Telangana: మెగా డీఎస్సీపై ఆశలు

మెదక్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉపాధ్యాయ శిక్షణ పొందిన నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

ఎన్నికల ముందు మెగా డీఎస్సీని నిర్వహిస్తామని నిరుద్యోగులకు హామీనిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు.

విద్యాశాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి ఖాళీల భర్తీకి మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు.

గతేడాది సెప్టెంబరులో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) నిర్వహించేందుకు ప్రకటన జారీ చేసింది. నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ కొనసాగుతుండగానే ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించాలన్న వారి ఆశలు అడిఆశలయ్యాయి.

చదవండి: TS TET and Mega DSC Notification 2024: ఏప్రిల్‌లోనే టెట్‌.. మెగా డీఎస్సీకి నోటిఫికేష‌న్ ఆటంకం ఇదే..!

కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై దృష్టి సారించడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఆరేళ్లుగా నియామకాలు చేపట్టకపోవడంతో ఉపాధ్యాయ ఖాళీలతో ప్రభుత్వం పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు.
కాగా మెదక్‌ జిల్లాలో మొత్తం 3,959 మంది ఉపాధ్యాయులు పోస్టులుండగా ప్రస్తుతం 3,434 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 525 పోస్టులు ఖాళీ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ప్రభుత్వానిది మంచి నిర్ణయం

కొత్తగా ఏర్పడిన ప్రభు త్వం విద్యా శాఖను గాడిలో పెట్టేందుకు యత్నిస్తోంది. అందులో భాగంగా మెగా డీఎస్సీ నిర్వహణ ప్రక్రియతోపాటు మూతపడిన పాఠశాలలను సైతం తిరిగి కొనసాగించేందుకు తీసుకున్న నిర్ణయం మంచిదే. డీఎస్సీలో పోస్టులు పెరగడం వల్ల నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే విద్యార్థులను సర్కార్‌ బడుల్లోకి రప్పించేలా కార్యాచరణను రూపొందించాలి. ఇందుకనుగుణంగా సర్కార్‌ బడుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి.
– ఎల్‌ మల్లారెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు

మూతపడిన పాఠశాలలివే..

జిల్లావ్యాప్తంగా నాలుగేళ్లుగా 27 పాఠశాలలు మూతపడ్డాయి. ఈ ఏడాది 3 పాఠశాలలు తెరచుకున్నాయి. మరో 24 పాఠశాలలకు తాళాలు వేసే ఉన్నాయి. ఇక్కడ విద్యార్థుల సంఖ్య తక్కవువగా ఉందని మరో పాఠశాలలో వారిని చేర్చారు. ఇదంతా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగింది. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం మూత పడిన బడులను వెంటనే తెరవాలని, పాఠశాలలు లేని గ్రామం రాష్ట్రంలో ఉండకూడదని భావిస్తున్నది. దీంతో మూత పడిన పాఠశాలలు సైతం తెరచుకోనున్నాయి. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయబోతుండటంతో జిల్లాలో పోస్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.

#Tags