DSC 2024: తరగతి గదిలో కొత్త తరం!.. ఎస్జీటీలు చేరిన వాటిలో 85% ఈ బడులే..

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల డీఎస్సీ ద్వారా ఎంపికైన 10,006 మంది కొత్త ఉపాధ్యాయులు అక్టోబర్ 16న రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో చేరారు.

వాస్తవానికి వారి నియామక తేదీ అక్టోబర్ 10 అని, అన్ని జిల్లాల డీఈవోలు పేర్కొన్నారు. ప్రతీ జిల్లాలోను కౌన్సెలింగ్‌ చేపట్టిన తర్వాత వారికి ప్రభుత్వ స్కూళ్లను కేటాయించారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఎక్కువ మంది సొంత మండలాల్లోనే విధుల్లో చేరారు.

ఇతర మండలాలకు వెళ్లిన వాళ్లు 20 శాతం ఉండొచ్చని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఎస్‌జీటీలు చేరిన వాటిలో 85 శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలే ఉన్నట్టు తెలిసింది. వీటిలో గరిష్టంగా 20 మంది విద్యార్థులే ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అక్టోబర్ 15న కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తికానందున అక్టోబర్ 16న కూడా కొనసాగినట్టు వార్తలొచ్చాయి. 

టీచర్లు రిలీవ్‌...

ఇటీవల జరిగిన సాధారణ బదిలీలు, పదోన్నతుల్లో స్థాన చలనం జరిగిన ఉపాధ్యాయులకు కొత్త టీచర్లు రావడంతో విముక్తి లభించింది. ఒకే ఉపాధ్యాయుడు ఉండటం, ఇతర ప్రాంతాల నుంచి తీసుకునే వెసులుబాటు లేకపోవడంతో దాదాపు 7 వేల మంది టీచర్లు బదిలీ అయినప్పటికీ ఇంతకాలం రిలీవ్‌ కాలేదు.

డీఎస్సీ ద్వారా కొత్త టీచర్లు రావడంతో వారికి బాధ్యతలు అప్పగించి రిలీవ్‌ అయ్యారు. అయితే మూడు నెలలుగా ఎదురుచూస్తున్న 317 మంది బాధితుల వ్యవహారం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. కొత్త నియామకాలకు ముందే ఈ సమస్యను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఆగని డిప్యుటేషన్లు

కొత్త టీచర్ల నియామకంతో ఖాళీలు భర్తీ అవుతున్న నేపథ్యంలో... మళ్లీ డిప్యుటేషన్ల అంశం విద్యాశాఖలో కలకలం రేపుతోంది. అనారోగ్య కారణాలతో డిప్యుటే షన్లు చేస్తున్న వైనం విమర్శలకు దారితీస్తోంది. డిప్యుటే షన్ల కమిటీ పరిశీలనకు పంపకుండానే ఇష్టానుసారం డిప్యూటేషన్‌ బాధ్యతలు ఇస్తున్నారని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి చావా రవి తెలిపారు.

తాజాగా మేడ్చల్‌ జిల్లాలో ఏడుగురికి ఈ తరహాలో అనుమతి ఇవ్వడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. మరి కొన్ని డిప్యుటేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగు తున్నాయని, ఇవన్నీ పైరవీలేనని సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. మేడ్చల్‌–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలకు ఇతర ప్రాంతాల నుంచి సర్దుబాటు పేరుతో అక్రమ డిప్యుటేషన్లు ఇస్తున్నారని పీఆర్‌టీయూ–తెలంగాణ నాయకుడు ఎం.చెన్నయ్య ఆరోపించారు.  

చదివిన బడిలో ఉపాధ్యాయుడిగా!

ఖానాపురం: విద్యాబుద్ధులు నేర్చిన పాఠశాల లోనే ఉపాధ్యా యునిగా ఉద్యో గం వస్తే?.. అలా ంటి అరుదైన అవకాశం పొందారు వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన వెంకటేశ్వర్లు. ఆయన 1998 నుంచి 2002 వరకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడు నుంచి పదో తరగతి వరకు చదివారు. డీఎస్సీ–2024లో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయునిగా ఎంపికైన వెంకటేశ్వర్లు అక్టోబర్ 16న విధుల్లో చేరగా.. స్థానికులు అభినందించారు.  

#Tags