవాలి. తీవ్ర పోటీ నేపథ్యంలో చివరి నిమిషం వరకు చదవాలనే తపన ఉండటం సహజం. కాని అతిగా చదవడం వల్ల మానసిక ఒత్తిడి, అలసటకు గురయ్యే ప్రమాదం ఉందని గుర్తించాలి.
గ్రూప్ 2కు హాజరయ్యే అభ్యర్థులు.. రేయింబవళ్లు శ్రమిస్తేనే మంచి మార్కులు వస్తాయని భావిస్తుంటారు. దీంతో ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రిపరేషన్ సాగిస్తుంటారు. పరీక్షకు ముందు రోజు కూడా ఇలా అర్థరాత్రి వరకూ చదవుతూ ఉంటారు. ఇది మరుసటి రోజు పరీక్ష హాల్లో ప్రదర్శన తీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎలాంటి ఆందోళన లేకుండా కంటి నిండా నిద్రకు సమయం కేటాయించాలి. ప్రశాంతంగా పరీక్షకు హాజరవడం మేలు.
TSPSC Group -2 పరీక్ష రోజు ఇలా..
- ఎంత కష్టపడి చదివినా పరీక్ష రోజున రెండున్నర గంటల వ్యవధిలో చూపే ప్రతిభే విజయాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి పరీక్ష రోజు అప్రమత్తత చాలా అవసరం.
- పరీక్షకు సమాధానాలు గుర్తించేందుకు ఉద్దేశించిన ఓఎంఆర్ షీట్ నింపడంలోనూ అభ్యర్థులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఓఎంఆర్ షీట్‌ను తప్పులు లేకుండా నింపడంతోపాటు సమాధానాలు బబ్లింగ్ చేసే క్రమంలో ప్రశ్న సంఖ్య.. ఆప్షన్‌ను క్షుణ్నంగా గుర్తించాలి.
- ప్రతి ప్రశ్నకు సమాధానం గుర్తించాలనే తపనను వీడి.. ముందుగా ప్రశ్న పత్రాన్ని చదివేందుకు కొంత సమయం కేటాయించాలి. కనీసం పది నిమిషాలపాటు ప్రశ్న పత్రం ఆశాంతం పరిశీలించాలి. ఫలితంగా ప్రశ్న పత్రం క్టిష్లత స్థాయిపై ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత తమకు సులభంగా భావించిన ప్రశ్నలకు ముందుగా సమాధానం ఇవ్వాలి. అనంతరం ఓ మోస్తరు క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం గుర్తించాలి. చివరగా అత్యంత క్లిష్టంగా భావించిన ప్రశ్నలపై దృష్టి పెట్టాలి.
- ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే ప్రిలిమ్స్ పరీక్షలో చాలా మంది అభ్యర్థులు చేసే పని.. ఎలిమినేషన్ టెక్నిక్‌ను అనుసరించడం. అంటే.. నాలుగు సమాధానాల్లో ప్రశ్నకు సరితూగని వాటిని ఒక్కొ క్కటిగా తొలగించుకుంటూ.. చివరగా మిగిలిన ఆప్షన్‌ను సమాధానంగా గుర్తించడం. ఈ టెక్నిక్‌ను కూడా పరీక్ష చివరి దశలోనే అమలు చేయాలి. అప్పటికే తమకు సమాధానాలు తెలిసిన అన్ని ప్రశ్నలను పూర్తి చేసుకున్నామని భావించాకే ఎలిమినేషన్ లేదా గెస్సింగ్‌పై దృష్టి పెట్టాలి.
TSPSC గ్రూప్-2 అర్హతలు :
బ్యాచిలర్ డిగ్రీ, ADO టెక్స్‌టైల్ శాఖ పోస్టుకు డిగ్రీ లేదా డిప్లోమా ఇన్ టెక్స్‌టైల్ టెక్నాలజీ, డిప్లోమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కలిగి ఉండాలి.
TSPSC గ్రూప్-2 వయోపరిమితి :
18–44 సంవత్సరాల మద్య ఉండాలి. ప్రొహిబిషన్ & ఎక్సైజ్ SI పోస్టుకు 21– 30 సం.ల మధ్య ఉండాలి. అలాగే రిజర్వేషన్ ప్రకారం సడలింపు ఉంటుంది.
టీస్‌పీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్‌లో 18 రకాల పోస్టులకు గాను జోనల్, మల్టీ జోనల్, స్టేట్ లెవల్ పోస్టులు కలవు.