Third Olympic Medal: మూడో ఒలింపిక్ పతకంపై గురిపెట్టిన మనూ భాకర్
పారిస్ ఒలింపిక్స్‌లో ఇప్పటికే రెండు కాంస్య పతకాలు గెలిచిన 22 ఏళ్ల మనూ భాకర్ మూడో పతకంపై గురి పెట్టింది. ఆగస్టు 2వ తేదీ జరిగిన మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ క్వాలిఫయింగ్‌లో మనూ రెండో స్థానంలో నిలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది.
ఎనిమిది మంది షూటర్ల మధ్య నేడు(ఆగస్టు 3వ తేదీ) మధ్యాహ్నం ఒంటి గంట నుంచి జరిగే ఫైనల్లో మనూ టాప్–3లో నిలిస్తే మూడో పతకాన్ని ఖరారు చేసుకుంటుంది. దాంతోపాటు ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా 3 వ్యక్తిగత పతకాలు గెలిచిన భారత ప్లేయర్‌గా మనూ భాకర్ అవతరిస్తుంది.
ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచి..
నార్మన్ ప్రిచర్డ్ (1900 పారిస్; అథ్లెటిక్స్‌లో 2 రజతాలు), రెజ్లర్ సుశీల్ కుమార్ (2008 బీజింగ్‌లో కాంస్యం; 2012 లండన్‌లో రజతం), షట్లర్ పీవీ సింధు (2016 రియోలో రజతం; 2020 టోక్యోలో కాంస్యం) రెండు పతకాల చొప్పున సాధించగా.. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచి ప్రస్తుతం ఈ ముగ్గురి సరసన మనూ భాకర్ ఉంది.
టోక్యో ఒలింపిక్స్‌లో నిరాశపరిచి.. పారిస్‌లో మాత్రం..
టోక్యో ఒలింపిక్స్‌లో పూర్తిగా నిరాశపరిచిన మనూ భాకర్ ‘పారిస్’లో మాత్రం విశ్వరూపం ప్రదర్శిస్తోంది. తాను పాల్గొంటున్న మూడు ఈవెంట్లలోనూ మనూ భాకర్ ఫైనల్‌కు చేరి ఔరా అనిపించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో కాంస్యం.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ విభాగంలోనూ కాంస్యం గెలిచిన మనూ భాకర్ 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలోనూ పతక పోరుకు అర్హత పొందింది. 40 మంది షూటర్ల మధ్య జరిగిన క్వాలిఫయింగ్‌లో మనూ 600 పాయింట్లకుగాను 590 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది.
18వ స్థానంలో తెలంగాణ అమ్మాయి
ఇదే విభాగంలో పోటీపడ్డ మరో భారత షూటర్, తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 581 పాయింట్లు స్కోరు చేసి 18వ స్థానంతో సరిపెట్టుకుంది. టాప్–8లో నిలిచిన వారికి మాత్రమే ఫైనల్ బెర్త్‌లు ఖరారవుతాయి. 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫయింగ్‌ను రెండు భాగాలుగా నిర్వహించారు. ముందుగా ప్రెసిషన్ ఈవెంట్‌లో, తర్వాత ర్యాపిడ్ ఈవెంట్‌లో పోటీపడ్డారు. మనూ ప్రెసిషన్ ఈవెంట్‌లో 294 పాయింట్లు, ర్యాపిడ్‌లో 296 పాయింట్లు సాధించింది. క్వాలిఫయింగ్‌లో వెరోనికా (హంగేరి; 592 పాయింట్లు) టాప్ ర్యాంక్‌లో నిలిచింది.
ఆ తర్వాత హనియె రోస్తమియాన్ (ఇరాన్; 588 పాయింట్లు) మూడో స్థానాన్ని, ట్రిన్ తు విన్ (వియత్నాం; 587 పాయింట్లు) నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. నాన్ జావో (చైనా; 586 పాయింట్లు) ఐదో ర్యాంక్‌లో, జిన్ యాంగ్ (కొరియా; 586 పాయింట్లు) ఆరో ర్యాంక్‌లో, కామిలి జెద్రావ్‌స్కీ (ఫ్రాన్స్; 585 పాయింట్లు) ఏడో ర్యాంక్‌లో, కేటలిన్ మోర్గాన్ (అమెరికా; 585 పాయింట్లు) ఎనిమిదో ర్యాంక్‌లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు.
Manu Bhaker: 124 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన మనూ భాకర్.. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు..