Swecha: మన భాషలో స్వేచ్ఛగా.. తెలుగు ఏఐ చాట్‌బోట్ రూపకల్పనకు ప్రణాళికలు
లక్ష మంది విద్యార్థుల కృషి
దేశంలోని అందరికీ సాఫ్ట్‌వేర్లు ఉచితంగా అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ‘స్వేచ్ఛ’సంస్థ ఏర్పాటైంది. ఆ సంస్థ దాదాపు లక్ష మంది విద్యార్థుల సాయంతో తెలుగు ఏఐ చాట్‌బోట్‌ను అభివృద్ధి చేస్తోంది. చాట్‌బోట్‌ను ట్రెయిన్ చేసేందుకు.. తెలుగు సంస్కృతి, ప్రాంతాలు, సంప్రదాయాలు, వ్యవసాయ పద్ధతుల గురించి తెలుగు మాట్లాడే వారి నుంచి విద్యార్థులు సమాచారాన్ని సేకరించారు.
ఈ సమాచారాన్ని చాట్‌బోట్‌కు ఫీడ్ చేసి, విశ్లేషించే ప్రక్రియను నిర్వహిస్తారు. దీనిని రెండు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సెప్టెంబర్‌లో జరగనున్న గ్లోబల్ ఏఐ సదస్సులో
ఈ ఏఐ చాట్‌బోట్‌ను ప్రదర్శించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఏ స్థానిక భాషలోనూ లేదు
దేశంలో ఇప్పటివరకు దాదాపు ఏ స్థానిక భాషలో కూడా చాట్‌బోట్ అందుబాటులో లేదు. తొలిసారిగా తెలుగులోనే చాట్‌బోట్‌ను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. అయితే చాలా అంశాలు స్థానిక భాషలో అందుబాటులో ఉండవు.
దీంతో ఏఐ ప్లాట్‌ఫారం కోసం సమాచారాన్ని సేకరించడం కష్టమైన పని. అందుకే స్వేచ్ఛ సంస్థ దాదాపు లక్ష మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. ప్రత్యేకమైన అప్లికేషన్ రూపొందించి, దాని ద్వారా సమాచారాన్ని సేకరించింది.
కొత్త పరిశోధనలకు ఊతం
విద్యార్థులకు సేకరించిన సమాచారాన్ని చాట్ బోట్‌కు ఫీడ్ చేస్తారు. దీనితో చాట్‌జీపీటీ మాదిరిగా ఏఐ ఆధారిత ప్రోగ్రామ్‌లు అందుబాటులోకి వస్తాయి.
తెలుగులో వాయిస్ కమాండ్స్ ఆధారంగా పనిచేసే పరికరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ దిశగా పరిశోధనకు ఊతం లభిస్తుంది.
7 వేల గ్రామాల్లో సమాచార సేకరణ
తెలుగు చాట్‌బోట్ రూపకల్పన కోసం దాదాపు ఏడు వేల గ్రామాల నుంచి సమాచారం సేకరించారు. ఆ గ్రామాల్లో వారు మాట్లాడుకునే మాటలను రికార్డు చేసి భద్రపరిచారు.
అక్కడి ఆహారం, ఆహార, వ్యవసాయ పద్ధతులు, చేతి వృత్తుల గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఈ డేటా అంతా ఒక్క చోటికి చేర్చి ఏఐ చాట్‌బోట్‌ను రూపొందించనున్నారు. ఈ మోడల్ రూపొందించేందుకు కేవలం రూ.10 లక్షలలోపే ఖర్చవుతోందని నిర్వాహకులు తెలిపారు.
ప్రాంతీయ భాషలో సమాచారంతో..
ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా ప్రాంతీయ భాషల్లో ఏఐ సాధనాలు అందుబాటులో లేవు. ప్రాంతీయ భాషలో సమాచారం అందుబాటులో లేకపోవడం, ఏఐ సాధనాల కోసం విస్తృత డేటా సేకరించాల్సి రావడమే దీనికి కారణం. అందుకే మేం ఇంజనీరింగ్ విద్యార్థుల ద్వారా ఇంటర్న్‌షిప్‌లో భాగంగా డేటా సేకరిస్తున్నాం. స్థానిక సంప్రదాయాలతోపాటు ఆటలు, పాటలు, వ్యవసాయ పద్ధతులు ఇతర అన్ని వివరాలను సేకరించే విషయంలో వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. ఇప్పటికే మూడొంతుల పని అయిపోయింది.
– ప్రవీణ్ చంద్రహాస్, ‘స్వేచ్ఛ’కార్యదర్శి