IPE Global: డేంజర్ మార్కు దాటేస్తున్న భుగభుగలు!
ఢిల్లీలో ఏకంగా 40 రోజుల పాటు 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పై చిలుకు ఉష్ణోగ్రతలు నమోదై జనాలను బెంబేలెత్తించాయి. అలస్కాలో హిమానీ నదాలు ఇటీవలి కాలంలో వేసిన అంచనాలను కూడా మించి శరవేగంగా కరిగిపోతున్నట్టు తాజా అధ్యయనాలు తేల్చాయి. భూగోళానికి ఊపిరితిత్తులుగా చెప్పే అమెజాన్ సతత హరిత అరణ్యాలే క్రమంగా ఎండిపోతున్నాయి. ఎన్నడూ లేనంతగా కార్చిచ్చుల బారిన పడుతున్నాయి. సౌదీ అరేబియాలో ఏకంగా 50 డిగ్రీలు దాటేసిన ఎండలకు తాళలేక 1,300 మందికి పైగా మరణించారు.
ఈ ఉత్పాతాలన్నీ సూచిస్తున్నది ఒక్కటే. భూగోళం శరవేగంగా విపత్కర పరిస్థితుల్లోకి వెళ్తోంది. వాతావరణ మార్పుల ప్రభావం శాస్త్రవేత్తల అంచనాలకు కూడా అందనంత దారుణ ప్రభావం చూపుతోంది. భూతాపం ఈ శతాబ్దంలోనే ఏకంగా 2.5 డిగ్రీలకు పైగా పెరిగి మొత్తం మానవాళినే వినాశనం వైపు నెట్టడం ఖాయమని వందలాది మంది ప్రపంచ ప్రఖ్యాత వాతావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు ముక్త కంఠంతో హెచ్చరిస్తున్నారు!
పారిశ్రామికీకరణ ముందు స్థాయితో పోలిస్తే భూతాపం ఇప్పటికే 1.2 డిగ్రీ సెంటీగ్రేడ్ మేరకు పెరిగింది. అది 1.5 డిగ్రీలను దాటితే ఊహించని ఉత్పాతాలు తప్పవని సైంటిస్టులు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. అలాంటిది, ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ శతాబ్దాంతానికే భూతాపంలో పెరుగుదల 2.5 డిగ్రీల డేంజర్ మార్కును దాటేయడం ఖాయమని ప్రపంచ వాతావరణ సంస్థ నిర్వహించిన తాజా అంతర్జాతీయ సర్వే తేల్చింది.
సగటు ఉష్ణోగ్రతల రికార్డులు బద్దలు..
ఎండాకాలంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కనీవినీ ఎరగని విపరిణామాలు తదితరాలను పరిగణనలోకి తీసుకున్న మీదట ఈ అంచనాకు వచ్చింది. గత ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు ప్రతి నెలా రికార్డులు బద్దలు కొట్టాయి. ఈ ఏడాది సంభవించిన ఎల్‌నినో ఇప్పటిదాకా నమోదైన ఐదు అత్యంత శక్తిమంతమైన ఎల్ నినోల్లో ఒకటిగా నిలిచింది. శిలాజ ఇంధనాల వాడకం తదితరాల వల్ల జరుగుతున్న భారీ కాలుష్యం వంటివి వీటికి తోడవుతున్నాయి.
Are Extinct: భూమిని ఢీకొట్టే భారీ గ్రహశకలం.. అదే జరిగితే మానవజాతి అంతం!
గ్లోబల్ వార్మింగ్‌లో మూడొంతులు కేవలం కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) ఉద్గారం వల్లనే జరుగుతోంది. వాతావరణంలో సీఓటూ స్థాయి పెరుగుతున్న కొద్దీ వేడి గాలులు, హరికేన్లు, కార్చిచ్చులు, వరదలు వచ్చిపడుతున్నాయి. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల్లో చైనా, అమెరికా, భారత్ టాప్ 3లో ఉన్నాయి. అయితే గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధానంగా సంపన్న దేశాలే కారణమని ఐపీఈ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ హెడ్ అబినాశ్ మహంతీ చెప్పుకొచ్చారు.
