Iran-Israel war: ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ మెరుపుదాడి.. ఎన్ని క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిదంటే..

సిరియాలో తమ ఎంబసీపై ఇజ్రాయెల్‌ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ మెరుపుదాడికి దిగింది.

ఏప్రిల్ 14వ తేదీ 300కుపైగా క్షిపణులు, డ్రోన్లు, బాలిస్టిక్‌ మిస్సైల్స్‌తో భీకరదాడికి తెగబడింది. ఇరాన్‌ తన భూభాగం నుంచి నేరుగా ఇజ్రాయెల్‌పై సైనిక చర్యకు దిగడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. 

మధ్యధరా సముద్రంలో సిద్ధంగా ఉన్న అమెరికా యుద్ధనౌకల నుంచి ప్రతిగా ప్రయోగించిన క్షిపణులు, ఇజ్రాయెల్‌ ప్రయోగించిన క్షిపణులు ఈ ఇరాన్‌ మెరుపుదాడిని విజయవంతంగా ఎదుర్కొన్నాయి. ఫ్రాన్స్, బ్రిటన్, జోర్డాన్‌ దేశాలు ఈ విషయంలో ఇజ్రాయెల్‌కు సాయపడ్డాయి. లెబనాన్, జోర్డాన్‌ గగనతలాల మీదుగా దూసుకొచ్చిన వాటిల్లో దాదాపు 90 శాతం క్షిపణులు, డ్రోన్లు, బాలిస్టిక్‌ మిస్సైళ్లను గాల్లోనే తుత్తినియలు చేశామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. అయితే కొన్ని బాలిస్టిక్‌ క్షిపణులు మాత్రం ఇజ్రాయెల్‌ భూభాగాన్ని తాకాయి. దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఇజ్రాయెల్‌ ఐడీఎఫ్‌ సైనిక స్థావరం దెబ్బతింది.  

ఖండించిన ప్రపంచ దేశాలు..
ఇరాన్‌ దాడిని ప్రపంచదేశాలు ఖండించాయి. ‘ఈ శత్రుత్వాలకు వెంటనే చరమగీతం పాడండి. లేదంటే ఈ ఉద్రిక్త పరిస్థితి పశ్చిమాసియాను పెను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. పరస్పర సైనిక చర్యలకు దిగకండి’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ వేడుకున్నారు. భారత్, కెనడా, బ్రిటన్‌ సహా పలు దేశాలు ఇరాన్‌ సైనికచర్యను తప్పుబట్టాయి.

Russia-Ukraine war: రష్యాపై డ్రోన్లతో దాడి చేసిన‌ ఉక్రెయిన్

పౌరుల భద్రతపై భారత్‌ ఆందోళన
ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయపౌరుల భద్రతపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. అక్కడి ఎంబసీలు మన పౌరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారంటూ మరో ముఖ్య అడ్వైజరీని విడుదలచేసింది. ‘అనవసరంగా బయటికి వెళ్లకండి. మీ పేర్లను సమీప ఎంబసీల్లో రిజిస్టర్‌ చేసుకోండి. శాంతంగా ఉంటూ భద్రతా సూచనలు పాటించండి’ అని సూచించింది. 
హార్మూజ్‌ జలసంధి వద్ద ఇజ్రాయెల్‌ కుబేరుడికి చెందిన నౌకను ఇరాన్‌ బలగాలు హైజాక్‌చేసిన ఘటనలో అందులోని 17 మంది భారతీయ సిబ్బంది విడుదల కోసం చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. ఇరాన్‌ గగనతల దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌ నగరానికి ఢిల్లీ నుంచి విమానసర్వీసులను నిలిపేస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. 

Rocket Force: ప్రపంచాన్ని వణికిస్తున్న రాకెట్‌ ఫోర్స్‌..!

#Tags