TGPSC Group 1 Mains : 21 నుంచి 27 వరకు గ్రూప్‌–1 మెయిన్‌ ఎగ్జామినేషన్స్‌.. పరీక్ష రోజు అనుసరించే వ్యూహమే విజయానికి కీలకం!

టీజీపీఎస్‌సీ గ్రూప్‌–1.. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, ఆర్‌టీఓ, సీటీఓ.. తదితర రాష్ట్ర స్థాయి సివిల్‌ సర్వీస్‌ అధికారుల ఎంపికకు నిర్వహిస్తున్న పరీక్ష! ఇందులో భాగంగా ఎంపిక ప్రక్రియలో..

రెండో దశగా పేర్కొనే మెయిన్‌ పరీక్షలను టీజీపీఎస్‌సీ ఈ నెల (అక్టోబర్‌) 21 నుంచి 27వ తేదీ వరకూ నిర్వహించనుంది!! ఇప్పటికే ప్రిలిమ్స్‌లో సత్తా చాటి మెయిన్స్‌కు అర్హత పొందిన వారు.. మెయిన్స్‌లోనూ మెరిస్తేనే తమ కలల కొలువు సాకారం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో.. టీజీపీఎస్‌సీ గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలో రాణించేందుకు ఎగ్జామ్‌ డే టిప్స్‌..

↠    563: టీజీపీఎస్‌సీ గ్రూప్‌–1 పోస్ట్‌ల సంఖ్య!
↠    31,382: గ్రూప్‌–1 ఎంపిక ప్రక్రియలో కీలకమైన మెయిన్స్‌కు అర్హత సాధించిన వారి సంఖ్య!! అంటే.. ఒక్కో పోస్ట్‌కు 55 నుంచి 56 మంది పోటీ పడుతున్న పరిస్థితి. ప్రిలిమ్స్‌లో మూడు లక్షలకు పైగా పోటీని తట్టుకుని ఈ దశకు చేరుకున్న అభ్యర్థులు .. మెయిన్స్‌లో విజయం సాధించాలంటే.. పరీక్ష రోజు అందుబాటులో ఉన్న సమయంలో స్పష్టతతో వ్యవహరించడం చాలా అవసరం. 
ఎలాంటి ఒత్తిడి లేకుండా
గ్రూప్‌–1 మెయిన్స్‌ అభ్యర్థులు ముఖ్యంగా ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పరీక్ష కేంద్రంలో అడుగుపెట్టాలి. పోటీలో నెగ్గుతామా? నెగ్గమా? అనే ప్రతికూల ఆలోచనలను వీడాలి. ప్రశాంతమైన పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. ఎన్ని సంవత్సరాలు కష్ట పడినా.. ఎన్ని పుస్తకాలు చదివినా.. పరీక్ష రోజున మూడు గంటల వ్యవధిలో చూపే సమర్థత విజయాన్ని నిర్దేశిస్తుందని గుర్తించాలి.
Follow our YouTube Channel (Click Here)
పరీక్ష రోజు.. మీదయ్యేలా
పరీక్ష సమయంలో సమాధానాలిచ్చే క్రమంలో.. ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలనే తొందరపాటు పనికిరాదు. ప్రశ్నం పత్రం ఇవ్వగానే సమాధానాలు రాయడానికి ఉపక్రమించడం సరికాదు. ముందుగా సమగ్రంగా పూర్తిగా ప్రశ్న పత్రాన్ని చదివేందుకు కొంత సమయం కేటాయించాలి. కనీసం పది నిమిషాలపాటు ప్రశ్న పత్రం ఆసాంతం పరిశీలించాలి. ఫలితంగా ప్రశ్న పత్రం క్టిష్లత స్థాయిపై ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది. 
తొలుత సులభమైన ప్రశ్నలు
ప్రశ్న పత్రం పరిశీలించిన తర్వాత సులభంగా భావించిన ప్రశ్నలకు ముందుగా సమాధానాలు ఇవ్వాలి. ఆ తర్వాత.. ఓ మోస్తరు క్లిష్టత ప్రశ్నలకు సమాధానం రాయాలి. చివరగా తమకు అత్యంత క్లిష్టంగా భావించిన ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. అలాకాకుండా ముందు తమకు అవగాహన లేని ప్రశ్నలకు సమాధానాలిచ్చేందుకు ఉపక్రమిస్తే.. సమ­యం వృధా కావడమే కాకుండా సమాధానాలు స్ఫురించక.. మానసికంగా ఒత్తిడికి గురయ్యే ఆస్కారముంది. పర్యవసానంగా తమకు తెలిసిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని గుర్తించాలి.
