Nuclear Weapons: వినాశనపు ఒడ్డున ప్రపంచం.. ఆకలి కంటే అణ్వాయుధాలే మిన్నా?
ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు, ఆధునికీకరించుకునేందుకు ఈ దేశాలు (భారత్ సహా) గత ఏడాది ఏకంగా 9,100 కోట్ల డాలర్లు ఖర్చు పెట్టాయి. రష్యా, అమెరికా వద్ద ఉన్నన్ని ఖండాంతర క్షిపణులను సిద్ధం చేసేందుకు చైనా ప్రయత్నిస్తోందని కూడా ఈ నివేదిక తెలియజేస్తోంది. ఇది దక్షిణాసియాకు క్షేమకరం కాకపోగా, పరోక్షంగా భారత్‌కు కూడా ముప్పే. శక్తిమంతమైన దేశాల మధ్య వ్యూహాత్మక అంశాల విషయంలో సమాచార వినిమయం జరగకపోవడం ఈ పరిస్థితికి కారణం. కనుచూపు మేరలో ఇది మెరుగుపడే సూచనలూ లేకపోవడం ఆందోళనకరం.
ప్రపంచ వినాశనానికి హేతువు కాగల అణ్వస్త్రాలు మరోసారి పడగ విప్పుతున్నాయి. గత నెల పదిహేడున విడుదలైన రెండు అంతర్జాతీయ స్థాయి నివేదికలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ భద్రతను సవాలు చేస్తున్నాయి. మొదటి రిపోర్టును ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్(ఐసీఏఎన్ ) విడుదల చేయగా.. రెండోదాన్ని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్(ఎస్‌ఐపీఆర్‌ఐ–సిప్రి) విడుదల చేసింది. రెండింటిలోని సమాచారం మానవాళిని హెచ్చరించేది మాత్రమే కాదు.. భయపెట్టేది కూడా.
ఆకలి కంటే అణ్వాయుధాలే మిన్నా?
ఐసీఏఎన్ రిపోర్టు ప్రకారం, ప్రపంచం మొత్తమ్మీద అణ్వాయుధ సామర్థ్యమున్న తొమ్మిది దేశాలు (అమెరికా, యూకే, రష్యా, చైనా, ప్రాన్స్, ఇండియా, ఇజ్రాయెల్, పాకిస్తాన్ , ఉత్తర కొరియా) తమ ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు, ఆధునికీకరించుకునేందుకు గత ఏడాది ఎకాఎకి 9,100 కోట్ల డాలర్లు ఖర్చు పెట్టాయి. అన్ని దేశాల సమర్థింపు ఒక్కటే... ‘ఇతరుల’ నుంచి ముప్పు ఉందని! 2023లో అందరూ ఊహించినట్టుగానే అమెరికా అత్యధికంగా 5,150 కోట్ల డాలర్లు అణ్వాయుధాలపై ఖర్చు చేయగా... చైనా (1,180 కోట్ల డాలర్లు), రష్యా (830 కోట్ల డాలర్లు) ఖర్చు చేసినట్లు ఐసీఏఎన్ నివేదిక తెలిపింది.
‘గత ఏడాది ఈ తొమ్మిది దేశాలు కలిసికట్టుగా ప్రతి సెకనుకు సుమారు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టాయి’ అని ఐసీఏఎన్ డైరెక్టర్ మెలిస్సా పార్క్ తెలిపారు. ఈ మొత్తం ప్రపంచం మొత్తమ్మీద ఆకలిని అంతం చేసేందుకు అవసరమయ్యే నిధులకంటే చాలా ఎక్కువని ఆమె వివరించారు. ఇంత మొత్తాన్ని మొక్కలు నాటేందుకు ఉపయోగించి ఉంటే ఒక్కో నిమిషానికి కనీసం పది లక్షల మొక్కలు నాటి ఉండవచ్చు అని మెలిస్సా అన్నారు.
New Criminal Laws: భారత న్యాయశాస్త్ర చరిత్రలో మొదలైన కొత్త అధ్యాయం.. అంతా సిద్ధమేనా..?
వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా భూమ్మీద మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతున్న ఈ తరుణంలో ఇంత పెద్ద ఎత్తున మొక్కలు నాటే అంశాన్ని ఎత్తడం ఎంతైనా మంచి విషయమే కదా? ఈ ఏడాది వేసవి ఎంత మంట పుట్టించిందో, వడగాడ్పులకు ఎంతమంది మరణించారో మనకు తెలియంది కాదు. మనుషుల నిష్పత్తితో పోల్చినప్పుడు ఉండాల్సినన్ని వృక్షాలు లేకపోవడం వల్ల చాలా దేశాలు అనేక వాతావరణ సంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ అంశంలో పెద్ద దేశాల్లోకీ ఇండియా అత్యంత ఎక్కువగా ప్రభావితం అవుతోంది.
సిప్రి ఇయర్‌బుక్–2024 అంతర్జాతీయంగా భద్రత విషయంలో వస్తున్న మార్పులేమిటి? ఆయుధాలు, టెక్నాలజీ రంగాల్లోని ముఖ్య పరిణామాలు ఏమిటి? అనేది సమగ్రంగా వివరిస్తుంది. దేశాల మిలిటరీ పెడుతున్న ఖర్చులు, ఆయుధాల ఉత్పత్తి, వ్యాపారాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఘర్షణలను కూడా ఈ ఇయర్ బుక్ వివరిస్తుంది. సంప్రదాయ ఆయుధాలతోపాటు అణ్వస్త్రాలు, జీవ, రసాయన ఆయుధాలపై కూడా ఇది దృష్టి పెడుతుంది. అణ్వాయుధాలకు సంబంధించి ఇందులో దాదాపు వంద పేజీల విలువైన సమాచారాన్ని పొందుపరిచారు.
పెరిగిన చైనా అణ్వాయుధాలు..
సిప్రి నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య మాత్రమే కాదు... అందులో రకాలు కూడా పెరిగాయి. మొత్తం తొమ్మిది దేశాలు అణ్వాయుధాల ద్వారా మాత్రమే తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవచ్చునని అనుకుంటున్నాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్నే తీసుకోండి. హద్దులు దాటొద్దని నాటోను హెచ్చరించేందుకు రష్యా అణ్వాయుధాలను వాడేందుకు వెనుకాడమని చెబితే... బదులుగా నాటో, అమెరికా కూడా అణ్వాస్త్రాలతో యుద్ధానికి సిద్ధమన్నట్టు కాలు దువ్వుతున్నాయి.
2024 జనవరి నాటికి తొమ్మిది అణ్వాయుధ దేశాల(ఎన్9) దగ్గర దాదాపు 12,121 అణ్వాస్త్రాలు ఉన్నాయని సిప్రి నివేదిక చెబుతోంది. ఇందులో 9,585.. వాడుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు... వీటిల్లో 3,904 అణ్వాస్త్రాలు ఇప్పటికే నిర్ణీత ప్రదేశాల్లో ఏర్పాటు చేశారనీ, 2,100 అణ్వస్త్రాలను ఆపరేషనల్ అలర్ట్‌తో ఉంచారనీ కూడా సిప్రి ఇయర్ బుక్ చెబుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఆపరేషనల్ అలర్ట్‌తో ఉన్న అణ్వాయుధాలు ఈ ఏడాది దాదాపు వంద ఎక్కువ కావడం గమనార్హం.
Asian Americans: అమెరికాలో పెరుగుతున్న ఆసియన్ల జనాభా!
ప్రపంచం మొత్తమ్మీద ఉన్న అణ్వాయుధాల్లో 88 శాతం అమెరికా, రష్యాల వద్దే ఉండటం గమనార్హం. అయితే చైనా అణ్వాయుధ సంపత్తి 2023 నాటి 410 నుంచి ఈ ఏడాది జనవరి నాటికి 500కు చేరడం ఆందోళన కలిగించే అంశమని సిప్రి నివేదిక తెలిపింది. చైనా తన అణ్వాయుధాలను ఆధునికీకరించుకుంటోందనీ, రానున్న దశాబ్ద కాలంలో ఉత్పత్తిని కూడా గణనీయంగా పెంచుకునే ప్రయత్నాల్లో ఉందనీ సిప్రి నివేదిక తెలియజేస్తోంది.
