Skip to main content

Keir Starmer: నిరుపేద కుటుంబంలో పుట్టిన బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌.. ఆయ‌న జీవిత చ‌రిత్ర ఇదే..!

నిరుపేద కుటుంబం. తండ్రి పనిముట్ల తయారీ కార్మికుడు. తల్లి నర్సు.
Britain new Prime Minister Keir Starmer Biography    Keir Hardy success story

నలుగురు సంతానంలో రెండోవాడు. కుటుంబాన్ని నిరంతరం అప్పుల బాధ వెంటాడేది. దాంతో ఫోన్‌ బిల్లును తప్పించుకునేందుకు దాన్ని నెలల తరబడి వాడకుండా పక్కన పెట్టే పరిస్థితి! 

‘కార్మికునిగా ఫ్యాక్టరీలో తన తండ్రి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. దాంతో విపరీతమైన ఆత్మన్యూనతకు లోనై జనానికి దూరంగా మెలగడం అలవాటు చేసుకున్నారు’ అంటూ ఆవేదనగా గుర్తు చేసుకుంటారు స్టార్మర్‌. అందుకే స్థాయిలో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడటం తనకు చిన్నప్పటి నుంచే అలవాటైందని చెబుతారు. 

లేబర్‌ పార్టీ తొలి నాయకుడైన కియర్‌ హార్డీ అంటే తల్లిదండ్రులకు ఎంతో అభిమానం. ఆ పేరునే స్టార్మర్‌కు పెట్టుకున్నారు. ఆయన ఇప్పుడదే పార్టీకి ఘనవిజయం సాధించి పెట్టడమే గాక ప్రధాని పీఠమెక్కడం విశేషం. విపక్షంలో ఉండగా లేబర్‌ పార్టీ పగ్గాలు చేపట్టి గెలుపు బాటన నడిపిన ఐదో నేతగా కూడా నిలిచారు. 

తమ కుటుంబంలో కాలేజీ చదువు చదివిన తొలి వ్యక్తి స్టార్మరే. అప్పుడు కూడా డబ్బుల కటకట బాగా వేధించేది. దాంతో డబ్బుల కోసం స్టార్మర్‌ ఓసారి బీచ్‌లో మిత్రులతో కలిసి చట్ట విరుద్ధంగా ఐస్‌క్రీం అమ్ముతూ పట్టుబడ్డారు! లీడ్స్‌లో న్యాయశాస్త్రం చదివాక ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లారు. 1987లో బారిస్టర్‌ పూర్తి చేశారు. మానవ హక్కుల చట్టంలో స్పెషలైజేషన్‌ చేశారు. కరీబియన్, ఆఫ్రికాల్లో ఉద్యోగం చేశారు. పని రాక్షసునిగా పేరుపడ్డారు. 2008లో ఇంగ్లండ్, వేల్స్‌ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. 

UK Election Results: యూకే ఎన్నికల్లో ఘన విజయం సాధించిన లేబర్ పార్టీ.. 

రాజకీయ ప్రవేశం.. 
స్కూలు దశ నుంచే స్టార్మర్‌ రాజకీయాల పట్ల మొగ్గు చూపేవారు. తొలుత వామపక్ష రాజకీయ పట్ల ఆకర్షితులయ్యారు. 2015లో 52వ ఏట పూర్తిస్థాయిలో రాజకీయ రంగప్రవేశం చేశారు. ఉత్తర లండన్‌లోని హాల్‌బోర్న్‌ అండ్‌ సెయింట్‌ పాంక్రాస్‌ నియోజకవర్గం నుంచి 2015లో ఎంపీగా గెలుపొందారు. తాజా మాజీ ప్రధాని రిషి సునాక్‌ కూడా సరిగ్గా అదే రోజున తొలిసారిగా ఎంపీగా ఎన్నికవడం విశేషం! నాటి లేబర్‌ పార్టీ నాయకుడు జెరెమీ కార్బిన్‌కు నమ్మకస్తునిగా పేరుబడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘోర పరాజయంతో కార్బిన్‌ తప్పుకున్నారు. 