ప్రశ్నకు తగ్గ సమాధానం
గ్రూప్‌–1 మెయిన్స్‌లో ప్రశ్నలు పూర్తిగా వ్యాసరూప విధానంలో ఉంటాయని తెలిసిందే. జనరల్‌ ఇంగ్లిష్‌ సహా మొత్తం ఏడు పేపర్లులో పరీక్ష ఉంటుంది. 
ఒక్కో పేపర్‌కు లభించే సమయం మూడు గంటలు. అభ్యర్థులు సమాధానాలు ఇచ్చేటప్పుడు ప్రశ్న అడిగిన తీరు.. ఎగ్జామినర్‌ ఏం ఆశిస్తున్నారో గమనించాలి. ప్రశ్నకు తగ్గ సమాధానం రాయాలి. ఎంత వరకు అవసరమో అంత వరకే రాయాలి. తెలిసినందంతా రాసేయాలనే ఆలోచన వీడాలి. దానివల్ల ఇతర ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి సమయం సరిపోదు. మూడు గంటల్లో 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్లు వ్యూహం సిద్ధం చేసుకోవాలి.
Follow our Instagram Page (Click Here)
సూటిగా.. స్పష్టంగా
ప్రతి ప్రశ్నకు సగటున పది నుంచి పన్నెండు నిమిషాలు మాత్రమే లభిస్తాయని గుర్తుంచుకోవాలి. దానికి అనుగుణంగా ముందే మనసులో సమాధానం సిద్ధం చేసుకొని రాయడం ప్రారంభించాలి. అడిగిన ప్రశ్నకు అనుగుణంగా సూటిగా, స్పష్టంగా సమాధానం రాసే ప్రయత్నం చేయాలి. కొట్టివేతలు లేకుండా, చేతి రాత అర్థమయ్యేలా చూసుకోవాలి. కొన్ని ప్రశ్నలకు వ్యాసరూపం కంటే పాయింట్ల వారీగా సమాధానాలివ్వడం మేలు చే­స్తుంది. పది నిమిషాల ముందుగానే సమాధానాలు పూర్తి చేసి.. వాటిని ఒకసారి సమీక్షించుకోవాలి.
రివిజన్‌ ప్రధానంగా
ప్రస్తుతం సమయంలో రివిజన్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పటి వరకు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి సొంతంగా రూపొందించుకున్న షార్ట్‌ నోట్స్, ఆయా అంశాల సినాప్సిస్‌లపై ఎక్కువ దృష్టి సారించాలి. ఒక అంశానికి సంబంధించి సినాప్సిస్‌ను చదివితే దానికి సంబంధించిన పూర్తి సమాచారం మదిలో మెదిలే విధంగా ఉండాలి. మెయిన్స్‌కు ప్రిపరేషన్‌ సాగించే అభ్యర్థులు సొంత నోట్స్‌ సిద్ధం చేసుకుంటారు. అలా చేయని అభ్యర్థులు.. ప్రస్తుత సమయంలో తాము చదివిన మెటీరియల్‌లోని ముఖ్యాంశాలను, సబ్‌ హెడ్డింగ్స్‌ను చూసుకోవడం ద్వారా రివిజన్‌ పూర్తి చేసుకోవచ్చు. 
జనరల్‌ ఇంగ్లిష్‌పైనా దృష్టి
అభ్యర్థులు అర్హత పరీక్షగా పేర్కొన్న జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్‌పైనా కొంత దృష్టిపెట్టాలి. చాలా మంది అభ్యర్థులు మిగతా పేపర్లపై ఎక్కువ సమయం కేటాయిస్తూ..జనరల్‌ ఇంగ్లిష్‌ను నిర్లక్ష్యం చేస్తారు. కానీ జనరల్‌ ఇంగ్లిష్‌లో కనీస అర్హత మార్కులు సాధిస్తేనే తుది దశకు అవకాశం లభిస్తుందని గుర్తించాలి. ఈ పేపర్‌లో ఓసీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు, బీసీ అభ్యర్థులకు 35 శాతం మార్కులు, ఎస్‌సీ/ఎస్టీ/పీడబ్లు్యడీ అభ్యర్థులకు 30 శాతం మార్కులను కనీస అర్హత మార్కులుగా సర్వీ­స్‌ కమిషన్‌ నిర్ణయించింది. కాబట్టి అభ్యర్థులు పదో తరగతి గ్రామర్‌పై పట్టు సాధించడం అవసరం.
పరీక్షకు ముందు రోజు
పరీక్షకు ఒకరోజు ముందు అభ్యర్థులు సబ్జెక్ట్‌ ప్రిపరేషన్‌ కంటే మరుసటి రోజు ప్రారంభమయ్యే పరీక్షకు హాజరయ్యేందుకు అవసరమైన వాటిని సిద్ధం చేసుకోవాలి. పోటీ నేపథ్యంలో చివరి నిమి షం వరకు చదవాలనే తపన ఉండటం సహజం. కాని అతిగా చదవడం వల్ల మెదడు అలసిపోయే ప్రమా­దం ఉంది.కాబట్టి విశ్రాంతి తీసుకుంటూ చదవాలి.
Join our WhatsApp Channel (Click Here)
ఆరోగ్యం జాగ్రత్తగా
మెయిన్‌ పరీక్షల కోసం రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు చదివే అభ్యర్థులు కనిపిస్తుంటారు. అలాంటి వారు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఆరోగ్య నియమాలు. పరీక్ష ముందు రోజు కూడా అర్థరాత్రి వరకూ చదవుతూ ఉంటే అది మరుసటి రోజు పరీక్ష హాల్లో ప్రదర్శన తీరుపై ప్రతికూల ప్రభావం చూపే ఆస్కారముంది. కాబట్టి మెదడుకు, మనసుకు విశ్రాంతి లభించేలా కనీసం 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. దీంతోపాటు పరీక్షలు ముగిసే వరకు తేలికైన పౌష్టికాహారం తీసుకోవడం మేలు.
ఓఎంఆర్‌ షీట్‌.. అప్రమత్తంగా
మెయిన్‌ పరీక్ష ప్రారంభం కావడానికి ముందే ఓఎంఆర్‌ షీట్‌ను ఎలాంటి పొరపాట్లు లేకుండా నింపడం చాలా ముఖ్యమని గుర్తించాలి. ఇటీవల కాలంలో కొంతమంది అభ్యర్థులు పరీక్ష ఒత్తిడి, పరీక్ష హాలుకు ఆలస్యంగా చేరుకున్న సందర్భాల్లో ఓఎంఆర్‌ షీట్‌ను పూర్తి చేయడంలో పొరపాట్లు చేసి అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు. కాబట్టి ముందుగా అభ్యర్థులు తమకిచ్చిన కొశ్చన్‌ బుక్‌లెట్‌ మొదటి పేజీలో పేర్కొన్న నిబంధనలను చదవాలి. దానికి అనుగుణంగా ఓఎంఆర్‌ షీట్‌లో వివరాలు నింపాలి. సమాధాన పత్రంలో నిర్దేశిత ప్రదేశంలో సంతకం పెట్టడం మరవకూడదు. సమాధానాలన్నీ సరిగా ఉన్నప్పటికీ.. ఓఎంఆర్‌ షీట్‌ను నింపే విషయంలో పొరపాటు చేస్తే అనర్హులుగా మిగిలే ప్రమాదం ఉంది.
హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌
మెయిన్‌ పరీక్షల అభ్యర్థులు వీలైనంత త్వరగా హాల్‌టిటెక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇప్పటికే హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 20వ తేదీ వరకు హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం ఉంది. సమయం ఉంది కదా.. అని చివరి రోజు వరకు వేచి చూడకుండా.. హాల్‌ టికెట్‌ను వీలైనంత త్వరగా డౌన్‌లోడ్‌ చేసుకోవడం మేలు. దీనివల్ల హాల్‌టికెట్‌లో ఏమై­నా పొరపాట్లు ఉంటే గుర్తించే వీలుంటుంది. సదరు పొరపాట్లను పరీక్ష కేంద్రంలోని అధీకృత అధికారుల దృష్టికి తీసుకెళ్లి నామినల్‌ రోల్‌లో తగిన మార్పులు చేయించుకునే అవకాశం ఉంటుంది.
Join our Telegram Channel (Click Here)
ఎగ్జామ్‌ టైమ్‌ టేబుల్‌
    అక్టోబర్‌ 21: జనరల్‌ ఇంగ్లిష్‌
    అక్టోబర్‌ 22: పేపర్‌–1 (జనరల్‌ ఎస్సే)
    అక్టోబర్‌ 23: పేపర్‌–2(హిస్టరీ,కల్చర్,జాగ్రఫీ)
    అక్టోబర్‌ 24: పేపర్‌ –3 (ఇండియన్‌ సొసైటీ, కాన్‌స్టిట్యూషన్, గవర్నెన్స్‌)
    అక్టోబర్‌ 25: పేపర్‌–4 (ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌)
    అక్టోబర్‌ 26: పేపర్‌–5 (సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌)
    అక్టోబర్‌ 27: పేపర్‌–6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం) 

#Tags