New Scheme: వైద్య పరికరాల తయారీకి కొత్త పథకం

దేశీ వైద్య పరికరాల తయారీ పరిశ్రమను బలోపేతం చేసేందుకు ఒక పథకాన్ని తీసుకురానున్నట్టు కేంద్ర ఫార్మాస్యూటికల్స్‌ విభాగం సెక్రటరీ అరుణీష్‌ చావ్లా తెలిపారు.

పరిశ్రమతో విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ పథకాన్ని రూపొందించినట్టు, దీనికి ఆర్థిక శాఖ సూతప్రాయ ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. వచ్చే నెలలోనే దీన్ని అమల్లోకి తేనున్నట్టు చెప్పారు.

రెండో మెడిటెక్‌ స్టాకథాన్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చావ్లా మాట్లాడారు. వైద్య పరికరాల తయారీ పరిశ్రమ అవసరాలను తీర్చేదిగా ఈ పథకం ఉంటుందని చెప్పారు. రానున్న రోజుల్లో దిగుమతులపై ఆధారపడడాన్ని ఇది తగ్గిస్తుందన్నారు. దీర్ఘకాలంలో దేశీ పరిశ్రమ స్వయంసమృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. వైద్య పరికరాలకు సంబంధించి ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) ఇప్పటి వరకు సత్ఫలితాలను ఇచ్చినట్టు, 20 పెద్ద ప్రాజెక్టులు కార్యకలాపాలు ప్రారంభించినట్టు చెప్పారు.

కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ (సీటీ) స్కాన్, ఎంఆర్‌ఐ, అల్ట్రాసౌండ్‌ స్కాన్, డయలాసిస్‌ మెషిన్లు దేశీయంగా తయారవుతున్నట్టు చావ్లా తెలిపారు. గతేడాది కేంద్ర కేబినెట్‌ ‘నేషనల్‌ మెడికల్‌ డివైజెస్‌ పాలసీ’కి ఆమోదం తెలిపింది. వచ్చే ఐదేళ్లలో 50 బిలియన్‌ డాలర్ల స్థాయికి పరిశ్రమ ఎదిగేందుకు ఈ విధానం తోడ్పడుతుందని కేంద్రం భావిస్తోంది.

RBI: బ్యాంకింగ్ వ్యవస్థపై ఆర్‌బీఐ నివేదిక.. తాజా ఆవిష్కరణలు ఇవే..

#Tags