దాంతో 2020 ఏప్రిల్‌లో స్టార్మర్‌ లేబర్‌ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. పార్టీలో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. విలువల విషయంలో రాజీ పడేందుకు ససేమిరా అంటారాయన. తమ కంచుకోటైన హార్టిల్‌పూల్‌ స్థానంలో మూడేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికలో లేబర్‌ పార్టీ తొలిసారి ఓటమి చవిచూసింది. ఆ పరాభవానికి బాధ్యత వహిస్తూ పార్టీ సారథ్యం నుంచి తప్పుకోవడానికి స్టార్మర్‌ సిద్ధపడ్డారు. సీనియర్‌ నాయకుల విజ్ఞప్తి మేరకు కొనసాగారు. 2019 ఓటమితో చతికిలపడి ఉన్న పార్టీలో జవజీవాలు నింపడమే గాక ఐదేళ్లకే ఘనవిజయం సాధించి పెట్టారు. ఇది తేలిగ్గా ఏమీ జరగలేదు. 

పార్టీకి పునర్వైభవం.. 
లేబర్‌ పార్టీకి పునర్వైభవం తేవడానికి స్టార్మర్‌ చాలా కష్టపడ్డారు. హార్టిల్‌పూల్‌ ఉప ఎన్నిక ఓటమి తర్వాత ఓటర్లను పార్టీ వైపు తిప్పుకోవడంపై దృష్టి సారించారు. వర్సిటీల ట్యూషన్‌ ఫీజుల రద్దు, ఇంధన, నీటి కంపెనీల జాతీయీకరణ వంటి గత వాగ్దానాల నుంచి వెనక్కు తగ్గారు. ఇది నమ్మకద్రోహమని, పార్టీ వాగ్దానాలను తుంగలో తొక్కారని సీనియర్లే ఆరోపించినా వెనక్కు తగ్గలేదు. కొన్నేళ్లుగా బ్రిటన్‌లో ఉద్యోగ సంక్షోభం నెలకొంది. ధరలు విపరీతంగా పెరిగి, ప్రజల ఆదాయం తగ్గి జీవన ప్రమాణాలు పడిపోయాయి. వీటితో పాటు ప్రధాన సమస్యయిన ఆరోగ్య రంగంపైనా స్టార్మర్‌ దృష్టి సారించారు. 

UK Election Result: బ్రిటన్‌ ఎన్నికల్లో.. రికార్డు స్థాయిలో ఇండియన్ల గెలుపు!

బ్రిటన్‌లో వైద్య సేవలుందించే ప్రభుత్వ విభాగం ఎన్‌హెచ్‌ఎస్‌లో వెయిటింగ్‌ జాబితాను తగ్గిస్తామని, పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేస్తామని, పన్ను చెల్లింపుల్లో లొసుగులను నిర్మూలించి ఎన్‌హెచ్‌ఎస్‌కు నిధులు సమకూర్చుతామని హామీలిచ్చారు. అక్రమ వలసలను అడ్డుకునేందుకు సరిహద్దు భద్రత కమాండ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా సొంతిల్లు లేనివారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చట్టాలను సంస్కరించి 15 లక్షల కొత్త ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. ప్రైవేట్‌ స్కూళ్లకు పన్ను మినహాయింపులు ఎత్తేసి ఆ సొమ్ముతో 6,500 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇవన్నీ జనాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. 

వేణుగానంలో నిపుణుడు 
స్టార్మర్‌కు సంగీతంలో లోతైన ప్రవేశముంది. చాలాకాలం పాటు శాస్త్రీయ శిక్షణ తీసుకున్నారు. ఫ్లూట్, పియానో, వయోలిన్‌ అద్భుతంగా వాయిస్తారు. కాలేజీ రోజుల్లో ఆయన వేణుగానాన్ని అలా వింటూ ఉండిపోయేవాళ్లమని నాటి మిత్రులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. కాలేజీ రోజుల్లో స్టార్మర్‌ ఎంతో చురుకైన ఫుట్‌బాల్‌ ఆటగాడు కూడా. 2007లో విక్టోరియా అలెగ్జాండర్‌ను పెళ్లాడారు. ఆమె నేషనల్‌ హెల్త్ సర్వీస్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌)లో ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌. వారికి ఒక కొడుకు, కూతురున్నారు.

Published date : 06 Jul 2024 01:32PM

Photo Stories