‘‘రష్యా, అమెరికాల వద్ద ఉన్నన్ని ఐసీబీఎం(ఖండాంతర క్షిపణు)లను సిద్ధం చేసేందుకు చైనా ప్రయత్నిస్తోంది’’ అని ఈ నివేదిక రచయితలు తెలిపారు. చైనా తననితాను అమెరికాకు ప్రత్యర్థిగా భావించవచ్చు కానీ... చైనా ఈ మధ్యకాలంలో అణ్వాయుధాలను సిద్ధం చేయడం ఎక్కువ కావడం దక్షిణాసియా ప్రాంత భద్రతకు ఏమంత మంచిది కాదు. ఇంకోలా చెప్పాలంటే భారతదేశానికి కూడా పరోక్ష ముప్పు పొంచి ఉందన్నమాట!
కనబడని కాంతి
ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో, 1945 –1991 మధ్యన అమెరికా, ఆ దేశాన్ని బలపరిచే యూకే, ప్రాన్స్‌లు ఒక పక్క.. ఒకప్పటి సోవియట్ రష్యా మరో పక్క అన్నట్టుగా అణ్వాయుధ పోటీ నడిచింది. 1962 నాటి క్యూబన్ మిస్సైల్ ఉదంతం తరువాత ఇరు పక్షాలు కూడా అణ్వస్త్ర నిరోధకతకు అనుకూలంగా కొంత తగ్గాయి. ఆయుధాల నియంత్రణ, మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ వంటి అంశాల ఆధారంగా ఈ సంయమనం సాధ్యమైంది.
2022లో ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసింది మొదలు ప్రపంచం అణ్వస్త్రాల విషయంలో రెండుగా విడిపోయింది. ఒకటేమో అమెరికా నేతృత్వంలోని మిలిటరీ భాగస్వాములుగా మారితే... రెండోదేమో రష్యా– చైనా, జూనియర్ పార్ట్‌నర్‌గా ఉత్తర కొరియా కూటమిగా నిలిచాయి. భారత్, పాకిస్తాన్ , ఇజ్రాయెల్ ఏ కూటమిలోనూ చేరలేదు. కాకపోతే వాటి భౌగోళిక స్థితిని బట్టి ఎవరు ఎటువైపు అన్నది స్పష్టమే.
ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని ఒకసారి ఆలోచిస్తే 2022 నాటి నుంచి ప్రపంచం మొత్తమ్మీద శక్తిమంతమైన దేశాల మధ్య వ్యూహాత్మక అంశాల విషయంలో సమాచార వినిమయం పెద్దగా జరగడం లేదని చెప్పాలి. అమెరికా దేశీయంగా ఎన్నో ఆర్థిక, సామాజిక సమస్యలను ఎదుర్కొంటోంది. డోనాల్డ్ ట్రంప్ మరోసారి పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
G7 Summit: ఈ దేశానికి రుణ ప్యాకేజీని ప్రకటించిన జీ7 దేశాల కూటమి!
ఇంకోపక్క ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని కొనసాగించాలనే నిశ్చయాభిప్రాయంతో రష్యా ఉంది. చైనా కూడా తన సరిహద్దుల విషయంలో దుందుడుకుగా వ్యవహరిస్తోంది. నిజంగానే ఇది ప్రపంచం ఎదుర్కొంటున్న ముప్పు అని చెప్పాలి. ఐసీఏఎన్ , సిప్రి నివేదికలు ఈ ముప్పునే సవివరంగా వివరిస్తున్నాయి. కనుచూపు మేరలో పరిస్థితి మెరుగుపడే సూచనలూ లేవని చెబుతూండటం కఠోర సత్యం.