ఆ దేశాల్లో గత రెండు శతాబ్దాలుగా జరిగిన మితిమీరిన పారిశ్రామికీరణ పర్యావరణానికి చెప్పలేనంత చేటు చేసిందని వివరించారు. ‘ఇప్పుడు కూడా సంప్రదాయేతర ఇంధనాల వాడక తదితరాల ద్వారా గ్లోబల్ వార్మింగ్‌కు అడ్డుకట్ట వేస్తామన్న పెద్ద దేశాల ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా భరించలేని ఎండలు, ఆ వెంటే వరదలు, హరికేన్ల వంటి ఉత్పాతాలు కొన్నేళ్లుగా సాధారణ పరిణామంగా మారిపోతున్నాయి. ఇవన్నీ ప్రమాద సూచికలే’ అని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొని గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు అడ్డుకట్ట వేయకపోతే పరిస్థితి చేయి దాటిపోయే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరిస్తున్నారు.
ఉత్తరాదిన పాతాళానికి భూగర్భ జలాలు..
ఉత్తర భారతదేశంలో భూగర్భ జల వనరులు శరవేగంగా అడుగంటుతున్నాయి! ఎంతగా అంటే, 2002 నుంచి 2021 మధ్య కేవలం 20 ఏళ్లలోనే కంగా 450 క్యుబిక్ కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు లుప్తమైపోయినట్టు ఐఐటీ గాందీనగర్ తాజా సర్వే తేల్చింది. దేశంలోకెల్లా అతి పెద్ద జలాశయమైన ఇందిరా సాగర్ మొత్తం నీటి పరిమాణానికి ఇది ఏకంగా 37 రెట్లు ఎక్కువని సర్వేకు సారథ్యం వహించిన ఐఐటీ గాందీనగర్ సివిల్ ఇంజనీరింగ్, ఎర్త్ సైన్సెస్ విభాగంలో విక్రం సారాబాయి చైర్ ప్రొఫెసర్ విమల్ మిశ్రా వివరించారు!
అందుబాటులో ఉన్న సంబంధిత గణాంకాలతో పాటు శాటిలైట్ డేటా తదితరాలను విశ్లేషించి ఈ మేరకు తేల్చినట్టు తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావం ఇలాగే కొనసాగితే ఈ ధోరణి మరింతగా ఊపందుకుంటుందని హెచ్చరించారు. ‘ఉత్తరాదిన గత 75 ఏళ్లలో వర్షపాతం ఇప్పటికే 8.5 శాతం తగ్గిపోయింది. వాతావరణం 0.5 డిగ్రీల మేరకు వేడెక్కింది. దాంతో సాగునీటికి డిమాండ్ అమాంతంగా పెరిగిపోయి విచ్చలవిడిగా బోర్లు పుట్టుకొచ్చాయి. దాంతో కనీసం భూగర్భ జల వనరులు 12 శాతం తగ్గిపోయాయి’ అని మిశ్రా వెల్లడించారు.
Carrington Event: పొంచి ఉన్న ‘కారింగ్టన్ ఈవెంట్’.. మానవాళికి పెను ముప్పు?
ఒక్క 2009లోనే వర్షాకాలంలో అల్ప వర్షపాతం, చలికాలంలో హెచ్చు ఉష్ణోగ్రతల దెబ్బకు ఉత్తరాదిన భూగర్భ జలాలు 10 శాతం మేర తగ్గిపోయాయని అంచనా! ‘గ్లోబల్ వార్మింగ్ మరింత పెరిగే సూచనలే ఉన్నందున భూగర్భ జలాలు ఇంకా వేగంగా ఎండిపోయేలా ఉన్నాయి. ఎలా చూసినా ఇవన్నీ ప్రమాద సంకేతాలే. ఉత్తర భారత దేశంలో ఉష్ణోగ్రతలు గనుక 1 నుంచి 3 డిగ్రీల మేరకు పెరిగితే భూగర్భ జలాలు మరో 10 శాతం దాకా తగ్గిపోతాయి’ అంటూ సర్వేలో పాల్గొన్న హైదరాబాద్ ఎన్‌జీఆర్‌ఐ పరిశోధకులు కూడా ఆందోళన వెలిబుచ్చారు. సర్వే ఫలితాలను జర్నల్ ఎర్త్ తదుపరి సంచికలో ప్రచురించనున్నారు.
Tags
- IPE Global
- Climate Change
- heat wave
- Temperatures
- Heatwaves
- Climate Change Service
- Carbon dioxide
- global warming
- Hot winds
- Sun
- greenhouse gas emissions
- Ground Water
- Sakshi Education Updates
- North India summer
- Temperature above 40 degrees Celsius
- Environmental concerns
- Glacier studies
- Rising temperatures
- sakshieducation latest news