TS Teacher Jobs 2023 : టీచర్ ఉద్యోగాలు.. ప్రభుత్వం చెప్పింది 13 వేలు.. విద్యాశాఖ తేల్చింది 22 వేలు.. ఏది నిజం..?
నిరుద్యోగుల ఆందోళనలు, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల నుంచి అసంతృప్తి ఎక్కువవుతోంది. దీంతో విద్యాశాఖ మల్లగుల్లాలు పడుతోంది. టీచర్ల నియామక ప్రకటన రాజకీయంగా కలిసి వస్తుందని ప్రభుత్వం భావిస్తుంటే, అసంతృప్తి, విమర్శలకు దారి తీస్తుందని ప్రభుత్వ వర్గాలు కంగారు పడుతున్నాయి.
పోస్టులు పెంచడం సాధ్యమా.. లేదా..?
ఈ క్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి తాజాగా నివేదిక కోరారు. నియామక పోస్టులు పెంచడం సాధ్యమా? వాస్తవ ఖాళీలను వెల్లడించడం వీలవు తుందా? టీచర్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా ఏర్పడే ఖాళీలను తర్వాత భర్తీ చేస్తామనే భరోసా ఇవ్వగలమా? అని ఆమె అధికారులను అడిగినట్టు తెలిసింది. అయితే దీనిపై విద్యాశాఖ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేసినట్లు సమాచారం.
పొంతన లేని లెక్కలు ఇలా..
పాఠశాల విద్యలో 22 వేల ఖాళీలు ఉండే వీలుందని ఏడాది క్రితం విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది. గెజిటెడ్ హెచ్‌ఎం పోస్టులు 1,974, ప్రైమరీ హెచ్‌ఎం పోస్టులు 2,043, స్కూల్ అసిస్టెంట్లు 7,200, పీడీలు 25, ఎస్‌జీటీలు 6,775, లాంగ్వేజ్ పండిట్లు 688, పీఈటీలు 172, డ్రాయింగ్, మ్యూజిక్ టీచర్ పోస్టులు 1,733 ఖాళీలున్నాయని తేల్చింది. దీంతోపాటు ఎంఈవోలు 467, బాలికల పాఠశాలల హెచ్‌ఎంలు 15, డైట్ లెక్చర్లు 271, డిప్యూటీ విద్యాశాఖ అధికారులు 58, డీఈవోలు 12 మందిని నియమించాలని సర్కార్‌కు నివేదించారు. ఇందులో 13 వేల పైచిలుకు పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించింది. కానీ ఇప్పుడు 5,089 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు వెల్లడించింది.
22 వేల ఖాళీలుంటే,.. 5 వేల పోస్టుల భర్తీ ఏంటని..?
దీంతో నిరుద్యోగులు ప్రతీ రోజూ పాఠశాల విద్య డైరెక్టరేట్ వద్ద ఆందోళనలు చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా 22 వేల ఖాళీలుంటే, 5 వేల పోస్టుల భర్తీ ఏంటని నిలదీస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం టీచర్లకు పదోన్నతులు ఇస్తే కొన్ని ఖాళీలు ఏర్పడతాయని చెబుతోంది. ఈ ప్రక్రియ ముందుకెళ్లే పరిస్థితి కన్పించడం లేదు.
☛ ఇవి పాటిస్తే.. టీచర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips
ముఖ్యమంత్రే 13,500 పోస్టులు భర్తీ చేస్తామని.. నేడు..
టీచర్ పోస్టులు 22 వేల వరకూ ఖాళీగా ఉంటే, 5,089 పోస్టులే భర్తీ చేస్తామని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమే. దీనిపై ఆందోళనకు దిగితే మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు. ముఖ్యమంత్రే 13,500 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పుడా పోస్టులు ఎక్కడికి పోయాయి? 22 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తాం. – కోటా రమేష్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు
☛ TET/DSC 2023: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..
అతి తక్కువ పోస్టుల భర్తీకి..
విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లను కేటాయించే హేతుబద్దిణ అశాస్త్రీయమైంది. ఒక్కో పాఠశాలలో ఎంత మంది విద్యార్థులున్నా, అన్ని తరగతుల బోధన జరగాలి. అన్ని సబ్జెక్టులకు టీచర్లు ఉండాలి. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చడం, అతి తక్కువ పోస్టుల భర్తీకి పూనుకోవడం ఎంతమాత్రం సరికాదు.
– చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఇది ముంచిందా..?
టీచర్ నియామక ప్రకటన వెలువడేందుకు ముందు విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లా విద్యాశాఖాధికారులతో సమావేశం నిర్వ హించారు. రేషనలైజేషన్ ప్రకారం చూస్తే ఎన్ని ఖాళీలుంటాయని ఆరా తీశారు. టీచర్ పోస్టులు భారీగా కుదించుకుపోవడానికి డీఈవోల హేతుబద్దిణ నివేదికే కారణ మని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
ప్రతీ 30 మందికి ఒక టీచర్ చొప్పున అధికారులు లెక్క గట్టారు. దీన్ని కొలమానంగా తీసుకోవడం అశాస్త్రీయమని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. రాష్ట్రంలో మూడోవంతు బడుల్లో విద్యార్థుల సంఖ్య 30లోపే ఉంది. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు 26,337 ఉన్నాయి. ఇందులో 8,782 (33.35 శాతం) చోట్ల 1–30 మంది విద్యార్థులున్నారు. ఈ తరహా హేతుబద్ధీకరణను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 30 మంది కన్నా తక్కువ ఉన్నా, అన్ని తరగతులకు టీచర్లు కావాలని, కానీ హేతుబద్దిణ పేరుతో ఒకే టీచర్‌ను ఇవ్వడం వల్ల అన్ని తరగతులు ఎలా బోధిస్తారని ప్రశ్నిస్తున్నాయి. దీనివల్లే అసలైన ఖాళీలు బయటకు రాకుండా పోయాయని వాపోతున్నాయి.