AP GSDP: ఏపీ స్థూల ఉత్పత్తిలో భారీగా పెరుగుదల

గత నాలుగేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.3,74,369 కోట్లు పెరిగింది. అలాగే రాష్ఠ్ర తలసరి ఆదాయం గత నాలుగేళ్లలో 65,487 రూపాయలు పెరిగింది.
AP GSDP

 ఆర్‌బీఐ మంగళవారం విడుదల చేసిన గణాంకాలు ఈ వివరాలు వెల్లడించాయి. ప్రస్తుత ధరల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థపై రాష్ట్రాల వారీగా గణాంకాలను ఆర్‌బీఐ ఈ నివేదికలో వెల్లడించింది.
గత నాలుగేళ్లుగా వ్యవసాయం, తయారీ రంగం, రియల్‌ ఎస్టేట్‌ తదితర రంగాల ఆర్థిక కార్యకలాపాల ద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తికి విలువ జోడించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.7,90,810 కోట్లు ఉండగా 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.11,65,179 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. ముఖ్యంగా 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో వ్యవసాయ రంగం  కార్యకలాపాల విలువ భారీగా పెరుగుతున్నట్లు పేర్కొంది.

Geographical Identification Certificate: ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు సర్టిఫికెట్‌

2018–19లో ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ ఆర్థిక కార్యకలాపాల నికర విలువ రూ.2,61,448 కోట్లు ఉందని, ఈ విలువ ప్రతి ఏటా పెరుగుతూ 2022–23లో రూ.4,16,441 కో­ట్ల­కు చేరిందని వివరించింది. అలాగే తయారీ రంగం ఆర్థిక కార్యకలాపాల విలువ 2018–19లో రూ.­67,393 కోట్లు ఉండగా 2022–23కి రూ.89,180 కోట్లకు పెరిగింది. నిర్మాణ రంగం ఆర్థిక కార్యకలాపాల విలువ 2018–19లో రూ.56,106 కోట్లు ఉండగా 2022–23 నాటికి రూ.76,694 కోట్లకు పెరిగింది.

Swachh Vayu Sarvekshan Award 2023: గుంటూరుకు స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌–2023’లో అవార్డు

రియల్‌ ఎస్టేట్, యాజమాన్యం, నివాసం, వృత్తిపరమైన సేవల ఆర్థిక కార్యకలాపాల విలువ 2018–19లో రూ.58,147 కోట్లు ఉండగా 2022–23కి రూ.82,775 కోట్లకు పెరిగినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. రాష్ట్రంలో తలసరి ఆదాయం కూడా గత నాలుగేళ్లుగా పెరుగుతూనే ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం తొలిసారిగా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2 లక్షలు దాటింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 ఉండగా 2022–23కి రూ. 2,19,518 రూపాయలకు పెరిగిందని ఆర్‌బీఐ పేర్కొంది.

AP Tops in capital Expenditure: మూలధన వ్యయంలో ఏపీ టాప్‌

#Tags