Living Planet Report: ఐదో వంతు జీవ జాతులు.. అంతరించే ముప్పు

ప్రపంచవ్యాప్తంగా పలు కారణాలతో ఏటా వలస బాట పట్టే అసంఖ్యాక జీవ జాతులపై తొలిసారిగా సమగ్ర అధ్యయనానికి ఐక్యరాజ్యసమితి తెరతీసింది.

ఇందులో భాగంగా 1997 ఐరాస ఒప్పందం ప్రకారం రక్షిత జాబితాలో చేర్చిన 1,189 జీవ జాతులను లోతుగా పరిశీలించారు. 
పరిశోధనలో తేలిన అంశాలను 5,000 పై చిలుకు జీవ జాతుల తీరుతెన్నులను 50 ఏళ్లుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ ద కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌), లివింగ్‌ ప్లానెట్‌ ఇండెక్స్‌ సంస్థల గణాంకాల సాయంతో విశ్లేషించారు. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 22 శాతం జీవ జాతులు అతి త్వరలో పూర్తిగా అంతరించనున్నట్టు తేలింది.

మొత్తమ్మీద 44 శాతం జీవ జాతుల సంఖ్య నిలకడగా తగ్గుముఖం పడుతూ వస్తున్నట్టు వెల్లడైంది. ఈ వివరాలతో కూడిన తాజా నివేదికను ఐరాస ఇటీవలే విడుదల చేసింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఐదో వంతు వలస జీవజాతులు అంతరించే ప్రమాదంలో పడ్డాయి. జీవజాతుల వలసలు కొత్తగా మొదలైనవి కావు. అనాదిగా భూమ్మీదా, సముద్రంలోనూ అత్యంత కఠినతరమైన, భిన్న వాతావరణ పరిస్థితుల గుండా ఏటా వందల కోట్ల సంఖ్యలో సాగుతుంటాయి.

ఇన్నేళ్లలో ఏనాడూ లేని ముప్పు ఇప్పుడే వచ్చి పడటానికి ప్రధాన కారణం మానవ జోక్యం, తత్ఫలితంగా జరుగుతున్న వాతావరణ మార్పులు, సాగుతున్న పర్యావరణ విధ్వంసమే’ అని తేల్చింది. ఇప్పటికైనా కళ్లు తెరిచి నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ఐరాస వలస జాతుల సంరక్షణ సదస్సు కార్యదర్శి అమీ ఫ్రాంకెల్‌ అన్నారు. గత వారం ఉబ్జెకిస్తాన్‌లోని సమర్ఖండ్‌లో జరిగిన సదస్సు భేటీలో ఈ అంశాన్నే ఆయన నొక్కిచెప్పారు. ‘ప్రపంచవ్యాప్తంగా 30 శాతం భూ, సముద్ర భాగాల సమగ్ర పరిరక్షణకు కృషి చేస్తామంటూ 2022 గ్లోబల్‌ బయో డైవర్సిటీ సమిట్‌లో పాల్గొన్న దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. దాన్ని నెరవేర్చాల్సిన సమయం వచ్చింది’ అన్నారు.

Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధానికి రెండేళ్లు..!

ప్రమాదపుటంచుల్లో..
1979 ఐరాస రక్షిత జాబితాలోని 1,189 జీవ జాతులను నివేదిక లోతుగా పరిశీలించింది. అనంతరం ఏం చెప్పిందంటే...
► ప్రపంచవ్యాప్తంగా 44 శాతం వలస జీవ జాతుల సంఖ్య నానాటికీ భారీగా తగ్గుముఖం పడుతోంది.
► 22 శాతం అతి త్వరలో అంతరించేలా ఉన్నాయి. మొత్తమ్మీద ఐదో వంతు అంతరించే ముప్పు జాబితాలో ఉన్నాయి.
► ఇది జీవవైవిధ్యానికి తీవ్ర విఘాతం. మన జీవనాధారాలపైనా, మొత్తంగా ఆహార భద్రతపైనా పెను ప్రభావం చూపగల పరిణామం.

► ఆవాస ప్రాంతాలు శరవేగంగా అంతరిస్తుండటం మూడొంతుల జీవుల మనుగడకు మరణశాసనం రాస్తోంది.
► జంతువులు, చేపల వంటివాటిని విచ్చలవిడిగా వేటాడటం కూడా ఆయా జాతుల మనుగడను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
► కార్చిచ్చులు, గ్లోబల్‌ వార్మింగ్‌ వంటివి ఇందుకు తోడవుతున్నాయి.
► భారీ డ్యాములు, గాలి మరలకు తోడు ఆకస్మిక వరదలు, అకాల క్షామాలు తదితరాల వల్ల వలస దారులు మూసుకుపోవడం, మారిపోవడం జరుగుతోంది. ఇది పలు జీవ జాతులను అయోమయపరుస్తోంది.

ఏం చేయాలి..?
తక్షణం వలస జీవ జాతుల సంరక్షణ చర్యలకు పూనుకోవాల్సిన ఆవశ్యకతను నివేదిక నొక్కిచెప్పింది. అందుకు పలు సిఫార్సులు చేసింది..
► జీవావరణాల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి.
► భారీ డ్యాములు తదితరాల పర్యావరణ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తగు నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి.
► ఈ అన్ని సమస్యలకూ తల్లి వేరు పర్యావరణ విధ్వంసం. కార్చిచ్చులకైనా, అకాల వరదలు, క్షామాలకైనా, గ్లోబల్‌ వార్మింగ్‌కైనా అదే ప్రధాన కారణం. కనుక దానికి వీలైనంత త్వరలో చెక్‌ పెట్టేందుకు దేశాలన్నీ కృషి చేయాలి.

ఆహారం, పునరుత్పాదన వంటి అవసరాల నిమిత్తం వేలాది జీవ జాతులు వలస బాట పట్టడం ప్రపంచవ్యాప్తంగా అనాదిగా జరుగుతూ వస్తున్న ప్రక్రియ. పలు జంతు, పక్షి జాతులైతే కోట్ల సంఖ్యలో వలస వెళ్తుంటాయి. ఈ క్రమంలో కొన్ని పక్షి జాతులు ఏటా 10 వేల కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటాయి! పర్యావరణ సంతులన పరిరక్షణకు కూడా ఎంతగానో దోహదపడే ప్రక్రియ ఇది. కానీ గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల ప్రభావం జంతువులు, పక్షుల వలసపై కూడా విపరీతంగా పడుతోంది. ఈ ప్రమాదకర పరిణామంపై ఐరాస తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. దీనికి తక్షణం అడ్డుకట్ట వేయకపోతే కనీసం ఐదో వంతు వలస జీవులు అతి త్వరలో అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందని తాజా నివేదికలో హెచ్చరించింది.

World Most Powerful Passports List: పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల.. భారత్ ఎన్నో స‍్థానంలో ఉందంటే!!

#Tags