Geographical Identification Certificate: ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు సర్టిఫికెట్‌

దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వ విద్యాలయంలోని మేధో సంపత్తి హక్కుల కేంద్రం(సీఐపీఆర్‌) కృషితో ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు లభించిందని వర్సిటీ ఉపకులపతి ఆచార్య శ్రీసుధ వెల్లడించారు.
Geographical Identification Certificate

రాష్ట్రంలోని సుమారు 30 రకాల ఉత్పత్తులను గుర్తించి వాటికి కూడా గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని.. ఇందులో భాగంగా మాడుగుల హల్వాకు గుర్తింపు తెచ్చేలా రాష్ట్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ డిపార్ట్‌మెంట్‌తో ఒప్పందం చేసుకున్నామన్నారు. సీఐపీఆర్‌ ఆధ్వర్యంలో వర్సిటీలో శుక్రవారం ఒక్క రోజు జాతీయ సదస్సు జరిగింది. మేధో సంపత్తి హక్కుల నిపుణుడు, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ ఆచార్యుడు ఉన్నత్‌ పి.పండిట్‌ వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీసీ శ్రీసుధ మాట్లాడుతూ మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో స్థానిక ఉత్పత్తులు ఎంతో ప్రసిద్ధి చెందుతాయని.. వాటిని తయారు చేయడంలో ఆ ప్రాంత వాసులు ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉంటారన్నారు.

GI Tag for Atreyapuram Pootarekulu: ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్‌

ఆ ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆచార్య ఉన్నత్‌ పి.పండిట్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 16 రకాల ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు లభించిందని, అందులో తిరుపతి లడ్డూ ఎంతో ప్రత్యేకమైనదన్నారు. భౌగోళిక చట్టం అమల్లోకి వచ్చిన రోజునే ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు సర్టిఫికెట్‌ను ప్రదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. పూత రేకుల ఉత్పత్తిదారులు తమ గుర్తింపును కాపాడుకునేందుకు మరింత కృషి చేయాలని సూచించారు. భౌగోళిక గుర్తింపు సంస్థ ప్రతినిధి సంజయ్‌ గాంధీ మాట్లాడుతూ ప్రతి న్యాయ విద్యార్థి కనీసం మూడు నుంచి నాలుగు ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు తెచ్చే విధంగా కృషి చేయాలన్నారు. అనంతరం పూతరేకుల ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులకు వీసీ గుర్తింపు సర్టిఫికెట్‌ అందజేశారు. మాడుగుల హల్వాకి భౌగోళిక గుర్తింపు తీసుకొచ్చేందుకు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. రాష్ట్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ విభాగం ప్రతినిధి మారుతి, ఆత్రేయపురం పూతరేకుల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు రామరాజు, ప్రసాద రాజు, మోదకొండమ్మ తల్లి మాడుగుల హల్వా తయారీ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

GI Tag for Halwa: హల్వాకు భౌగోళిక గుర్తింపు కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం అడుగులు

#Tags