Electric Airliner: త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్న‌ విద్యుత్‌ విమానం..

ప్రపంచమంతటా త్వరలో పూర్తిస్థాయి విద్యుత్‌ విమానం అందుబాటులోకి రానుంది.

ఒక్కసారి చార్జ్‌ చేస్తే 805 కిలోమీటర్ల దూరం వెళ్లగలిగేలా దీన్ని తయారు చేస్తున్నట్టు నెదర్లాండ్స్‌కు చెందిన ఎలిసియాన్‌ అనే స్టార్టప్‌ కంపెనీ ప్రకటించింది. ఈ9ఎక్స్‌గా పిలుస్తున్న ఈ విమానంలో 90 మంది ప్రయాణించవచ్చు. దీన్ని 2030 నాటికి వాణిజ్యపరంగా అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ చెబుతోంది. 

‘అప్పటికల్లా విద్యుత్‌ బ్యాటరీల సామర్థ్యం బాగా పెరుగుతుంది. కనుక మా విమానం ప్రయాణ రేంజ్, మోసుకెళ్లగలిగే ప్రయాణికుల సంఖ్య కూడా కచ్చితంగా పెరుగుతాయి’ అని కంపెనీ డిజైన్, ఇంజనీరింగ్‌ డైరెక్టర్‌ రేనార్డ్‌ డి వ్రైస్‌ వివరించారు. వీలైనంత తక్కువ బరువు, అదే సమయంలో పూర్తిస్థాయి భద్రత, గరిష్ట సామర్థ్యం ఉండేలా విమానాన్ని డిజైన్‌ చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

➤ ఈ9ఎక్స్‌ చూసేందుకు 1960ల నాటి జెట్‌ మాదిరిగా ఉంటుంది. ఇందులో 8 ప్రొపెల్లర్‌ ఇంజన్లు, బోయింగ్‌ 737, ఎయిర్‌బస్‌ ఏ230లను కూడా తలదన్నేలా 42 మీటర్ల పొడవైన రెక్కలుంటాయి.  
➤ ఒక్కసారి మార్కెట్లోకి వచ్చిందంటే దేశీయంగా తక్కువ దూరాలకు ఈ విమానమే బెస్ట్‌ ఆప్షన్‌గా మారుతుంది.
➤ అలాగే.. వాయు, శబ్ద కాలుష్యం కారణంగా విమానాల రాకపోకలపై ఆంక్షలున్న ద్వితీయశ్రేణి నగరాలకు మా విమానం వరప్రసాదమే కాగలదు. పైగా ప్రయాణ సమయంలో విమానం లోపల ఎలాంటి శబ్దాలూ వినిపించవు. 
➤ ప్రస్తుత విమానాల్లో క్యాబిన్‌ లగేజీ పెద్ద సమస్య. ఈ విమానంలో క్యాబిన్‌ లగేజీ సామర్థ్యాన్ని బాగా పెంచడంపైనా డిజైనింగ్‌లో ప్రత్యేక దృష్టి.  

Passport: అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో వెనకబడ్డ భారత్.. మొదటి స్థానంలో ఉన్న దేశం ఇదే!

అరగంటలో చార్జింగ్‌ 
ఎలక్ట్రిక్‌ వాహనం అనగానే ప్రధానంగా ఎదురయ్యే సమస్య చార్జింగ్‌. విపరీత మైన పోటీ నెలకొని ఉండే దేశీయ వైమానిక రంగంలో విమానం ఎంత త్వరగా తర్వాతి ప్రయాణానికి సిద్ధమవుతుందన్నది చాలా కీలకం. ముఖ్యంగా చౌక విమానయాన సంస్థలకు ప్రయాణికుల ఆదరణను నిర్ణయించడంలో దీనిదే కీలక పాత్ర. ‘ఈ అంశంపైనా ఇప్పట్నుంచే దృష్టి సారించాం. అరగంటలోనే విమానం ఫుల్‌ చార్జింగ్‌ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’ అని వ్రైస్‌ చెప్పారు.

#Tags