D Sridhar Babu: ఐటీలో మేటిగా తెలంగాణ.. బెంగళూరును అధిగమించే దిశగా ప్రయత్నాలు.. ఈ స్థాయిలో ఏఐ!

సాక్షి, హైదరాబాద్‌ : కొత్తగా దూసుకువస్తున్న కృత్రిమ మేథస్సు (ఏఐ టెక్నాలజీ)తో పాటు ఇతర ఎమర్జింగ్‌ టెక్నాలజీల ఆధారంగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలుపుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. ఐటీ ఉత్పత్తులు, ఎగుమతుల్లో బెంగళూరు చాలా ముందంజలో ఉందని, ఇతర రాష్ట్రాలు కూడా ఎమర్జింగ్‌ టెక్నాలజీ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు పోటీ పడుతున్నాయని అన్నారు.

ఈ నేపథ్యంలో ఏఐ సాంకేతికత ద్వారా భారీ ముందడుగు వేసి ఐటీ రంగంలో బెంగళూరును అధిగమించే దిశగా ప్రయత్నాలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఏఐ టెక్నాలజీ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలు, వాణిజ్యం పెంచే దిశగా ప్రభుత్వం రోడ్‌ మ్యాప్‌ రూపొందిస్తోందని తెలిపారు.

ఏఐ టెక్నాలజీని ప్రోత్సహించే ప్రణాళికలో భాగంగా ఏఐ సిటీ నిర్మిస్తామని, రాష్ట్ర అభివృద్ధిని పదింతలు పెంచుతామని చెప్పారు.

గురు, శుక్రవారాల్లో రెండురోజుల పాటు హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ) వేదికగా ‘తెలంగాణ గ్లోబల్‌ ఏఐ సమ్మిట్‌’(అంతర్జాతీయ ఏఐ సదస్సు)ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్‌బాబు ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

చదవండి: Artificial Intelligence: ఆరోగ్య సంరక్షణలో.. క్విక్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ యాప్‌!

బహుముఖ లక్ష్యంతో.. 

ఐటీ రంగంలో కొత్తగా వస్తున్న ఏఐ టెక్నాలజీ ఫలితాలు, వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించడం సహా బహుముఖ లక్ష్యంతో నాస్కామ్‌ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఏఐ ద్వారా భవిష్యత్తులో ఐటీ రంగంలో కొత్తగా భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. అదే సమయంలో ఇది కోడింగ్, అల్గారిథమ్స్‌ ఆధారిత ఉద్యోగాలు చేస్తున్న ఐటీ నిపుణుల ఉద్యోగ భద్రతకు కూడా సవాలు విసరనుంది. 

ఈ నేపథ్యంలో ఏఐ నిపుణులను తయారు చేసేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడానికి అనుసరించాల్సిన విధానాలపై సదస్సులో చర్చిస్తాం.

వాణిజ్యం, వ్యాపార రంగాల్లో ఏఐ ఆధారిత అభివృద్ధి, ఉత్పాదకత పెంచడం తదితరాలపై సదస్సులో పాల్గొనే నిపుణులు సూచనలు చేస్తారు. 

చదవండి: Swecha: మన భాషలో స్వేచ్ఛగా.. తెలుగు ఏఐ చాట్‌బోట్‌ రూపకల్పనకు ప్రణాళికలు

ఏఐ టెక్నాలజీ రెండంచుల కత్తిలాంటిదనే ఆందోళన నేపథ్యంలో నైతిక మార్గంలో ఏఐ సాంకేతికత వినియోగం, ప్రభుత్వ నియంత్రణ తదితర అంశాలపై కూడా చర్చ జరుగుతుంది.

ఏఐ పాలసీ రూపకల్పన కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో సదస్సులో పాల్గొనే నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటాం. తెలంగాణను ‘ఏఐ క్యాపిటల్‌’గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ సదస్సు జరుగుతోంది. 

ఉత్పాదకత పెంపునకు ఏఐ వినియోగం 

వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగంలో ఉత్పాదకత పెంచడం లక్ష్యంగా ఏఐ వినియోగం పెంచాలని భావిస్తున్నాం. పరిశ్రమల ఆటోమేషన్, మెరుగైన నాణ్యత, యంత్రాల మెయింటినెన్స్, మార్కెటింగ్, మెరుగైన విద్యుత్‌ వినియోగం వంటి అంశాల్లో ఏఐ టెక్నాలజీ ఉపయోగించేలా ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం.

వ్యవసాయంలో ఎరువులు, నీళ్లు, తెగుళ్లు, పంట నూరి్పళ్లు సమర్ధవంతంగా జరిగేలా చూడటం, కూలీల కొరతను అధిగమించడం వంటి సవాళ్ల పరిష్కారంపై ఇప్పటికే పలు ఏఐ ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయి. 

వైద్య రంగంలో రోబోటిక్‌ సర్జరీలు, చికిత్సలు, రోగ నిర్ధారణ సమర్ధవంతంగా చేయడం సాధ్యమవుతోంది. విద్యారంగంలోనూ ఏఐ సాంకేతికతతో బహుళ లాభాలు ఉండబోతున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీలో ఏఐ ఆధారిత శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  

ఇంటర్‌ స్థాయిలో ఏఐ! 

సైబర్‌ సెక్యూరిటీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్, డేటా ఎనలిటిక్స్‌ వంటి ఎమర్జింగ్‌ టెక్నాలజీ ఆధారిత ఉత్పత్తులు, సేవలు అందుబాటులోకి తెచ్చేలా పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలు జరుగుతున్నాయి. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేస్తాం. 

విద్యార్థులకు జూనియర్‌ కాలేజీ స్థాయి నుంచి కరిక్యులమ్‌లో ఏఐ పాఠ్యాంశాలను చేర్చడంపై సదస్సులో చర్చిస్తాం. బెంగళూరు తరహాలో ఇక్కడి ఏఐ హబ్‌ నుంచి యూనికార్న్‌లు (బిలియన్‌ డాలర్ల వ్యాపారం చేసే సంస్థలు) పుట్టుకొచ్చే వాతావరణం కల్పిస్తాం. త్వరలో ఎస్‌ఎంఎస్‌ఈ, లైఫ్‌ సైన్సెస్‌ పాలసీలను కూడా ఆవిష్కరిస్తాం. 

#Tags