High Court: ప్రైవేట్‌ కాలేజీలో పెంచిన సీట్లు భర్తీ చేసుకోండి

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల పెంపుపై తమ ఉత్తర్వులను అమలు చేయాలని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హైకోర్టు మండిపడింది.

పెంచిన సీట్లకు మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలన్న ఆదేశాలపైనా నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించింది. ఈ పరిస్థితుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుంటే కాలేజీలు నష్టపోతాయని అభిప్రాయపడింది. ఏఐసీటీఈ, జేఎన్టీయూ అనుమతించిన సీట్ల భర్తీకి కాలేజీలకు స్వేచ్ఛనిచ్చింది. అయి­తే మెరిట్‌ పాటించాలని, క్యాపిటేషన్‌ ఫీజు వసూలు చేయవద్దని ఆదేశించింది.

ఇక ధిక్కరణ కేసుపైనే విచారణ చేపడతామంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది. తమ ఆదేశాలను ఎందుకు పాటించలేదో, ఎందుకు శిక్ష విధించకూడదో చెప్పాలని ఉన్నత విద్యా శాఖ కమిషనర్‌ దేవసేన, కార్యదర్శి బుర్ర వెంకటేశం, టీజీ ఈఏపీసెట్‌ కన్వీనర్‌ బి.డీన్‌కుమార్, శ్రీరామ్‌ వెంకటేశ్‌కు నోటీసులిచ్చింది. తదుపరి విచారణలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.  

చదవండి: Atul Kumar: ఆ విద్యార్థికి సీటివ్వండి.. ఐఐటీ ధన్‌బాద్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు

ఏమిటీ కేసు.. 

ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఏఐసీటీఈ, జేఎన్టీ­యూ ఆమోదించిన ప్రకారం కంప్యూటర్‌ సైన్స్, ఐటీ, సైబర్‌ సెక్యూరిటీ వంటి కోర్సుల్లో సీట్ల సంఖ్య పెంచి, మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి వాటిని భర్తీ చేయాలని సెప్టెంబర్‌ 9న హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఆ తర్వాత కూడా ప్రభుత్వం సీట్ల పెంపును అనుమతించలేదంటూ హైకోర్టులో విద్యా జ్యోతి ఎడ్యుకేషనల్‌ సొసైటీ సహా పలు కాలేజీలు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం అక్టోబర్ 21న మరోసారి విచారణ చేపట్టింది.

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి, స్పెషల్‌ జీపీ రాహుల్‌రెడ్డి, కాలేజీల తరఫున సీనియర్‌ న్యాయవాదులు దేశాయి ప్రకాశ్‌రెడ్డి, ఎస్‌.నిరంజన్‌రెడ్డి తదితరులు వాదనలు వినిపించారు.  

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

అధికారుల అలసత్వం క్షమించరానిది.. 

తొలుత రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు పిటిషన్‌ కొట్టివేతపై రివ్యూ దాఖలు చేశామని, వాదనలు వినిపించడానికి సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించాలనే ఉద్దేశం లేదని, ఇప్పటికే కౌన్సెలింగ్‌ పూర్తి కావడంతో మాప్‌ అప్‌ సాధ్యం కాదని చెప్పారు. అయితే ఏఐసీటీఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియకు విధించిన గడువు అక్టోబర్ 23తో ముగుస్తుందని కాలేజీల తరఫు న్యాయవాదులు చెప్పారు.

కోర్టు ధిక్కరణ కింద అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ అలసత్వం క్షమించరానిదని వ్యాఖ్యానించింది. విద్య, కాలేజీలకు సంబంధించిన అంశాల్లో రాజకీయాలు చూడరాదని, సర్కార్‌ అందుకే అనుమతి ఇవ్వనట్లుగా భావించాల్సి వస్తోందని చెప్పింది. తదుపరి విచారణలో కోర్టు ధిక్కరణపై వాదనలు విని చట్టప్రకారం శిక్షపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు సర్కారు 

నాలుగు ఇంజనీరింగ్‌ కళాశాలలు తమ సీట్లను భర్తీ చేసుకోవచ్చంటూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేయా­ల­ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తీర్పు అమలు చేస్తే ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని భావిస్తోంది.

సింగల్‌ జడ్జి వెలువరించే పూర్తి స్థాయి ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని డివిజన్‌ బెంచ్‌ పేర్కొందని, ఒకవేళం సింగల్‌ జడ్జి తీర్పు ప్రస్తుత తీర్పునకు వ్యతిరేకంగా వస్తే ఇప్పుడు చేరే విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోతారు కాబట్టి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. 

#Tags